ప్రభుత్వ హాస్టళ్ళకు సొంత భవనాలు నిర్మించాలి
ఫీజు బకాయిలు చెల్లించాలి
మన తెలంగాణ / హైదరాబాద్/ తార్నాక : యూనివర్సిటీలో పిజి తదితర కోర్సులు చదువుతున్న ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థులకు ఫుల్ మెస్ చార్జీల పథకాన్ని పునరుద్దించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు చెల్లించాలని, నగరంలోని బిసి కాలేజ్ హాస్టల్ లకు సొంతభవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆరట్స్ కాలేజ్ వద్ద జరిగిన బహిరంగ సభలో వేలాదిమంది విద్యార్థులనుద్దేశించి కృష్ణయ్య ప్రసంగించారు.
యూనివర్సిటీలో 1994 నుంచి ఫుల్ మెస్ చార్జీల పథకాన్ని ఎత్తి వేసిన తర్వాత బిసి విద్యార్థులు మెస్ బకాయిలు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. 1994 వరకు ఫుల్ మెస్ చార్జీల స్కీమ్‌ను కొనసాగించారని 1994లో ఈ స్కీముకు పరిమితి విధించారని తెలిపారు. పాకెట్ మనీ ఎత్తివేశారన్నారు. ఏ నాయకుడు ప్రశ్నించకపోవడంతో అదే కొనసాగిందన్నారు. ప్రస్తుతం హాస్టళ్ళలలో మెస్ బిల్లులు 30వేల వరకు వస్తుందని, స్కాలర్షిప్ మాత్రం 15వేలు వస్తుందని, మిగతా బ్యాలెన్స్ విద్యార్థులు చెల్లించాల్సి వస్తోందన్నారు. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకునే సమయంలో బ్యాలెన్స్ డబ్బు కడితే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు.
దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు 4వేల కోట్లు వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను తీవ్రతరం చేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. రాష్ట్రంలో 300 బిసి కాలేజీ హాస్టల్లో ఉంటే ఒక్కదాని కూడా సొంత భవనం లేదని అన్నారు. ప్రభుత్వ ఆఫీసులన్నింటికీ సొంతభవనాలు కట్టారు, ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్లకు, ఎంఆర్‌ఓ ఆఫీసులకు, పోలీస్ స్టేషన్లకు అన్నింటికీ సొంతభవనాలు కట్టారని కృష్ణయ్య తెలిపారు.
బిసి హాస్టళ్ళకు, గురుకుల పాఠశాలలకు ఒక్కదానికి కూడా సొంత భవనం లేవని, ఇది ప్రభుత్వ బిసి వ్యతిరేక వైఖరినీ తెలుపుతుందన్నారు. హైదరాబాదులోని కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి దొరల కార్లు వెళ్లడానికి ఫ్లై ఓవర్లు, స్కై ఓవర్లు పెద్ద ఎత్తున కట్టారని, వందలకోట్ల రూపాయలు ఖర్చుపెట్టి 50 కి.మీ దూరం వరకు వాకింగ్ ట్రాక్‌లు కట్టారని, వాకింగ్ ట్రాకుల మీద ఉన్న శ్రద్ధ, ఎస్‌సి, ఎస్‌టి, బిసిల అభివృద్ధిపై లేదని కృష్ణయ్య విమర్శించారు. హాస్టళ్ళకు స్వంత భవనాలు అన్ని సౌకర్యాలతో నిర్మించాలని డిమాండ్ చేశారు.