Monday, January 20, 2025

విధ్వంసం నుంచి విజయ తీరాలకు

- Advertisement -
- Advertisement -
సమైక్య పాలనలో సంక్షుభిత తెలంగాణ.. స్వపరిపాలనలో సుభిక్ష తెలంగాణ

పదేళ్ల నాటి పరిస్థితులు తలుచుకుంటే ఇప్పటికీ గుండె పిండేస్తుంది
నేడు పిన్న తెలంగాణే దేశానికి ప్రగతి పతాకగా అవతరించింది
ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రక్షాళన
అనతికాలంలోనే తిరుగులేని విజయాలు
అనేక రంగాల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానానికి
తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో మనమే నెంబర్ వన్
విద్యుత్ రంగంలో తెలంగాణది స్ఫూర్తిదాయకమైన విజయగాథ
ఇటీవలి వర్షాల్లో మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
కూలిన ఇండ్లకు గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం
పంటలు దెబ్బతిన్న రైతులకు మళ్లీ విత్తనాలు, ఎరువులు
ఐటి రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన రాష్ట్రం
తెలంగాణ ఆవిర్భావం తర్వాత 6లక్షల ఐటి కొలువులొచ్చాయి
7.5శాతం మేర తగ్గిన పేదరికం
నేటి నుంచి హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ

మన తెలంగాణ/హైదరాబాద్ : విధ్వంస తెలంగాణను తొమ్మిదేళ్లలో విజయ తీరాల వైపు నడిపించామని సిఎం కె సిఆర్ పేర్కొన్నారు. 77వ స్వాతంత్య్ర ది నోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో ని రాణిమహల్ ప్రాంగణంలో కెసిఆర్ జా తీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు కెసిఆర్ పోలీసుల గౌరవ వంద నం స్వీకరించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి గోల్కొండకు చేరుకున్న ముఖ్యమంత్రికి ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి శాంతి కుమారి, డిజిపి అంజనీకుమా ర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్, కళాకారులు ఘన స్వాగతం పలికారు. గోల్కొండ కోటపై జాతీయ జెండా ను ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజల ను ఉద్దేశించి కెసిఆర్ ప్రసంగించారు. దే శ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో అహింసాయుతంగా, శాంతియుత పంథాలో మ నం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని సిఎం సమైక్య పాలన లో తెలంగాణలోని అన్నిరంగాలు విధ్వంసమైపోయాయని తె లంగాణ నాయకత్వం సమైక్య నాయకుల కు కొమ్ముకాస్తూ చేవచచ్చి చేష్టలుడిగి ప్ర వర్తించడం వల్లనే తెలంగాణ తీవ్రమైన వి వక్ష, దోపిడీకి గురైందని కెసిఆర్ తెలిపా రు. తెలంగాణ ప్రజలంతా ఒక్కతాటిపై ని లిచి చేసిన సుదీర్ఘ ప్రజాఉద్యమం ఫలితం గా స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని ము ఖ్యమంత్రి తెలిపారు.
దు:ఖం తన్నుకొస్తది..
పదేళ్ల క్రితం తెలంగాణ సంక్షుభిత జీవనచిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ గుండె లు పిండేసినట్లయి దుఃఖం తన్నుకొస్తదని కెసిఆర్ అన్నారు. ఎటుచూసినా పడావుపడ్డ పొలాలు, పూడుకుపోయిన తుమ్మ లు, మొలిచిన చెరువులు, ఎండిపోయి దు బ్బతేలిన వాగులు, అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిపోయిన బావులు, పాతా ళం లోతుకు పోయినా సుక్క నీరు కానరా ని బోర్లు, ఎడతెగని కరెంటు కోతలు, అర్ధరాత్రి మోటరు పెట్టబోయి కరెంట్ షాకుతో, పాము కాటుకో బలైపోయిన రైతన్నల జీవితాలు, అప్పుల ఊబిలో చిక్కి ఆశ లు సైతం అడుగంటి ఆఖరుకు ఆత్మహత్యలే శరణ్యమైన అన్నదాతలు, బతుకుమీద ఆశ చచ్చి ఉరి పెట్టుకుంటున్న చేనే త కార్మికులు, యువకులంతా వలసెల్లిపోతే ముసలివాళ్లే మిగిలిన పల్లెలు, ఇళ్ల కు తాళా లు పడి గడ్డి మొలుస్తున్న గోడలు, మొరం తేలిన వాకిళ్లు, ఎటుచూసినా ఆకలిచావులు, హాహాకారాలు, గంజి కేం ద్రాలతో ఆదుకోవాల్సిన గడ్డు పరిస్థితులు ఉండేవని కెసిఆర్ పేర్కొన్నారు. ఇటువం టి అగమ్య గోచర పరిస్థితుల నడుమ అధికారంలోకి వచ్చిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్రయజ్ఞంగా నిర్వహించిందన్నారు. నిజాయితీతో, నిబద్ధతతో, నిరంతర మేధోమ ధనంతో అవిశ్రాంతంగా శ్రమించి, వి ధ్వంసమైపోయిన తెలంగాణను విజయవంతంగా వికాసపథం వైపు నడిపించామని కెసిఆర్ స్పష్టం చేశారు.
సంక్షేమంలో కొత్త పుంతలు
ప్రజల అవసరాలు, ఆకాంక్షలు ఎరిగిన ప్రభుత్వం కనుక, దానికి అనుగుణంగా అన్నిరంగాలనూ ప్రక్షాళన చేశామని కెసిఆర్ తెలిపారు. అనతి కాలంలోనే తిరుగులేని ఫలితాలను సాధించామన్నారు. అనేక రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టామన్నారు. దార్శనిక దృక్పథంతో, పారదర్శక విధానాలతో, అభివృద్ధిలో, సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కిందన్నారు. తెలంగాణ ఆచరిస్తుందని, దానిని దేశం అనుసరిస్తుందనే దశకు చేరుకొని దశాబ్ది ముంగిట సగర్వంగా నిలిచిందని కెసిఆర్ పేర్కొన్నారు. నేడు తెలంగాణ జీవన దృశ్యాన్ని చూస్తే నిరంతర విద్యుత్ ప్రసారంతో వెలుగులు వెదజల్లుతోందని కెసిఆర్ తెలిపారు. పంట కాల్వలతో, పచ్చని చేన్లతో కళకళలాడుతుందన్నారు. మండే ఎండల్లో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నాయని, వాగులు, వంకలు, వాటిపై నిర్మించిన చెక్ డ్యాములు నీటి గలగలలతో తొణికిసలాడుతున్నాయని కెసిఆర్ పేర్కొన్నారు.
తరలివస్తున్న కాళేశ్వర జలధారలతో
తరలివస్తున్న కాళేశ్వర జలధారలతో గోదావరి సతత జీవధారయై తెలంగాణ భూములను తడుపుతోందన్నారు. ఒకనాడు చుక్క నీటికోసం అలమటించిన తెలంగాణ ఇప్పుడు ఇరవైకి పైగా రిజర్వాయర్లతో పూర్ణకలశం మాదిరిగా తొణికిసలాడుతోందన్నారు. మూడు కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడితో నేడు తెలంగాణ దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతోందన్నారు.
తలసరి విద్యుత్ వినియోగంలో నెంబర్‌వన్‌గా
ప్రపంచంలో ఎక్కడైనా ఒక దేశం, ఒక రాష్ట్రం సాధించిన ప్రగతికి ప్రమాణంగా నిలిచేవి ప్రబల సూచికలని కెసిఆర్ తెలిపారు. అవే తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగమని కెసిఆర్ చెప్పారు. ఈ రెండింటిలోనూ తెలంగాణ దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పటిష్టమైన క్రమశిక్షణతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసిందన్నారు. సంపద పెంచింది. ప్రజలకు పంచింది. దేశంలో స్థిరపడిన పెద్ద రాష్ట్రాలను అధిగమించి నూతన రాష్ట్రం తెలంగాణ రూ. 3 లక్షల 12 వేల 398 తలసరి ఆదాయంతో అగ్రస్థానం లో నిలిచిందని పేర్కొన్నారు. అదేవిధంగా తలసరి విద్యుత్ వినియోగంలో జాతీయ సగటు అయిన 1,255 యూనిట్లను అధిగమించామన్నారు. దేశ సగటు కంటే 70 శాతం అత్యధికంగా 2,126 యూనిట్ల సగటు వినియోగంతో తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని కెసిఆర్ తెలిపారు.
తెలంగాణది స్ఫూర్తిదాయకమైన విజయగాథ
విద్యుత్‌రంగంలో తెలంగాణది స్ఫూర్తిదాయకమైన విజయగాథ అని కెసిఆర్ పేర్కొన్నారు. అనతికాలంలోనే అన్నిరంగాలకు 24 గంటలపాటు, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని కెసిఆర్ తెలిపారు. విద్యుత్ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన అభివృద్ధి అన్నిరంగాలను ప్రభావితం చేసిందన్నారు. రాష్ట్రం ప్రగతిపథంలో పయనించేందుకు నిరంతర విద్యుత్ చోదకశక్తిగా పనిచేసిందని కెసిఆర్ తెలిపారు.
వరద సాయం రూ.500 కోట్లు విడుదల
రాష్ట్రంలో గత నెలలో అనూహ్యంగా, అసాధారణ స్థాయిలో భారీ వర్షాలు కురిశాయని, ప్రభుత్వం ఎప్పటి కప్పుడు అతివృష్టి పరిస్థితులను అంచనా వేస్తూ, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని కెసిఆర్ పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి, ఆయా ప్రదేశాలకు సుశిక్షితులైన సిబ్బందిని, పడవలను, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను, భారత వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్లను వినియోగించామని కెసిఆర్ తెలిపారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, సహాయ శిబిరాలు ఏర్పాటుచేసి ఆదుకున్నామని కెసిఆర్ తెలిపారు. తక్షణ సహాయ చర్యల కోసం ప్రభుత్వం రూ. 500 కోట్లు విడుదల చేసిందని, ఊహించని రీతిలో కుంభవృష్టి కురిసి, వరదలు సంభవించినా, ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకొని ప్రాణ, ఆస్తి నష్టాన్ని చాలావరకు నివారించగలిగామని అన్నారు.
దెబ్బతిన్న ఇళ్లకు గృహలక్ష్మి పథకంలో సాయం
అతివృష్టి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆదుకుంటుందని కెసిఆర్ హామీ ఇచ్చారు. దెబ్బతిన్న ఇళ్లకు గృహలక్ష్మి పథకం కింద ప్రభుత్వం సాయం అందిస్తుందన్నారు. వరదల్లో కోతకు గురైన పొలాల సంఖ్యను అంచనా వేస్తున్నామన్నారు. జూన్, జూలై నెలల్లో వర్షపాతంలో కలిగిన లోటును ఈ భారీ వర్షాలు భర్తీ చేశాయని, రాష్ట్రంలోని అన్ని జలాశయాలూ నిండుకుండలుగా మారాయని, ఈసారి వరిసాగు రికార్డు స్థాయిలో 64 లక్షల 54 వేల ఎకరాలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. పంటలు దెబ్బతిన్న రైతులు మళ్లీ విత్తనాలు వేసుకొనేందుకు వీలుగా అందుబాటులో ఉంచుతున్నామన్నారు.
7.3 శాతం పేదరికం కనుమరుగు
‘సంపద పెంచు-ప్రజలకు పంచు’ అనే సదాశయంతో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా తెలంగాణలో పేదరికం తగ్గుతుందని, తలసరి ఆదాయం పెరుగుతుందని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన బహుముఖీయ పేదరిక సూచీ స్పష్టం చేసిందని కెసిఆర్ తెలిపారు. జాతీయ స్థాయిలో నమోదైన సగటు పేదరికంతో పోల్చిచూస్తే తెలంగాణలో పేదరికం అందులో మూడోవంతుగా నమోదైందన్నారు. ఈ నివేదిక ప్రకారం 2015-,16 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం, 2019,-21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చిందన్నారు. అంటే, ఏకంగా 7.3 శాతం పేదరికం కనుమరుగైందని కెసిఆర్ పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రతిభకు, పటిమకు తిరుగులేని నిదర్శనం
బిఆర్‌ఎస్ ప్రభుత్వం సమగ్ర, సమ్మిళిత, సమీకృత అభివృద్ధిని సాధిస్తూ పురోగమిస్తుందని సిఎం కెసిఆర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ, నగర ప్రాంతాల్లోనూ ఏకకాలంలో మౌలిక వసతుల కల్పన చేస్తూ సమగ్ర దృక్పథాన్ని అవలంభిస్తుందని ఆయన వెల్లడించారు. దళిత బడుగు, బలహీన వర్గాలు, రైతాంగం మొదలుకొని అగ్రవర్ణ పేదల వరకు అందరికీ సంక్షేమ ఫలాలను అందజేస్తూ, సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తుందన్నారు. వికేంద్రీకరణను ఒక విలువగా పాటిస్తూ పరిపాలనలో సంస్కరణలు చేసిందన్నారు. అదే విధంగా పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరింప జేస్తూ అభివృద్ధిని వికేంద్రీకరిస్తుందని కెసిఆర్ వెల్లడించారు. అభివృద్ధికి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యతనిస్తూ పేదవర్గాలను ఆదుకుంటుంద న్నారు. అందుకే నేడు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం తెలంగాణ అభివృద్ధి నమూనాకు జై కొడుతున్నారన్నారు. అతి పిన్న రాష్ట్రం తెలంగాణ అభివృద్ధి మోడల్ గురించి ఇప్పుడు దేశమంతటా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత బిఆర్‌ఎస్ ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ఆసరా పెన్షన్లను రూ.200 నుంచి రూ.2,016కు పెంచిందన్నారు. 2014 నాటికి ఆసరా లబ్ధిదారుల సంఖ్య కేవలం 29 లక్షలని, నేడు వారి సంఖ్య 44 లక్షలకు పెరిగిందని తెలిపారు. ఇటీవల దివ్యాంగుల పెన్షన్‌ను రూ.4016 రూపాయలకు పెంచామన్నారు.
తెలంగాణ దేశానికే ఆదర్శంగా….
రైతు సంక్షేమం వర్ధిల్లుతున్న రాష్ట్రంగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సమైక్య పాలన సృష్టించిన వ్యవసాయ సంక్షోభం నుంచి తెలంగాణను సత్వరమే బయటపడేసేందుకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం వడివడిగా చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. స్వరాష్ట్రం ఏర్పడిన మరుక్షణమే అప్పటివరకు రైతులకున్న పంట రుణాలను సంపూర్ణంగా మాఫీ చేసిందన్నారు. రెండోసారి అధికారంలోకి రాగానే మరోసారి పంటరుణాల మాఫీ చేపట్టిందన్నారు. మొత్తంగా తొమ్మిదిన్నరేళ్ల కాలంలో రెండు దశల్లో రాష్ట్రంలోని రైతులకు చెందిన దాదాపు రూ.37 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేశామన్నారు. దేశం మొత్తం మీద రైతులను ఈ తరహాలో రుణ విముక్తులను చేసిన ప్రభుత్వం మరొకటి లేదన్నారు.
సాగునీటి రంగంలో స్వర్ణయుగం
మిషన్ కాకతీయ, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుతోపాటు ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం తదితర చర్యల ద్వారా తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని సృష్టించిందని కెసిఆర్ తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్ సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, రైతుబంధు, రైతు బీమా, పంట రుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలతో వ్యవసాయరంగాన్ని అద్భుతంగా స్థిరీకరించి, భారత దేశ వ్యవసాయ రంగ చరిత్రలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింద న్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ ఏలుబడిలో సాగుబడి సుసంపన్నమయ్యిందని కెసిఆర్ తెలిపారు. ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకుందని కెసిఆర్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో 15వ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు పంజాబ్‌ను ఢీకొంటూ ప్రథమ స్థానానికి పోటీపడుతుందన్నారు.
కొంతమంది అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ
అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఇంతటి ఔన్నత్యాన్ని సాధిస్తుంటే, కొంతమంది అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ రైతు సంక్షేమ చర్యలకు వక్రభాష్యాలు చెబుతున్నారని కెసిఆర్ విమర్శించారు. వ్యవసాయానికి మూడుగంటల విద్యుత్ సరఫరా చాలని విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి రైతు వ్యతిరేక వైఖరికి ప్రజలే తగిన విధంగా సమాధానం చెబుతారని విశ్వసిస్తున్నానన్నారు. ‘సమైక్య రాష్ట్రంలో భయంకరమైన బాధలు అనుభవించి వలసల జిల్లాగా పేరుపడి గోసెల్లదీసిన పాలమూరుతో పాటు రంగారెడ్డి జిల్లా రైతుల కష్టాలు కడతేర్చేందుకు ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిందని తెలిపారు. 12 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడంతో పాటు, 1200 గ్రామాలకు త్రాగునీరందించే అమృతప్రాయమైన ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి విపక్ష నాయకులు తమ వికృత మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం పాలమూరు రంగారెడ్డి జిల్లాల ప్రజలను ఉసురు పోసుకోవడానికి సిద్ధపడ్డారన్నారు. అయితే, న్యాయం ఎన్నటికైనా గెలుస్తుందన్న నమ్మకంతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల ఫలించాయన్నారు. విద్రోహ మనస్తత్వంతో విపక్షాలు పెట్టిన కేసులు వీగిపోయాయన్నారు. ఇటీవలే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లభించాయని సంతోషంగా తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న పెద్ద అవరోధం తొలగిపోయింది కనుక సత్వరమే సాగునీటి కాల్వల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టుదల వహించి, అతి త్వరలోనే ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి, పాలమూరు రంగారెడ్డి జిల్లాలను సంపూర్ణంగా పచ్చని పంటల జిల్లాలుగా తీర్చిదిద్దుతుందని హామీ ఇస్తున్నానన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News