Thursday, December 26, 2024

దారి తప్పుతున్న ప్రజాస్వామ్యం!

- Advertisement -
- Advertisement -

ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గత 75 ఏళ్లుగా వికసిస్తూ వస్తున్నది. శాంతియుతంగా అధికార మార్పిడి జరగడం, కీలకమైన జాతీయ అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి స్వరంతో స్పందిస్తూ వుండడం మన ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం కావిస్తున్నది. అంతర్జాతీయంగా భారత్‌ను ఒక బలమైన సైనిక శక్తిగా గుర్తింపు తెచ్చిన, బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు స్ఫూర్తి కలిగించిన 1971 నాటి యుద్ధం సమయంలో అధికార- ప్రతిపక్షాలు ఉమ్మడిగా వ్యవహరించిన తీరు చరిత్రాత్మకం. పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగినప్పుడు, కార్గిల్ యుద్ధం సమయంలో సహితం అటువంటి ఉమ్మడి కార్యాచరణను చూసాము. గత ఏడాది సరికొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తూ అత్యాధునిక వసతులతో, అత్యుత్తమ భద్రతా వ్యవస్థతో ఈ భవనం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

అయితే కొద్ది నెలలకే ఆగంతకులు లోక్‌సభలో ప్రవేశించి, కలకలం రేపడం పార్లమెంట్ భద్రత పట్ల ప్రశ్నలు లేవనెత్తింది. నలుగురు వ్యక్తులు పార్లమెంటులోకి ప్రవేశించి, లోక్‌సభ లోపల, వెలుపల రంగురంగుల పొగ డబ్బాలను కాల్చడంతో ఆందోళన కలిగిస్తున్న భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుండి ప్రకటన కోసం ప్రతిపక్షాల డిమాండ్ చేయడమే పార్లమెంట్‌లో ఎన్నడూ ఎరుగనంతగా ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్‌కు దారి తీసింది.ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనపై పార్లమెంటుకు తిరిగి నివేదించడానికి ప్రభుత్వం పాయింట్ బ్లాంక్‌గా నిరాకరించగా, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఇద్దరూ వరుసగా ఒక టివి ఛానెల్, ఒక ప్రముఖ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, బిజెపి వేదికలపై ఈ విషయమై ప్రతిపక్షాలపై ఘాటైన విమర్శలు కూడా గుప్పించారు. కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం మన ఎంపిలను వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల నుండి వేరు చేయడానికి మరింతగా అనువుగా రూపొందించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్వరూపం గురించి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా వున్న అవగాహనకు భిన్నంగా నేడు పార్లమెంట్‌లో వ్యవహారాలు జరుగుతున్నట్లు ఆందోళన కలిగిస్తున్నది. భారత ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగ నిర్మాతలు బలమైన పునాదులు వేశారు. వారి ఆలోచనల ప్రకారం అధికార పక్షంను జవాబుదారీ కావించడమే పార్లమెంట్ ప్రధాన కర్తవ్యం. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలకు మొదటగా కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మౌలిక సూత్రం. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం అనూహ్యమైనది మాత్రమే కాదు, అది పూర్తిగా ప్రమాదకరం. దివంగత అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ అంతర్గత భద్రతా విషయాలపై అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగిస్తూ ప్రముఖంగా హెచ్చరించినట్లుగా, ‘ఒకసారి ప్రతిపక్షాల గొంతును నిశ్శబ్దం చేసే సూత్రానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటే, అది పౌరులందరికీ భయాందోళనలకు మూలంగా మారే వరకు, ప్రతి ఒక్కరూ భయంతో జీవించే దేశాన్ని సృష్టించే వరకు పెరుగుతున్న అణచివేత చర్యల మార్గం ఏర్పర్చుతుంది’.

ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి మాతృకగా చెప్పుకుంటున్న భారత్ నేడు ఆ దిశకు మారుతుందా? అనే భయాందోళనలు ఇప్పుడు కలుగుతున్నాయి. గత శీతాకాల సమావేశాల్లో అనూహ్యంగా 146 మంది ఎంపిలను సస్పెండ్ చేయడంతో ప్రతిపక్షమే లేకుండా పార్లమెంటులో చర్చలు జరగడం, ఏకంగా 17 బిల్లులు మెరుపు వేగంతో ఆమోదం పొందడం ఒక విధంగా విస్మయం కలిగిస్తోంది. వారిలో 78 మందిని ఒకే రోజు సస్పెండ్ చేశారు. బిజెడి, వైఎస్‌ఆర్‌సిపి, బిఆర్‌ఎస్ వంటి ‘స్నేహపూర్వక’ బిజెపియేతర పార్టీల ఎంపిలు మినహా వాస్తవంగా మొత్తం ప్రతిపక్షం లేకుండా ఎన్నో కీలక బిల్లును ఆమోదం పొందాయి. ఆ విధంగా ఆమోదం పొందిన బిల్లులతో కీలకమైన వలస పాలనకు సంబంధించిన సివిల్, క్రిమినల్ కోడ్‌లకు కీలకమైన సవరణలు వున్నాయి. అదే విధంగా ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లు కూడా ఉంది.

ఇటువంటి బిల్లులు సమగ్రమైన చర్చలే లేకుండా హడావుడిగా ఆమోదింప చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష ఎంపిలపై పెద్ద ఎత్తున సస్పెన్షన్ వేటు వేయడం రాజకీయ ఎత్తుగడలో భాగమే అనే వాదన వినిపిస్తున్నది. ప్రజాస్వామ్యపు అత్యున్నత వేదికపై తమ గొంతును నిశ్శబ్దం చేయడం ద్వారా ఇప్పటికే మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిరాశకు గురైన ప్రత్యర్థిని మరింత నిరుత్సాహ పరచడం దీని లక్ష్యంగా భావించాల్సి వుంటుంది. బిల్లులను అంతరాయం లేకుండా వేగంగా ఆమోదింప చేసుకోవడాన్ని పార్లమెంటరీ పని తీరుకు కొలమానంగా భావిస్తున్నారు. 87%, 95%, 135% వంటి ఉత్పాదకత స్థాయిలను ప్రకటించడం ద్వారా గర్వంగా తాము పార్లమెంట్ సమావేశాలను ఏ విధంగా నిర్వహిస్తున్నామో అంటూ సంబరపడిపోతున్నారు.

కీలకమైన అంశాలపై లోతైన చర్చలు జరిపి, అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం నిర్మించే ప్రయత్నాలకు వేదికగా పార్లమెంట్ వుండాలనే మౌలిక ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తున్నాము. ఒకటి, రెండు గంటల వ్యవధిలో కీలకమైన బిల్లులు ప్రతిపక్షాల ప్రమేయం లేకుండా ఆమోదింప చేసుకుంటూ ఘనం గా చాటుకొనే దుస్థితికి చేరుకొంటున్నాము. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, ఎన్నుకోబడిన నిరంకుశత్వానికి మధ్య ఉన్న తేడా ను విస్మరిస్తున్నాము. సభ జరుగుతున్నప్పటికీ పార్లమెంటులో భద్రత ఉల్లంఘనపై మాట్లాడేందుకు హోం మంత్రి నిరాకరించడం కానీ, మీడియా ముందో, పార్టీ సమావేశాలలోనే ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ఆ అంశంపై మాట్లాడడం గమనిస్తే జవాబుదారీ సూత్రాన్ని నిరాకరించడమే అవుతుంది. ప్రతిపక్షాల క్రమశిక్షణా రాహిత్యం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదనే బిజెపి తరచూ విమర్శలు గుప్పిస్తున్నది. గత కొంత కాలంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన కీలక అంశాలపై చర్చలకు నిరాకరించడం, ఆ అంశాలు ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నారనే సాకుతో సమావేశాలను వాయిదా వేస్తుండటం, చివరి రెండు, మూడు రోజుల్లో ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి తమకు కావాలనుకున్న బిల్లులను సరైన చర్చ

లేకుండా ఆమోదింప చేసుకోవడం ఒక రివాజుగా మారుతున్నది. మణిపూర్‌లో హింస కావచ్చు, అదానీ కంపెనీలపై చెలరేగిన ఆరోపణలు కావచ్చు, సరిహద్దుల్లో చైనా దురాక్రమణలు కావచ్చు, మరే జాతీయ ప్రాధాన్యత గల అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తినా గుడ్డిగా చర్చకు, కనీసం ప్రభుత్వ పక్షాన ఓ ప్రకటన చేసేందుకు నిరాకరిస్తున్నారు. అందుకు సజావైన అభ్యంతరాలు వుంటే ప్రభుత్వమే ప్రతిపక్ష నాయకులను చర్చలకు పిలిచి, వారిని ఒప్పించే ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నం జరగానే జరగడం లేదు. యుపిఎ ప్రభుత్వ కాలం వరకు ప్రభుత్వం కీలకమైన ఎటువంటి అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావింపదలచినా, ముఖ్యమైన బిల్లును ప్రవేశపెట్టదలచినా ముందుగా కీలక ప్రతిపక్ష నాయకులను మంత్రుల ద్వారా, అధికార పక్ష నేతల ద్వారా లేదా ఉన్నతాధికారుల ద్వారా సంప్రదించి, వారికి ఆయా అంశాల ప్రాధాన్యతను వివరించడం మన పార్లమెంటరీ సంప్రదాయంగా కొనసాగుతూ వచ్చింది. కానీ నేడు దశాబ్దాల కాలంగా అనుసరిస్తున్న ఇటువంటి పార్లమెంటరీ సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్నారు. మరోవంక, ప్రతిపక్షాలు సహితం స్ఫూర్తిదాయకమైన ప్రత్యామ్నాయాన్ని రూపొందించడంలో వైఫల్యం చెందడం కూడా మన పార్లమెంటరీ ప్రమాణాలు దిగజారేందుకు దోహదపడుతుంది.

పార్లమెంట్ సమావేశాల పట్ల వారు సహితం సీరియస్‌గా లేరని వారి ధోరణి వెల్లడి చేస్తుంది. పార్లమెంట్ మెట్లపై టిఎంసి సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ రాజ్యసభ చైర్మన్‌ను అనుకరిస్తూ పేరడీ చేయడం, ఆ దృశ్యాన్ని రాహుల్ గాంధీ తన మొబైల్ ఫోన్ కెమెరాతో చిత్రీకరించడం వారి నైతిక ఔన్నత్యంను ప్రశ్నార్ధకం కావిస్తుంది. నరేంద్ర మోడీకి దీటుగా ప్రజాకర్షణ గల నేతను ప్రతిపక్షాలు ప్రజల ముందుంచలేకపోవచ్చు. కనీసం ఉమ్మడిగా పోటీ చేసేందుకు సీట్ల సర్దుబాటు విషయంలో సహితం వాస్తవికంగా, ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో వ్యవహరింపలేక చతికలపడుతున్నట్లు ఇటీవల జరిగిన ఐదు అసెంబ్లీల ఎన్నికలు స్పష్టం చేశాయి. దివంగత కాంగ్రెస్ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ పదవీ కాలం ముగిసే సమయానికి మార్చి 1989లో చివరి సారిగా ఇటువంటి నాటకీయ పరిణామం పార్లమెంట్‌లో జరగడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోడీ కన్నా (353) ఎక్కుగా (404) ఎంపిల మద్దతుతో ఆనాడు రాజీవ్ గాంధీకి లోక్‌సభలో బలం ఉంది. విశేషమేమిటంటే ఆనాడు కూడా రాజీవ్ గాంధీ పదవీ కాలం చివరి రెండో పార్లమెంట్ సెషన్‌లో,

ఆ సంవత్సరం లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన చివరి సెషన్‌లో, మొత్తం ప్రతిపక్షం పార్లమెంటుకు రాజీనామా చేసింది. ఆ తర్వాత 1989 చలికాలంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. చరిత్ర పునరావృతం కాకపోవచ్చు. కానీ గత పక్షం రోజుల్లో జరిగిన సంఘటనలు కలవరపెట్టే గతాన్ని గుర్తు చేస్తున్నాయి. భారీ మెజారిటీ వున్న ప్రభుత్వాలు తరచుగా బలహీనంగా అనే ప్రతిపక్షాల పట్ల చులకనగా వ్యవహరిస్తే ప్రమాదకర పరిణామాలను ఎదుర్కోవలసి రావచ్చని గమనించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News