కేంద్రం రాష్ట్రాలు ఆలోచించాలి
ముందు పేదలకు సరుకుల ఏర్పాట్లు
సుప్రీంకోర్టు 64 పేజీల ఆదేశాలు
న్యూఢిల్లీ : దేశంలో ఇప్పుడు నెలకొన్న సెకండ్ వేవ్ కరోనా ఉధృతి కట్టడికి పూర్తిస్థాయి లాక్‌డౌన్ మార్గమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సత్వర రీతిలో వైరస్ వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్ విధింపుపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటే మంచిదని సర్వోత్తమ న్యాయస్థానం స్పష్టం చేసింది. కొవిడ్ తీవ్రతపై తాము ఆందోళన చెందుతున్నామని , వైరస్ నియంత్రణ లాక్‌డౌన్‌తో సాధ్యం అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోందని ధర్మాసనం తెలిపింది. ప్రజా సంక్షేమం కోణంలో ఈ దిశలో కేంద్రం రాష్ట్రాలు సమన్వయ దిశలో వ్యవహరించి నిర్ణయం తీసుకుంటే మంచిదని సూచించారు. దేశంలో కొవిడ్ పరిస్థితిని, చికిత్స, ప్రభుత్వ స్పందన విషయాలపై సుమోటో కేసు విచారణ దశలో న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం లాక్‌డౌన్ విషయాన్ని ప్రస్తావించడం కీలకం అయింది. దేశవ్యాప్త లాక్‌డౌన్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది.
అయితే దీనికి ముందు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పేదల నిత్యావసరాలు తీర్చేలా అత్యవసర ఏర్పాట్లను ముందుగా చేయాల్సి ఉంటుంది. లాక్‌డౌన్ విధింపు అనేది ఈ నిర్థిష్ట అంశానికి అతీతంగా జరగకూడదని సుప్రీంకోర్టు కేవియట్ ఖరారు చేసింది. కొవిడ్ నియంత్రణకు సంబంధించి ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు తీసుకున్నారు? పరిస్థితిని బట్టి ఇకముందు ఎటువంటి పద్థతులతో వ్యాప్తిని అరికడుతారనేది తమకు తెలియచేయాల్సి ఉంటుందన్నారు. కొవిడ్ పరిస్థితిపై సుప్రీంకోర్టు చేసిన ఆదేశాలతో కూడిన 64 పేజీల అంశాల వివరాలు ఆదివారం రాత్రి చాలా పొద్దుపోయిన తరువాత సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.
లాక్‌డౌన్ లేదా దీనికి ముందు సామూహిక సమ్మేళనాలపై నిషేధం, వ్యాప్తికి దారితీసే ఘట్టాలు జరగకుండా చూడటం వంటివి కీలకం. లాక్‌డౌన్‌కు దిగాలనే నిర్ణయానికి వస్తే దీనికి ముందు జనం అవసరాలను పూర్తిగా దృష్టిలో పెట్టుకుని తగు విధంగా సాయానికి ఏర్పాట్లు చేయడం కీలకం అని ధర్మాసనం తెలిపింది. లాక్‌డౌన్ సాధారణ నిర్ణయం ఏమీ కాదని, దీనితో పలు సామాజిక ఆర్థిక సమ్మిళిత అంశాలుతలెత్తుతాయని , ప్రత్యేకించి అణగారిన వర్గాలకు సామూహిక జీవన క్రమంతోనే బతుకు గడుస్తుందనే విషయం తెలుసునని, అయితే వైరస్ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్ తప్పని స్థితి అయితే అన్నింటి మధ్య సరైన సమన్వయాన్ని సంతరించుకుని వ్యవహరించాల్సి ఉంటుందని సూచించారు.