Friday, December 20, 2024

నిధులకు ఢోకా లేదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సంచలనాత్మకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా విజయవంతంగా అమలుచేస్తూ దేశంలోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బిసి కులాల వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చేసే పథకానికి కూడా నిధులను సమీకరించుకొంది. కేవలం కుల వృత్తులపైనే ఆధారపడుతున్న వెనుకబడిన వర్గాల పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల మంచిర్యాలలో ప్రారంభించిన ఈ పథకానికి భారీగా స్పందన లభించింది. ఈ పథకానికి అవసరమైన నిధులను సమీకరించుకునే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు 2,500 కోట్ల రూపాయల నిధులను సమీకరించుకునేందుకు ఆర్‌బిఐని కోరారు. ఆర్‌బిఐ కూడా ఈ నిధుల సమీకరణకు అంగీకరించి సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఈనెల 13వ తేదీన ఆర్‌బిఐలో జరగబోయే బాండ్లలో వేలంలో ఈ 2,500 కోట్ల రూపాయల నిధులు తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు చేరుతాయి.

మొత్తం 11 రాష్ట్రాలు సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొంటుండగా కేంద్ర ప్రభుత్వం కూడా బాండ్ల వేలంలో పాల్గొంటోంది. కేంద్ర ప్రభుత్వం ఏకంగా 33 వేల కోట్ల రూపాయల నిధుల కోసం సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. ఈ 33 వేల కోట్లే కాకుండా మరో రెండు వేల కోట్ల రూపాయల అదనపు నిధులను కూడా తీసుకునేందుకు కేంప్రభుత్వానికి ఆర్‌బిఐ అనుమతులు మంజూరు చేసింది. ఈనెల 16వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సెక్యూరిటీ బాండ్ల వేలం జరుగనుంది. ఇప్పటికే కేంద్రప్రభుత్వ అప్పులు 155 లక్షల కోట్లకు చేరింది. ఇవి చాలవన్నట్లుగా తాజాగా మరో 35 వేల కోట్ల రూపాయలను కేంద్రం అప్పులు చేస్తోంది. దీంతో ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి అయిన 40 శాతం ఉండాల్సిన అప్పులు కాస్తా ఏకంగా 83.5 శాతానికి పెరిగిపోయాయి. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని కేంద్రం ఎంత ఈజీగా తూట్లు పొడిచిందో గమనించాలని ఆర్ధికశాఖలోని కొందరు ఉన్నతాధికారులంటున్నారు.

అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రానికున్న అప్పులు కేవలం 26 శాతానికి పరిమితంగా ఉన్నాయని, మెజారిటీ రాష్ట్రాలు సగటున 45 శాతం వరకూ అప్పులు చేశాయని తెలిపారు. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని గౌరవిస్తూ చాలా తక్కువగా రుణాల రూపంలో కొద్దిపాటిగా నిధులను సమీకరించుకొంటూ మొత్తం రాష్ట్ర సొంత ఆదాయంపైన, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలలో ఖజానాను నింపుకొంటూ సంక్షేమ పథకాలను నిరాఘాటంగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆ అధికారులు సగర్వంగా చెబుతున్నారు. కానీ ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని చేసిన కేంద్ర ప్రభుత్వం యధేచ్ఛగా ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, కానీ రాష్ట్రాలను మాత్రం రుణాలు తీసుకోవద్దంటూ అనేక ఆంక్షలు విధిస్తూ వేధింపులకు గురిచేస్తోందని ఆ అధికారులు వివరించారు. అప్పులు చేసిన రాష్ట్రాల్లో పీకల్లోతు రుణ భారంతో తల్లడిల్లుతున్న రాష్ట్రాలకు మళ్ళీ కొత్త అప్పులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐలు అనుమతులు మంజూరు చేశాయి. 11 రాష్ట్రాలకు 22,500 కోట్ల రూపాయలను అప్పులు తీసుకునేందుకు ఈనెల 13వ తేదీన (మంగళవారం) ఆర్‌బిఐ బాండ్ల వేలం నిర్వహించనుంది.

అందులో ఆంధ్రప్రదేశ్‌కు వెయ్యి కోట్లు, గోవాకు 100 (వంద) కోట్లు, గుజరాత్ రాష్ట్రానికి 1,500 కోట్లు, హర్యానాకు 750 కోట్లు, మధ్యప్రదేశ్‌కు 4వేల కోట్లు, మహారాష్ట్రకు 5 వేల కోట్లు, నాగాలాండ్‌కు 150 కోట్లు, పంజాబ్‌కు 800 కోట్లు, తమిళనాడు రాష్ట్రానికి 4 వేల కోట్లు, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి 2,500 కోట్ల రూపాయల నిధుల కోసం బాండ్ల వేలంలో పాల్గొంటున్నాయి. ఈ 11 రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణను మినహాయిస్తే మిగతా రాష్ట్రాలన్నీ ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట పరిమితిని మించి అప్పులు చేసిన రాష్ట్రాలేనని, ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాలన్నీ 35 శాతంకు పైగా అప్పులు చేసినవేనని ఆ అధికారులు వివరించారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ప్రభుత్వాలను నడుపుకోవడానికి, ఉద్యోగులకు జీతభత్యాలను చెల్లించడానికి కూడా అప్పులు చేస్తున్నాయని, ఈ రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థ ఆగమ్యగోచరంగా ఉందని, సొంతగా ఆర్ధిక వనరులను సమీకరించుకునే ప్రయత్నాలు చేయడం లేదని ఈ అప్పులే స్పష్టంచేస్తున్నాయని పేర్కొన్నారు.

అయినప్పటికీ ఈ ఆరు రాష్ట్రాల విషయానికొచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం గానీ, ఆర్‌బిఐ గానీ సెక్యూరిటీ బాండ్ల వేలానికి ఎలాంటి అభ్యంతరాలు పెట్టకుండా అడిగిందే తడవుగా అనుమతులు మంజూరు చేస్తోందని, కానీ ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట పరిధికి లోబడి రుణాలు తీసుకొన్న తెలంగాణ రాష్ట్రానికి మాత్రం అనేక ఆంక్షలను విధిస్తూ ఆర్‌బిఐ పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తోందని ఆ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఇకనైనా ఇలాంటి పరిస్థితులకు స్వస్తి చెప్పాలని తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలకు అన్ని విధాలుగా సహకరించాలని కోరుతున్నారు. లేకుంటే రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐలే అభాసుపాలవుతాయని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News