Saturday, November 2, 2024

పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ … దేశమంతటా అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -

కేంద్ర మంత్రి రాందాస్ అథ్వాలేకు బిసి నేతల వినతి

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం బిసిల సంక్షేమానికి రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి ఆర్థిక, విద్య, ఉద్యోగ, శిక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ పథకం దేశమంతటా అమలు చేయాలని కోరింది. జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బిసి నేతలు మంగళవారం కేంద్రమంత్రి రాందాస్ అథ్వాలేని కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలోని 75 కోట్ల మంది బిసిలకు రూ. 1400 కోట్లు కేటాయించి 56 శాతం జనాభా ను అవమానించిందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ 38 లక్షల 45 వేల కోట్లు ఉంటే 56 శాతం జనాభా గల బిసిలకు కేవలం రూ. 1400 కోట్లు కేటాయించడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇది ఏ మూలకు సరిపోతుందన్నారు. రాజ్యాంగబద్ధమైన మండల్ కమిషన్ బిసిల అభివృద్ధికి 40 సిఫార్సులు చేస్తే అందులో ఆర్థికాభివృద్ధికి 16 సిఫార్సులు చేసిందని కాని ఇంతవరకు ఒక్క సిఫార్సు కూడా అమలు చేయలేదని కృష్ణయ్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బిసిలకు విద్యా ఉద్యోగ రంగాలలో 27 శాతం రిజర్వేషన్లు పెట్టారని, వీటికి అనుబంధంగా ఆర్థికపరమైన రాయితీలు స్కాలర్ షిప్లు, ఫీజు మంజూరు, హాస్టల్స్, గురుకుల పాఠశాలలు, నవోదయ పాఠశాలలు, మంజూరుకు బడ్జెట్ కేటాయించడం లేదన్నారు. ప్రత్యేక హాస్టళ్ళు – విద్యా సంస్థలు లేకపోతే బిసిలు ఎలా చదువుకుంటారని కృష్ణయ్య ప్రశ్నించారు.

ఐఐటి,  ఐఐఎం, నీట్ లాంటి ముఖ్యమైన కోర్సులు చదివే బిసి విద్యార్థులు ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. పైగా బిసిలకు క్రిమిలేయర్ ఆర్థిక పరిమితి విధించారన్నారు. అత్యంత వెనకబడిన కులాలకు చెందిన వారు సీట్లు పొందినప్పటికీ ఫీజు కట్టే సోమత లేక చదువు మానుకుంటున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. బిసిలు కులవృత్తులు,  చేతివృత్తులు దెబ్బతిని, వృత్తులు కోల్పోయి ఆకలి చావులకు గురవుతున్నారని వీరిని ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు సబ్సిడి రుణాలు మంజూరు చేయాలని కోరారు. రాజీవ్ ఫెలో షిప్ పథకం కింద అర్హులైన పిహెచ్‌డి, స్కాలర్స్ అందరికీ స్టై ఫండ్ మంజూరు చేయాలని, గురుకులపాఠశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు బడ్జెట్ కేటాయించాలని కోరారు. పారిశ్రామిక పాలసీలలో, కాంట్రాక్టుల కేటాయింపులో బిసిలకు 50 శాతం కోటా ఇవ్వాలన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఆర్.కృష్ణయ్యతో పాటు బిసి సంక్షేమ సంఘ కన్వీనర్ గుజ్జు కృష్ణ, కర్రీ వేణుమాధవ్, డా.మారెష్, భూపేష్ సాగర్, మహేందర్, పృథ్వి గౌడ్, రవీందర్, బాషయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News