కరోనా కట్టడికి రాహుల్ సూచన
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి సంపూర్ణ లాక్‌డౌన్ ఒక్కటే ఇప్పుడు పరిష్కార మార్గమని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. పేద వర్గాలకు కనీస ఆదాయ భద్రత పథకం న్యాయ్ అమలుచేసి దేశంలో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధించడం ఒక్కటే కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకట్టకు ఇప్పుడు ఏకైక మార్గమని మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యూహం కొరవడినందున లాక్‌డౌన్ తప్ప వేరే గత్యంతరం లేదని రాహుల్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల పెద్ద సంఖ్యలో అమాయక ప్రజలు మరణిస్తున్నారని ఆయన ఆరోపించారు. కరోనా వైరస్ దేశంలో ఈ స్థాయిలో ప్రబలడానికి కేంద్ర ప్రభుత్వమే అవకాశం కల్పించిందని, ఒకరకంగా చెప్పాలంటే ప్రభుత్వమే అనుమతించిందని ఆయన విమర్శలు గుప్పించారు. వైరస్‌ను అదుపుచేయడానికి వేరే మార్గమేదీ లేకుండా చేశారని ఆయన ఆరోపించారు. భారతదేశంపై ప్రభుత్వమే నేరానికి పాల్పడిందని కూడా ఆయన ఆరోపించారు.