స్నేహితులను మోసం చేసి రూ. 3.73 కోట్లు తీసుకున్న నిందితుడు
అదుపులోకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు
హైదరాబాద్: స్నేహితలను మోసం చేసి డబ్బులు తీసుకుని పరారీలో ఉన్న నిందితుడిని నగర సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… ఎపిలోని విజయవాడ, పెనుమలూరుకు చెందిన పోకూరి సురేష్ బాబు నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. అప్పుడు పరిచయమైన ఐదుగురు స్నేహితులకు స్టాక్‌మార్కెట్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడిపెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పాడు. ఇది నమ్మిన బాధితులు వివిధ బ్యాంక్‌లు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి రూ.3,73,82,242 తీసుకుని నిందితుడు, అతడి భార్య బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేశారు. నెల వారీగా తానే ఈఎంఐలు కడుతానని, 25 నుంచి 30శాతం లాభం ఇస్తానని చెప్పాడు. తర్వాత కొద్ది రోజులకు నగరం నుంచి తప్పించుకుని పారిపోయాడు. దీంతో బాధితులు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఎసిపి బిక్షం రెడ్డి దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.