Saturday, December 21, 2024

దహి కాదు.. పెరుగు అనే రాసుకోండి: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ ఉత్తర్వులు వాపసు

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: పెరుగు ప్యాకెట్లపైన హిందీ పదం దహి అని రాయాలంటూ ఇదివరకు జారీచేసిన ఉత్తర్వులను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) గురువారం ఉపసంహరించుకుంది. కర్డ్ అన్న పదాన్ని తొలగించి దహి అని ప్యాకెట్ల పైన ముద్రించాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ జారీచేసిన ఉత్తర్వులపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది.

కర్డ్ అనే పదంతోపాటు ఆయా ప్రాంతీయ భాషలలో ఉపయోగించే పేరును కూడా రాసుకోవాలని సూచించింది. గతంలో దహి అని పెరుగు ప్యాకెట్లపై ముద్రించాలన్న ఆదేశాలను అందరికన్నా ముందుగా వ్యతిరేకించింది తమిళనాడు ప్రభుత్వం. తాము తమిళ పదం తైర్ అని మాత్రమే రాస్తామని, దహి అనే పదం ముద్రించబోమని తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఆవిన్ ఇదివరకే ప్రకటించింది.

హిందీని రుద్దడానికి ఇదో ప్రయత్నమంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ధ్వజమెత్తారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి కూడా ఈ ఉత్తర్వులను వ్యతిరేకించారు. నందిని బ్రాండుతో కర్నాటక పాల సమాఖ్య సరఫరా చేసే పాలు, పెరుగు తదితర ఆహార వస్తువులను చేజిక్కించుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంగా ఆయన ఈ చర్యను వర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News