రాయ్‌బరేలితో తరతరాల గాంధీ కుటుంబ బంధం
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేయడం ఆశ్చర్యకరమైన పరిణామం అయినప్పటికీ రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ గాంధీ స్వాతంత్య్రానంతరం జరిగిన మొదటి రెండు ఎన్నికలలో ఈ స్థానం నుంచి గెలుపొందగా తదనంతరం గాంధీ కుటుంబానికి చెందిన సభ్యులే ఈ స్థానంలో అత్యధిక సార్లు గెలుపొందారు. ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ ఈ విఐపి స్థానం నుంచి పోటీ చేయడంతో యావద్దేశం దృష్టి ఈ నియోజకవర్గంపైనే పడింది.
ఈ నియోజకవర్గంలో ఫిరోజ్ గాంధీ బలంగా వేసిన పునాదులు తర్వాతి కాలంలో ఆయన భార్య, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో మరింత బలోపేతమయ్యాయి. 1967, 1971, 1980లో ఇందిరా గాంధీ ఇక్కడి నుంచే గెలుపొందారు. అనంతర కాలంలో గాంధీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుంటూ వచ్చారు. 1980 ఇంది రా గాంధీ రాయబరేలితోపాటు తెలంగాణలోని మెదక్ నుంచి పోటీ చేసి రెండుచోట్లా గెలుపొందారు. అయితే ఆమె మెదక్ సీటును ఎంపిక చేసుకోవడంతో 1980లో జరిగిన ఉప ఎన్నికలో రాయ్‌బరేలి నుంచి గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన అరుణ్ నెహ్రూ గెలుపొందారు.
1984లో కూడా ఆయనే ఇక్కడి నుంచి గెలిచారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి కుడిభుజంగా వ్యవహరించిన అరుణ్ నెహ్రూ తర్వాత అనేక మంది గాంధీ కుటుంబ సభ్యలు, స్నేహితులు ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఫిరోజ్ గాంధీ మరణానంతరం 1960లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆర్‌పి సింగ్ పోఈ చేసి రాయబరేలికి ప్రాతినిధ్యం వహించారు. 1962లో మరో కాంగ్రెస్ నాయకుడు బైజ్ నాథ్ కురీల్ ఇక్కడి నుంచి గెలుపొందారు. ఇందిరా గాంధీకి మేనత్త అయిన షీలా కౌల్ 1989, 1991లో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1999లో గాంధీ కుటుంబ మిత్రుడైన సతీశ్ శర్మ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు.
1977లో ఎమర్జెన్సీ రోజుల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ స్థానంలో జనతా పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ్ చేతిలో ఇందిరా గాంధీ ఓటమిపాలయ్యారు. 1996, 1998లో బిజెపికి చెందిన లశోక్ సింగ్ ఇక్కడ నుంచి గెలుపొందారు. అయితే ఎన్నికల రాజకీయాలలో ప్రవేశించాలని నిర్ణయించుకున్న సోనియా గాంధీ తన భర్త రాజీవ్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేథీ నుంచి పోటీ చేయాలని భావించి 1996లో అక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందారు. కాగా..తన కుమారుడు రాహుల్ గాంధీ రాజకీయ అరంగేట్రం కోసం అమేథీని త్యాగం చేసి 2004 ఎన్నికలలో తాను రాయ్‌బరేలి నుంచి పోటీ చేశారు. 2004 నుంచి 2019 మధ్య నాలుగుసార్లు రాయబరేలి స్థానానికి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు.
అయితే ఆమెకు లభించే ఓట్ల శాతం క్రమంగా తగ్గుతుండడం గమనార్హం. కాగా..గత ఎన్నికలలో బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలైన రాహుల్ గాంధీని ఈసారి ఎన్నికలలో అమేథీ నుంచి కాకుండా రాయ్‌బరేలి నుంచి బరిలోకి దించడంపై కూడా చర్చ జరుగుతోంది. అమేథీతో పోలిస్తే రాయ్‌యబరేలి మరింత సురక్షిత నియోజక వర్గమని పార్టీ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అమేథీని స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ధారాదత్తం చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ అమేథీతో పోలిస్తే రాయ్‌బరేలితో గాంధీ కుటుంబానికి ఉన్న చారిత్రక, భావోద్వేగ, ఎన్నికల పరమైన ప్రాధాన్యత అధికమని పార్టీ భావిస్తోంది.
రాయబరేలి నుంచి ఇక పోటీ చేయకూడదని నిర్ణయించుకున్న తర్వాత ఫిబ్రవరి 15న సోనియా గాంధీ రాయబరేలి ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో ఈ నియోజవకర్గంతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. గాంధీ కుటుంబం ఈ బంధాన్ని కొనసాగిస్తుందని కూడా ఆమె హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తన గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీనే ఇక్కడి నుంచి ఆమె బరిలోకి దింపారు.