విక్టోరియాహోం అనుకూలం కాదని తెల్చిన మంత్రుల బృందం
మంత్రి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను దసరా నుంచి బాటసింగారంలో ప్రారంభించ నున్నట్టు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖల మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. సోమవారం రాష్ట్ర మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి , మహమూద్ అలీ గడ్డిఅన్నారం మార్కెట్ తరలింపు నేపధ్యంలో ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించారు. కొత్తపేటలోని విక్టోరియా హోం , బాటాసింగారం స్థలాలను పరిశీలించారు. అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పండ్ల మార్కెట్ తరలింపుపై కీలక ప్రకటన చేశారు. కోహెడలోని 178ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్కెట్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. దసరా రోజు పండ్ల వ్యాపారులకు కేటాయించిన స్థలానికి లేఔట్ నిర్ధారణ జరుగుతుందన్నారు. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ అస్పత్రి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు.
పండ్ల మార్కెట్‌ను తాత్కాలికంగా బాటాసింగారంలోని 11 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నామని , ఇందులో దసరా రోజు నుంచే పండ్ల విక్రయాలు ప్రారంభమవుతాయన్నారు. ఇక్కడే పార్కింగ్ ,రోడ్లు అభివృద్ది చేశామని ,కోల్డ్ స్టోరేజి వంటి వసతులు కూడ అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. కోహెడమార్కెట్ నిర్మాణం పూర్తయి , అక్కడికి మార్కెట్ వెళ్లేంతవరకూ బాటాసింగారంలో వసతుల లేమి ఏర్పడకుండా చూడాలని వ్యాపారులు చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించామన్నారు. ఔటర్ రింగ్ రొడ్డుకు చేరువలోనే ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న బాటాసింగారం మార్కెట్‌లో ఎటువంటి ఇబ్బందలు రాకుండా చూస్తామన్నారు.
శాసనసభ సమావేశాల్లో ఎంఐఎం సభ్యులు చేసిన విజ్ఞప్తి నేపధ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలమేరకు విక్టోరియా హోం ను పరిశీలించామని, అయితే అక్కడి స్థలం పండ్ల మార్కెట్ ఏర్పాటుకు అనుకూలంగా లేదని నిర్ణయించామన్నారు. బాటాసింగారంలో తాత్కాలికంగా మార్కెట్ కొనసాగింపునకు ఎంఐఎం ,టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం సమ్మతి , ప్రభుత్వ ఉద్దేశాన్ని అందరూ దూరదృష్టితో స్వాగతించారని తెలిపారు.ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోనే బాటాసింగారం మార్కెట్ ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుండి అయినా సులువుగా చేరుకోవచ్చని తెలిపారు.
ప్రభుత్వ పరంగా అన్ని విషయాల్లో వ్యాపారులకు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. పండ్లు పండించే రైతుల సౌకర్యంతోపాటు , వర్తకులకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదే అని మంత్రి హామీ ఇచ్చారు. గడ్డి అన్నారం మార్కెట్‌ను తరలింపు నేపధ్యంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కూడా నివేదించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ ,ఎమ్మెల్యేలు బలాలా , జాఫర్ హుస్సేన్ , సుదీర్ రెడ్డి, కిషన్ రెడ్డి ,మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి , ఎడి లక్ష్మణుడు ,ఎస్‌ఈ లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.