Wednesday, January 22, 2025

ఇంధన, ఆహార సంక్షోభం

- Advertisement -
- Advertisement -

Fuel, food crisis with Russia Ukraine war

ఏ సంక్షోభమైనా తలెత్తినప్పుడు అది హద్దు మీరి పీడించకుండా సకాలంలో దానికి పరిష్కారం కనుగొని అంతమొందించే వ్యవస్థ ఉండాలి. లేని పక్షంలో తీవ్రమైన హాని కలుగుతుంది. ఎటువంటి రక్షణలు లేని అత్యంత బలహీనులు దారుణంగా దెబ్బతింటారు, బలైపోతారు. నాలుగు మాసాలు దాటి నిరవధికంగా సాగిపోతున్న ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. పేరుకి ఐక్యరాజ్య సమితి ఉన్నా దాని సొంత బలహీనతల కారణంగా అది ఎవరికీ చెప్పి వొప్పించి దారికి రప్పించే స్థితిలో లేదు. అగ్ర రాజ్యం అమెరికాయే గతంలో దాని నిర్ణయాన్ని ఉల్లంఘించి మిత్ర సేనలను కలుపుకొని ఇరాక్‌పై ఏకపక్ష యుద్ధానికి తెగబడిన సందర్భం ఉన్నది. సమితి పట్ల, దాని సంస్థల అభిప్రాయాల పట్ల యెటువంటి విధేయతా ప్రదర్శించని చరిత్ర అమెరికాది. అదే సమయంలో అవసరమనిపించినప్పుడు సమితిని స్వప్రయోజనాలకు వాడుకోడంలోనూ అది దిట్ట. అమెరికా ప్రస్తుత యుద్ధంలో రష్యా ను పరోక్షంగా రెచ్చగొట్టి, ప్రత్యక్షంగా ఉక్రెయిన్ తరపున నిలబడింది. ప్రపంచాన్ని అపూర్వ స్థాయిలో పట్టి పీడించి లక్షలాది మందిని బలి తీసుకొని దేశ దేశాల ఆరోగ్య వ్యవస్థలను అగ్ని పరీక్షకు పెట్టిన కొవిడ్‌ను సకాలంలో ఉమ్మడిగా ఎదుర్కొని బలహీనులను కాపాడడంలో మన వైఫల్యం కళ్లముందున్నదే.

అందుచేత కొమ్ములు తిరిగిన పెద్ద దేశాలను వంచి న్యాయానికి కట్టుబడేలా చేసే శక్తి సామర్ధ్యాలు ఐక్యరాజ్య సమితికి బొత్తిగా లేవు. అయితే పడగ విప్పి బుసకొట్టి ప్రపంచాన్ని కాటేసే పలు రకాల సమస్యలు, సంక్షోభాల తీవ్రతను అంచనా వేసి హెచ్చరించడంలో సమితి యెప్పటికప్పుడు తన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల యుద్ధ క్షేత్రంలోని వారికి ప్రతి రోజూ రక్తపాతం, బాధలే ఎదురవుతున్నాయని, మిగతా ప్రపంచానికి అపూర్వమైన ఆకలి, అలవికాని దారిద్య్రం సంభవించి సామాజిక ఆర్ధిక కల్లోలం ఉధృతమవుతున్నదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్టెరెస్ ఇటీవల హెచ్చరించారు. ఈ యుద్ధం సృష్టిస్తున్న తీవ్రమైన జీవన వ్యయ ప్రళయం నుంచి యే దేశమూ తప్పుకోజాలదని స్పష్టం చేశారు. రష్యా నుంచి క్రూడాయిల్ సరఫరాలు తగ్గిపోడంతో అమెరికా సహా అన్ని దేశాల్లోనూ ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయిన చేదు నిజం కళ్ళ ముందున్నదే. ఆహార భద్రతపై, ఇంధనం, ఆర్ధిక వ్యవస్థలపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించిన గుట్టెరెస్ 94 దేశాల్లోని 160 కోట్ల మంది ఈ మూడింటిలో యేదో వొక దాని కోరల్లో చిక్కుకున్నారని, యుద్ధం వల్ల అతి తీవ్రంగా నష్టపోయే దేశాల్లోని 120 కోట్ల మందిని ఈ మూడు సంక్షోభాలూ చుట్టుముట్టాయని వివరించారు.

రాబోయే కాలంలో వీరి బతుకులను, జీవనోపాధులను కాపాడడానికి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని అంతమొందించడానికి తక్షణమే నడుం బిగించవలసిన ఆగత్యాన్ని గుర్తు చేశారు. తీవ్ర ఆహార అభద్రతను ఎదుర్కొన్న ప్రజల సంఖ్య కరోనా విరుచుకుపడడానికి ముందు 10 కోట్ల 35 లక్షలు కాగా, రెండేళ్లలో వీరి సంఖ్య 20 కోట్ల 70 లక్షలకు పెరిగిందని, యుద్ధం కారణంగా 32 కోట్ల 30 లక్షలకు ఎగబాకిందని చెప్పారు. ప్రపంచంలో అత్యధికంగా గోధుమ సరఫరా చేసే దేశాల్లో ఉక్రెయిన్ వొకటి. రష్యా ఉక్రెయిన్ పై దాడి మొదలు పెట్టినప్పటి నుంచి ఇరవై మిలియన్ టన్నులకు పైగా ఉక్రెయిన్ గోధుమ ఎగుమతికి ఆటంకం ఏర్పడినట్టు వార్తలు చెబుతున్నాయి. యుద్ధ ప్రాంతం నుంచి ఎరువుల ఎగుమతికి సైతం ఆటంకం కలగటంతో బయటి ప్రపంచంలో వాటి ధరలూ విపరీతంగా పెరిగిపోయాయి. పెరిగిన ఇంధన ధరలు ఎరువులను మరింత ప్రియం చేశాయి.

ప్రపంచ మొత్తం గోధుమ ఎగుమతుల్లో 30 శాతం ఉక్రెయిన్, రష్యాల నుంచే జరుగుతున్నాయి. ఉక్రెయిన్‌ను ఆర్ధికంగా దెబ్బ తీయడానికి దాని గోధుమ ఎగుమతులను రష్యా అడ్డుకొంటున్నది. ప్రపంచ వ్యాప్తంగా 60 శాతం మంది కార్మికులు కరోనాకు ముందు పొందుతూ వచ్చిన దాని కంటే తక్కువ విలువ జీతాలు పొందుతున్నారని వొక అధ్యయనం వెల్లడించింది. యుద్ధం వీరిని మరింత దయనీయ పరిస్థితుల్లోకి నెడుతుంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర బ్యారెల్ 100 డాలర్లు దాటిపోయింది, అప్పుడప్పుడూ 110-120 డాలర్లు తాకుతున్నది. దీని ప్రభావం అన్ని సరకుల ధరల పైన పడుతున్నది. 80 శాతం క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకొంటున్న ఇండియాపై ఇది తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నది. ఇంధన, ఆహార ధరలు మిన్నంటి సాధారణ ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. వర్ధమాన ప్రపంచమంతటా ఇదే దుస్థితి నెలకొన్నది. కనీసం పేద దేశాలన్నీ అయినా ఒక్క చోట చేరి నూతన ప్రపంచ వ్యవస్థ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయవలసిన అవసరం ఎప్పటి కంటే ఎక్కువగా కనిపిస్తున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News