రేపటి నుంచి నూతన వేతన కోడ్ అమలుకు
న్యూఢిల్లీ : రేపటి నుంచి (జులై 1వ తేదీ) దేశంలో వేతన చెల్లింపుల సంబంధిత నూతన నియమావళి ( కోడ్ ) అమలులోకి రావల్సి ఉంది. దీని మేరకు ఉద్యోగి రాజీనామా చేసిన లేదా బర్తరఫ్‌కు గురైనా ఈ తేదీ నుంచి రెండు రోజుల వ్యవధిలోనే సంబంధిత ఉద్యోగికి వేతనాలు ఇతర చెల్లింపుల తుది పరిష్కారం చేపట్టాల్సి ఉంటుంది. సంబంధిత నిర్ధేశిత నిబంధనలతో నూతన వేజ్‌కోడ్ అమలులోకి తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ ఉన్న సాధారణ విధానం ప్రకారం చూస్తే కంపెనీ యజమానులు లేదా నిర్వాహకులు ఉద్యోగి పదవీకాలపు చివరి రోజు తరువాత 45 నుంచి 60 రోజుల మధ్యలో వేతనాలు ఇతరత్రా వారికి రావల్సిన బకాయిలు చెల్లింపులను చేపట్టాల్సి ఉంటుంది. అసాధారణ సందర్భాలలో ఈ పరిష్కారం 90 రోజులు కూడా పడుతుంది. వేతన బకాయిలు చెల్లింపులకు సంబంధించిన మార్పుల ప్రక్రియలతో కూడిన సంస్కరణలకు ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం దక్కింది. ఇందులో నాలుగు లేబర్ కోడ్స్ పొందుపర్చారు. వేతనాల చెల్లింపులు, సామాజిక భద్రత, కార్మిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులు వంటివి ఇందులో చేర్చారు.