సంపాదకీయం: ఎవరెంతగా అరిచి గీపెట్టినా, ఎన్ని కోట్ల ఆకలి పేగులు అధిక ధరల మంటల్లో మాడి మసైపోతున్నా కేంద్ర ప్రభుత్వ అధినేతలకు చీమకుట్టినట్టైనా వుండడం లేదు. వారు పరమ లక్షంగా పెట్టుకున్న హిందూ రాష్ట్ర సాధనకు నిరంతరం కుయుక్తులు పన్నుతూ పోడం తప్ప ప్రజల బాధలను పట్టించుకోడం, సవ్యమైన పాలనను అందించడం ద్వారా వారి సమస్యలు తొలగించబోడం అనే పవిత్ర లక్షానికి అంకితం కావాలన్న ఆలోచన పాలకుల్లో బొత్తిగా కరువైంది. పెట్రోల్, డీజెల్ ధరలను ప్రతి రోజూ పెంచుతూ ప్రజలు నిత్యావసరాల కొనుగోలు శక్తిని కూడా కోల్పోయే దుస్థితిని సృష్టిస్తున్న కేంద్రం వారి ముందు తలెత్తుకునే స్థితిని పూర్తిగా కోల్పోయింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా నాలుగు మాసాల పాటు పెరగకుండా సుస్థిరంగా వుండి కరుణించిన పెట్రోల్, డీజెల్ ధరలు ఆ ఎన్నికలు ముగిసిపోయిన వెంటనే మళ్లీ రోజువారీగా పెరగడం మొదలుపెట్టాయి. ఆ విధంగా గత శనివారం నాటికి జరిగిన పన్నెండు రోజుల్లో వరుసగా పదోసారి పెంపు వల్ల పెట్రోల్, డీజెల్‌పై అదనంగా లీటర్ వద్ద రూ. 7.20 పైసల భారం పడింది. ఈ ధరలు హద్దూ ఆపూ లేకుండా ఇంకా పెరుగుతూనే వున్నాయి. నికరాదాయ వర్గాల, అసంఘటిత రంగంలో రోజు కూలీపై పని చేస్తున్న అసంఖ్యాక ప్రజలు క్షణక్షణం పాము కాటుకు గురైన చందంగా ఈ అధిక ధరల గాయాలతో కుమిలిపోతున్నారు. పనికి ప్రతిఫలంగా అందుతున్న రాబడి జీవన వ్యయానికి చాలక అప్పులు చేసి అవి తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య చెప్పలేనంతగా పెరిగిపోతున్నది. గత మూడేళ్లలోనే పెట్రోల్ ధర లీటర్ రూ. 73.91 నుంచి రూ. 119.47కు చేరుకున్నది.
ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజెల్ ధరలను నిలకడగా వుంచి అవి ముగియగానే వాటిని దౌడెత్తించడంలోని కపటాన్ని గట్టిగా ప్రశ్నించే ధైర్యం సుప్రీంకోర్టుకు కూడా లేకపోడం ఆశ్చర్యకరం, బాధాకరం. దేశంలో పెట్రోల్ ధర రూ. 70కి చేరుకున్నప్పుడే ప్రజల ఆర్తనాదాలు మిన్నంటిపోయాయి. స్థిరమైన చక్కని జీతాలున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలను, అర్ధాకలితో బతుకు బండి ఈడుస్తున్న అసంఘటితరంగ ఉద్యోగుల బతుకులను పోలిస్తే కనిపిస్తున్న దూరం అసాధారణ స్థాయిలో వుంటుంది. పెట్రోల్, డీజెల్ ధరల పెంపుపై ఆందోళన వ్యక్తం చేసినప్పుడల్లా కేంద్ర మంత్రులు వితండవాదం చేస్తున్నారు తప్ప సమస్య మూలాలకు వెళ్లే ప్రయత్నం చేయడం లేదు. 2021 ఫిబ్రవరి 18న ప్రధాన మంత్రి మోడీ ఈ సమస్యపై మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పెట్రోల్, డీజెల్ కోసం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి వుంటే ఇప్పుడీ కష్టాలు ఎదురయ్యేవి కావని అన్నారు. ఆ విధంగా తన హయాంలో విర్రవీగి విజృంభిస్తున్న ఇంధనాల ధరలకు వాటి పర్యవసానంగా పెరిగి పేట్రేగిపోతున్న వివిధ సరకుల ధరలకు బాధ్యతను గత యుపిఎ ప్రభుత్వాల మీదికి నెట్టివేశారు. ప్రధాని ఈ మాట అన్నప్పటికి ఆయన సారథ్యంలో బిజెపి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడేళ్లు కావచ్చింది.
ఇంత సుదీర్ఘ కాలంలో పెట్రోల్, డీజెల్ అవసరాలకు దిగుమతులపై ఆధారపడకుండా వుండేటటువంటి మంచి రోజులను తాము ఎందుకు తీసుకురాలేకపోయామో మోడీ చెప్పి వుండవలసింది. దేశంలో మనం వినియోగిస్తున్న పెట్రోల్లో 80 శాతం దిగుమతి చేసుకుంటున్నదే. అంతర్జాతీయ మార్కెట్ లోని ధరను డాలర్లలో చెల్లించి తెచ్చుకుంటున్నదే. అనియంత్రిత ధరల వ్యవస్థ నియమం ప్రకారం అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర పెరిగినప్పుడల్లా మన దేశంలో చిల్లర మార్కెట్‌లో అమ్మే పెట్రోల్, డీజెల్ ధరలు పెరగక తప్పవు. అలాగే అక్కడ తగ్గినప్పుడు ఆ మేరకు దేశంలో కూడా వాటి ధరలు తగ్గించి వినియోగదార్లకు ఆ ప్రయోజనాన్ని బదలాయించాలి. ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ బాధ్యతను గాలికి వదిలి అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ బ్యారెల్ 20 డాలర్లకు తగ్గిపోయినప్పుడు కూడా ఇక్కడ ధరల పెంపును కొనసాగిస్తూ వచ్చింది.
ఆ విధంగా దేశ ప్రజల మీద భారాన్ని పెంచుతూ పోయింది. 2021 మార్చిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమస్యపై మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజెల్‌పై వసూలు చేస్తున్న పన్నులను తగ్గించాలని అన్నారు. అందుకు తగిన కృషి మొదలు కాలేదు. పెట్రోల్, డీజెల్ ధరల్లో కేంద్రం, రాష్ట్రాలు కలిసి వేస్తున్న పన్ను ఆదాయం 61 శాతం. కేంద్రం, రాష్ట్రాలు కూడబలుక్కొని ఈ పన్ను శాతాన్ని భారీగా తగ్గించగలిగినా లేదా పెట్రోల్, డీజెల్‌లను వస్తు, సేవల (జిఎస్‌టి) పన్ను పరిధిలోకి తీసుకు రాగలిగినా జనం మీద పెట్రో బాంబు తాకిడి పరిమితమవుతుంది. అలాగే కార్పొరేట్ వ్యాపార వర్గాలపై పన్నును పెంచి ఆ మేరకు ప్రజల మీద ఈ ఇంధనాల ధరల భారాన్ని తగ్గించినా బాగుంటుంది.