న్యూఢిల్లీ: సాధారణంగా దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరగడానికి ముందు పెట్రోలు, డీజిలు ధరలు తగ్గడం మన దేశంలో సర్వసాధారణంగా జరుగుతూ ఉండడం తెలిసిందే. అలాగే రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా కేంద్రం ఇంధన ధరలు తగ్గిస్తుందని ప్రచారం ఉంది. అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని కేంద్రపెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. ఓ వార్తాసంస్థ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఇంధన ధరలు తగ్గిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ..అది కేవలం ప్రచారం మాత్రమేనని, అందులో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ చమురు ధరలు, రిఫైనింగ్ వ్యయం,పన్నులు వంటి అనేక అంశాలు ఇంధన ధరలను నిర్దేశిస్తాయని పురి చెప్పారు. ఇటుంటి అంశాలను ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందనే దానిపైనే ఇంధన ధరలు ఆధారపడి ఉంటాయని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి అనంతరం 2022లో చమురు ధరలు పెరిగిన సమయంలో ధరలు తగ్గించాలని చమురు సరఫరా చేసే దేశాలను భారత్ అడగలేదని, బదులుగా ఎక్సైజ్ పన్ను తగ్గించి వినియోగదారులకు ఊరట కలిగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదిలా ఉండగా 2022 జూన్‌నుంచి దేశంలో పెట్రోలు, డీజిలు ధరల్లో ఎలాంటి హెచ్చుతగ్గులు లేవని హర్దీప్ సింగ్ పురి ఇటీవల లోక్‌సభలో వెల్లడించిన విషయం తెలిసిందే.