Friday, January 10, 2025

ఆయిల్ ధరపై ఆంక్ష!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: ఉక్రెయిన్ యుద్ధం అనేక మలుపులు తిరుగుతూ ప్రపంచంపై పలు రకాల వ్యతిరేక ప్రభావాలను చూపుతున్నది. అది కొనసాగే కొద్దీ మరెన్ని దుష్పరిణామాలకు దారి తీస్తుందో! యుద్ధం ప్రారంభమై ఎనిమిది మాసాలైంది. దాని ప్రభావం వల్ల ఆహారం, ఆయిల్ ధరలు పెరిగాయి. చివరికి అమెరికాలోనే ద్రవ్యోల్బణం విజృంభించి ప్రజల్లో అసంతృప్తిని రగిలిస్తున్నది. ఇంత కాలం తర్జనభర్జనలు పడిన జి 7 దేశాలు, ఆస్ట్రేలియా చివరికి రష్యన్ ఆయిల్ ధరపై పరిమితిని విధించాయి. బ్యారెల్ రష్యన్ ఆయిల్‌కు 60 డాలర్లు మించి (ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ ధర 90 డాలర్లు) ధర చెల్లించరాదని శాసించాయి.

ఇది సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయంతో రష్యన్ ఆయిల్ రాబడి పడిపోయి దానిని ఆర్థికంగా బలహీనపరుస్తుందని, అది యుద్ధం నుంచి రష్యా తప్పుకొనేలా చేస్తుందని జి 7 దేశాలు ఆశిస్తున్నాయి. అయితే ఇది రష్యాపై ఎటువంటి ప్రభావం చూపదని పరిశీలకులు భావిస్తున్నారు. దీని వల్ల భారత్, చైనా తదితర దేశాలు తమ కరెన్సీలతోనే రష్యా నుంచి ఆయిల్‌ను మరింతగా కొనుక్కొంటాయని, అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ పాత్ర తగ్గడానికి అది దోహదం చేస్తుందని భావిస్తున్నారు. రష్యన్ ఆయిల్ ధరపై జి 7 దేశాలు పరిమితి విధించిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు 6070 సెంట్లు పెరిగాయి. ముందు ముందు ఈ ధరలు మరింతగా పెరిగి అమెరికా, యూరపు దేశాలు సహా ప్రపంచమంతటా ఆయిల్ ఇంకా ప్రియం అవుతుంది.

అది జీవన వ్యయాన్ని ఘోరంగా పెంచివేసి బతుకులను దుర్భరం చేస్తుంది. 60 డాలర్ల పరిమితి రష్యాను బాధించే అవకాశాలే లేవని అంటున్నారు. ఎందుకంటే బ్యారెల్ ఉత్పత్తికి రష్యాకి అయ్యే ఖర్చు 20 44 డాలర్లు మాత్రమే. అందుచేత జి 7 తగ్గించిన ధరకే యూరపు దేశాలు రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేసినా దానికి లాభాలే వస్తాయి గాని అది నష్టపోయే ప్రసక్తే లేదని అంటున్నారు. రష్యన్ ఆయిల్ లేకపోతే యూరపు దేశాలు పడే కష్టాలతో పోలిస్తే రష్యాకు ఎదురయ్యే నష్టాలు పరిమితమేనని చెప్పవచ్చు. 60 డాలర్ల పరిమితి రష్యా నుంచి యూరపు దేశాలు దిగుమతి చేసుకొనే మొత్తం ఆయిల్‌లో మూడింట రెండు వంతులపై ప్రభావం చూపిస్తుంది.

కేవలం రష్యన్ ఆయిల్ మీదనే కాకుండా దానిని రవాణా చేసే నౌకలకు బీమా సౌకర్యం కల్పిస్తున్న యూరోపియన్ కంపెనీలను కూడా ఈ ధర పరిమితి ప్రభావితం చేస్తుంది. ఇంతకు మించిన ధరకు విక్రయించే రష్యన్ ఆయిల్‌ను తీసుకు వెళుతున్న నౌకలకు ఈ కంపెనీలు ఇక నుంచి బీమా సౌకర్యం కల్పించకూడదు. తన ఆయిల్‌ను మామూలు ధరకు విక్రయించడానికి అవసరమైన ప్రత్యామ్నాయ నౌకా రవాణా వ్యవస్థను రష్యా సమకూర్చుకోవలసి వుంటుంది. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు జి 27 గ్రూపు దేశాలు రష్యన్ ఆయిల్‌పై అమితంగా ఆధారపడేవి. 2021లో యూరపు దేశాలు దిగుమతి చేసుకొన్న రష్యన్ క్రూడాయిల్, రిఫైండ్ ఆయిల్ ఉత్పత్తుల మొత్తం విలువ 74.8 బిలియన్ల డాలర్లు. జి 7 దేశాలు విధించిన పరిమితికి లొంగకుండా మామూలు ధరలకే తన ఆయిల్‌ను ఇండియా, చైనా, ఇండోనేషియా, టర్కీ వంటి యూరపేతర దేశాల నౌకల ద్వారా రష్యా సరఫరా చేసుకొనే అవకాశాలు లేకపోలేదు.

ఈ మార్గాన్ని గనుక రష్యా ఆశ్రయిస్తే తమ ధరల ఆంక్ష అభాసుపాలవుతుందని యూరపు దేశాలు, అమెరికా లోలోపల భయపడుతూ వుండవచ్చు. అలాగే కొనుగోలుదార్లతో లోపాయికారీ అవగాహన కుదుర్చుకొని గుప్త మార్గాల్లో ఆయిల్‌ను సరఫరా చేసే దారులు రష్యాకు ఎలాగూ వుంటాయి. రష్యన్ ఆయిల్‌తోనే అవసరాలు గడుపుకొన్న యూరపు దేశాలు ఉన్నపళంగా ఆ మార్గం మూసుకుపోడం వల్ల ఈ చలికాలంలో అష్టకష్టాలు పడతాయి. రష్యా నుంచి ఇంత వరకు వస్తున్న కిమ్మత్తు మేరకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌ను యూరపు దేశాలు ఎక్కడ నుంచి తెచ్చుకుంటాయనేది ఒక కీలకమైన ప్రశ్న. ప్రస్తుతానికి నౌకల ద్వారా వచ్చే రష్యన్ ఆయిల్‌పైనే ధర పరిమితిని వర్తింప చేస్తున్నారు. పైపు లైన్ల ద్వారా దిగుమతి అయ్యే రష్యన్ ఆయిల్‌పై ఇది వర్తించదు.

ఆ రకంగా మరి కొంత కాలం పాటు 10 శాతం రష్యన్ ఆయిల్ మామూలు ధరలకు పైపు లైన్ ద్వారా అందుబాటులో వుంటుంది. మిగతా ఆయిల్‌ను మధ్య ఆసియా దేశాల నుంచి యూరపు దిగుమతి చేసుకోవలసి వుంటుంది. వాటి నుంచి వచ్చే బ్రెంట్ రకం ఆయిల్‌ను అధిక ధరకు కొనుక్కోక తప్పదు. నౌకా మార్గంలోనే కాకుండా పైపు లైన్ ద్వారా యూరపు దేశాలకు చేస్తున్న ఆయిల్ సరఫరాను సైతం ఆపివేస్తానని రష్యా ప్రకటించింది. జి 7 ఆంక్షల వల్ల ఇండియా మరింత సులువుగా, చవకగా రష్యా నుంచి ఆయిల్ పొందే అవకాశాలున్నాయి. కాని ఆ ఫలితాన్ని తన ప్రజలకు అందజేసే సదుద్దేశం ప్రధాని మోడీ ప్రభుత్వానికి లేకపోడమే ఆందోళనకరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News