వాహనదారులకు నేషనల్ ఫ్యూయల్ కార్డుల జారీ
కొలంబో : శ్రీలంకలో ఇంధన కొరత తీవ్ర స్థాయిలో చేరుకొని, పెట్రోల్ బంకుల ముందు రోజుల తరబడి ప్రజలు బారులు తీరి నిలుచోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం నేషనల్ ఇంధన పాస్ పేరుతో ఇంధన కోటా పథకాన్ని శనివారం ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద వినియోగదారులకు వారానికి సరిపడా ఇంధన సరఫరా కోసం వాహనం నెంబర్, ఇతర వివరాలను ధ్రువీకరించి నేషనల్ ఫ్యూయల్ కార్డులను పంపిణీ చేస్తారు. రిజిస్ట్రేషన్ వాహన యజమానులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ లోని చివరి అంకె ద్వారా తమ వంతు ఎప్పుడొస్తుందో తెలుసుకోవచ్చు. వెహికల్ ఛాసిస్ నంబర్, వివరాలు పరిశీలించిన తరువాత క్యూ ఆర్ కోడ్ కేటాయిస్తారు. ఒక వాహనానికి ఒక ఎన్‌ఐసీ, క్యూర్ కోడ్ ఉంటుంది. నెంబర్ ప్లేట్ చివరి అంకె ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వారానికి రెండు రోజులు ఇంధనం సరఫరా చేస్తారు.
శ్రీలంకలో ఆహార అభ్రదతలో అరవై లక్షల మంది
న్యూయార్క్ : శ్రీలంక మొత్తం జనాభాలో 28 శాతం అంటే దాదాపు అరవై లక్షల మంది ‘ఆహార అభద్రత ’తో కొట్టుమిట్టాడుతున్నారని, తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ పరిస్థితి మరింత క్షీణించవచ్చని ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం వెల్లడించింది. అత్యవసరమైన దిగుమతులకు నగదు చెల్లించే పరిస్థితిలో ఆ దేశం లేదని పేర్కొంది. అందువల్ల ఆహారం, ఔషధాలు, వంటగ్యాస్, ఇంధనం, టాయిలెట్ పేపర్, వంటి అత్యవసరాల కోసం అల్లాడవలసి వస్తోందని, ఇంధనం, వంటగ్యాస్ కోసం శ్రీలంక ప్రజలు బారులు తీరి నిరీక్షిస్తున్నారని వివరించింది. అరవై లక్షల మందిలో 65,600 మంది తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారని, వెంటనే ఈ సమస్య పరిష్కారానికి జోక్యం చేసుకోకుంటే ఈ పరిస్థితి మరింత అధ్వాన్నమౌతుందని హెచ్చరించింది. అరవై లక్షల డ్బ్భై వేల మంది కావలసినంత ఆహారం తీసుకోలేక పోతున్నారని, 50 లక్షల 30 వేల మంది ఆహారాన్ని తీసుకోవడం బాగా తగ్గించారని ప్రపంచ ఆహార సంస్థ వివరించింది.
కనీసం 30 లక్షల 40 వేల మందికైనా ఈ సమస్య పరిష్కారానికి ప్రపంచ ఆహార సంస్థ తక్షణ చర్యలు చేపట్టింది. ఈమేరకు ప్రజలను రక్షించడానికి 63 మిలియన్ డాలర్లు సహాయం అవసరమవుతుందని అంచనా వేసింది. ఈమేరకు ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిల్యాండ్, దేశాలతోపాటు ఐక్యరాజ్యసమితి సెంట్రల్ ఎమర్జన్సీ రెస్పాన్స్ ఫండ్ నుంచి , ఇతర దాతృత్వ సంస్థల నుంచి 20.1 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందుకున్నట్టు పేర్కొంది. అంటే అత్యవసరంగా అర్థించే 63 మిలియన్ డాలర్లలో ఇది 32 శాతం మాత్రమే.