ఖమ్మం : ఖమ్మం వేదికగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. జూలై 2న ఖమ్మంలో జరిగే రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల పరిశీలన కోసం శుక్రవారం ఖమ్మం వచ్చిన రేవంత్ రెడ్డి ముందుగా ఖమ్మం రూరల్ మండలంలో సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్కను కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం డిసిసి కార్యాలయంలో జరిగిన తెలంగాణ జన గర్జన సభ సన్నాహక సమావేశంలో పాల్గొని బాధ్యులందరికీ దిశదశ నిర్దేశించారు. అనంతరం ఎస్‌ఆర్ గార్డెన్ వెనుక భాగంలో సభ స్ధలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన సభా ప్రాంగణ ప్రదేశంలో విలేఖర్లతో మాట్లాడుతూ పొంగులేటి చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని అన్నారు.
ఖమ్మంలో 10కి 10 సీట్లు గెలిపిస్తే… రాష్ట్రంలో 80కి పైగా సీట్లు గెలిపించే బాధ్యత మాది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపించి సోనియా గాంధీకి జన్మదిన కానుక ఇస్తాం. ఖమ్మం గడ్డపై కారు గుర్తు ఉండదు.. బంగాళాఖాతంలో కలిపేస్తాం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో గత నాలుగైదు నెలలుగా చర్చలు జరిపామన్నారు. కార్యకర్తలు, అభిమానులతో చర్చించాకే ఆయన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఖమ్మం జిల్లాకు భట్టి విక్రమార్క, రేణుక రెండు కళ్లని.. పొంగులేటి మూడో కన్ను అని అన్నారు రేవంత్. తనకు కష్టమైనా, నష్టమైనా వారి అభిమానుల అభిప్రాయం మేరకు కాంగ్రెస్ లో చేరాలని పొంగులేటి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జూలై 2న ఖమ్మం సభ వేదికగా సమరశంఖం పూరించాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. అందుకే మేంమంతా ఇక్కడకు వచ్చాం.. ఏర్పాట్లను ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.
ఏర్పాట్లపై టిపిసిసి సంతృప్తి వ్యక్తం చేస్తోందన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి సాయంగా ఉండేందుకు 1500 బస్సులను సభ కోసం అద్దెకు తీసుకోవాలనుకున్నాం. కానీ ఇవ్వట్లేదు. బస్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా… ఏదీ లేకపోతే నడుచుకుంటూనైనా ఇక్కడి ప్రజలు సభకు వస్తారు..మీరు అడ్డుగోడలు కడితే దూకి వస్తారు. మీరే అడ్డు వస్తే తొక్కుకుంటూ వస్తారు అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా.. బీఆరెస్ సభ కంటే ఎక్కువ మంది కాంగ్రెస్ సభలో కదం తొక్కుతారు. కావాలంటే లెక్క పెట్టుకో అని కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. జూలై 2న ఢిల్లీ ఖమ్మం వైపు చూస్తుందన్నారు. భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి 1000 కిలోమీటర్లు నడిచారని అందుకే కేసీఆర్ పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. సోనియా గాంధీ పుట్టిన రోజున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని.. మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటదన్నారు.
- తెలంగాణ సమాజం కోసమే భట్టి పాదయాత్ర : రేవంత్ రెడ్డి
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ కోసం కాదని.. తెలంగాణ సమాజం కోసమని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద పాదయాత్ర శిబిరంలో భట్టి విక్రమార్కతో శుక్రవారం రేవంత్ భేటీ అయ్యారు.. భట్టితో భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. “ఖమ్మంలో జన గర్జనసభ ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఇక్కడకు వచ్చాం. సభ ఏర్పాట్లపై భట్టి సలహాలు, సూచనలు తీసుకున్నాం. జులై 2న జరిగే సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారు. ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తాం. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు సభకు హాజరవుతారు. జనగర్జన సభకు జిల్లా ప్రజల నుంచి వచ్చే స్పందనను అందరూ చూస్తారు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో ఏఐసిసి నాయకులు మధు యాష్కి గౌడ్,మాజీ ఎంపి మల్లు రవి, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టిపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసిసి జనరల్ సెక్రటరి రోహిత్ చౌదరి, మాజీ మంత్రులు బలరాం నాయక్,సంభాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు సీతక్క,పొడేం వీరయ్య,మాజీ ఎంపిలు వి.హన్మంతరావు,సిరిసిల్ల రాజయ్య,కొండా మురళీ,పోట్ల నాగేశ్వర్ రావు,డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, పాలేరు ఇంచార్జ్ రాయల నాగేశ్వర్ రావు,నగర అధ్యక్షులు జావేద్, ఎడవల్లి క్రష్ణ, పొంగులేటి ప్రసాద్ రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.