Thursday, December 19, 2024

గ్యారంటీలకు నిధులు ఫుల్

- Advertisement -
- Advertisement -

నిధుల సమీకరణకు పక్కా ప్లాన్ 6 గ్యారెంటీలకు
ఖర్చు రూ.54 వేల కోట్లు కొత్త ఏడాదిలో
రూ.64 వేల కోట్ల టార్గెట్ రాష్ట్ర రుణ
ప్రణాళికకు ఆర్‌బిఐ గ్రీన్‌సిగ్నల్
ఒక్కో త్రైమాసికంలో రూ.16 వేల కోట్లు
ఆర్‌బిఐ నిధులే రాష్ట్రాలకు రక్ష
మన తెలంగాణ/హైదరాబాద్: నూతన ఆర్థిక సంవత్సరంలో (2024-25) ఆరు గ్యారంటీలను ఒక ఉద్యమంలా అమలుచేయాలని లక్షంగా పెట్టుకొన్న నేపథ్యంలో అందుకు అవసరమైన నిధుల సమీకరణకు ఎలాంటి ఢోకా లేకుండా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర భుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే కొత్త ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ ఆరు గ్యారంటీల రూపంలో అమలు చేయడానికి రూ పొందించిన పథకాలకు అవసరమైన నిధుల కంటే మరో పది వేల కోట్ల రూపాయలను అదనంగానే సమీకరించుకునేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పక్కా ప్రణాళికను రూపొందించిందని, అంతేగాక అందుకు తగినట్లుగా తొలిదశలోనే విజయం సాధించిందని కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి బ డ్జెట్‌లో అదనంగా 54 వేల కోట్ల రూపాయలను వ్యయం చేయాల్సి వస్తుందని ప్రాథమికంగా అంచనా వేశామని, కానీ కొత్త ఆర్థిక సంవత్సరానికి (2024-25) రూపొందించుకొన్న రుణ ప్రణాళిక ప్రకారం ఏడాది ముగిసే నాటికి ఏకంగా 59,500 కోట్ల రూపాయల నుంచి గరిష్ఠంగా 64 వేల కోట్ల రూపాయల వరకూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నుంచే నిధులు వచ్చే విధంగా ఏ ర్పాట్లు చేశామని ఆ అధికారులు వివరించారు. ఆ విధంగా ఆర్‌బిఐని ఒప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు జరిపిన సమాలోచనలు, ప్రయత్నాలు ఫలించాయని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అవసరాలు, ప్రజల కోర్కెలను నెరవేర్చడానికి, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ పా ర్టీ ప్రభుత్వం రూపొందించుకొన్న ప్రణాళికలను ఆర్‌బిఐ పెద్దలకు కూలంకషంగా వివరించి విజయం సాధించడంతోనే ఇంతటి పెద్దమొత్తాల్లో నిధులు వచ్చేందుకు పునాదులు పడ్డాయని ఆ అధికారు లు వివరించారు. అందులో భాగంగానే మొదటి త్రైమాసికంలో అం టే ఏప్రిల్, మే, జూన్‌లల్లో ఆర్‌బిఐ వారం వారం నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలం నుంచి 16 వేల కోట్ల రూపాయల నిధులు రానున్నాయని వివరించారు. గడచిన పదేళ్ళల్లో ఎన్నడూ తెలంగాణ రా ష్ట్రానికి ఇంత పెద్ద మొత్తంలో ఆర్‌బిఐ నుంచి నిధులు రాలేదని వివరించారు. కేంద్రంతో, ఆర్‌బిఐతో ఈ నాలుగు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎన్నడూ దురుసుతనంతో వ్యవహరించలేదని, లేనిపోని మాటలతో డిమాండ్లు చేయకుండా సానుకూలంగా, సావధానంగా రాష్ట్ర అవసరాలను తెలియజేస్తూనే రుణాలకు తిరిగి చెల్లింపులు కూడా ఎలా చేస్తామోననే కార్యాచరణ ప్రణాళికలను కూడా వివరించడంతోనే ఆర్‌బిఐ మొదటి త్రైమాసికంలో 16 వేల కోట్ల రూపాయల నిధులను ఇచ్చేందుకు నిర్ణయించిందని వివరించారు.

ఏప్రిల్ నెలలో 5 వేల కోట్లు, మే నెలలో 6 వేల కోట్లు, జూన్ నెలలో 5 వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు ఆర్‌బిఐ అంగీకరించిందని వివరించారు. ఈ మొదటి త్రైమాసికంలోనే సెక్యూరిటీ బాండ్ల వేలం నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి 2,54,040 కోట్ల రూపాయల నిధులను రుణాల రూపంలో ఆర్‌బిఐ అందించనుంది. దేశంలోని ఏ రాష్ట్రమైన ఆర్‌బిఐ నుంచి వచ్చే నిధుల కోసమే శాయశక్తులా ప్రయత్నాలు చేస్తుందని, ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు వంటి సంస్థల నుంచి రుణాలు తీసుకోవడానికి దేశంలోని ఏ రాష్ట్రమైన వెనుకంజ వేస్తుందని, అదే పద్ధ్దతిలో తెలంగాణ ప్రభుత్వం కూడా పెద్ద మొత్తాల్లో నిధులు రాబట్టుకోవడానికి పక్కాప్లాన్‌తో ముందుకు వెళ్ళిందని, విజయం సాధించామని సగర్వంగా చెప్పారు.

ఎందుకంటే తీసుకొన్న రుణాలను తిరిగి చెల్లించడంలో ఏమైనా ఇబ్బందులు వచ్చినా, ఇంకేమైనా సమస్యలు వచ్చినా ఆర్‌బిఐ అడ్డుపడి ప్రతి రాష్ట్రాన్నీ ఆదుకొంటుందని, అందుకే ఏ రాష్ట్రమైనా ఆర్‌బిఐ నుంచే రుణాలు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాయని వివరించారు. అదే విధంగా గత పాలకులు గడచిన నాలుగేళ్ళల్లో ఆర్‌బిఐతోగానీ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతోగానీ ఎలాంటి సఖ్యతగా వ్యవహరించలేదని, అందుకే ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకపోగా ఆంక్షలు విధించారని, గత నాలుగేళ్ళల్లో ఏడాది సగటున 20 వేల కోట్ల రూపాయలనే రుణాలుగా ఇచ్చి చేతులు దులుపుకొన్నారని, దాంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నామని ఆ అధికారులు గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, కేంద్ర ప్రభుత్వంతోగానీ, ఆర్‌బిఐ పెద్దలతోగానీ సఖ్యతగా వ్యవహరిస్తూ రాష్ట్ర అవసరాలకు కూలంకషంగా వివరించి అడగాల్సిన పద్ధ్దతిలో ఆర్థిక సహకారాన్ని కోరుతున్నారని, అందుకే రికార్డుస్థాయిలో కొత్త ఆర్థిక సంవత్సరంలో 64 వేల కోట్ల రూపాయలను రాబట్టుకునే ఏర్పాట్లు జరిగాయని వివరించారు.

వాస్తవానికి ఆరు గ్యారెంటీల్లో అయిదు ఇప్పటికే అమలులోకి వచ్చాయని, అంతేగాక రైతుబంధు పథకంలో సుమారు 93 శాతం మంతి రైతన్నలకు పంటల సాగు పెట్టుబడి సాయం అందిందని, మిగిలిన రైతన్నల పంట రుణాల మాఫీ వంటి హామీని కూడా విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన నిధుల సమీకరణ ప్రక్రియలో విజయం సాధించామని ఆ అధికారులు ధీమాగా వివరించారు. 2024-25వ ఆర్థిక సంవత్సరంలో రైతన్నల పంట రుణాలను మాఫీ చేయడమే కాకుండా భవిష్యత్తులో బ్యాంకర్ల నుంచి రైతులకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు కలుగకుండా బ్యాంకులు కూడా రైతుల నేస్తాలుగా పనిచేసే విధంగా ఒక పక్కా ప్రణాళికతో వస్తున్నామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News