Tuesday, November 5, 2024

జపాన్ ప్రధానిగా కిషిడా

- Advertisement -
- Advertisement -

Fumio Kishida is elected Prime Minister of Japan

శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

టోక్యో: మాజీ దౌత్యవేత్త ఫుమియో కిషిడా(64)ను జపాన్ పార్లమెంట్ ప్రధానిగా ఎన్నుకున్నది. ఏడాదిపాటు ప్రధానిగా కొనసాగిన యోషిహిడే సుగా రాజీనామా చేయడంతో నూతన ప్రధానిని జపాన్ పార్లమెంట్ సోమవారం ఎన్నుకున్నది. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ(ఎల్‌డిపి)కి చెందిన కిషిడాకు మిత్రపక్షం మద్దతు ఇవ్వడంతో పార్లమెంట్ ఉభయసభల్లో మెజార్టీ సాధించారు. కరోనాను కట్టడి చేయడం, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో విఫలమయ్యారన్న విమర్శల నేపథ్యంలో సుగా రాజీనామా చేయడం తెలిసిందే. దాంతో, కిషిడాకు ఇప్పుడు విధానపరమైన పరీక్షలు ఎదురుకానున్నాయి. పార్లమెంట్ ఆమోదం లభించడంతో కిషిడా ఆ దేశానికి 100వ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధికారికంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శుక్రవారం పార్లమెంట్‌లో కిషిడా విధాన ప్రకటన చేయనున్నట్టు భావిస్తున్నారు.

అధికార ఎల్‌డిపిలో మితవాదిగా పేరున్న కిషిడా చైనా, ఉత్తర కొరియాల నుంచి ఎదురయ్యే రక్షణ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తిగా మారింది. దిగువసభను రద్దు చేసి అక్టోబర్ 31న ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్టుగా కూడా జపాన్ మీడియా చెబుతోంది. సుగా క్యాబినెట్‌లోని 20మందిలో ఇద్దరు మినహా మిగతా వారినందరినీ కిషిడా కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. కిషిడాకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌జపాన్ మధ్య వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా ఈ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యాలను ముందుకు తీసుకుపోయేందుకు కిషిడాతో కలిసి పని చేయనున్నట్టు ప్రధాని మోడీ ట్విట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News