Wednesday, January 29, 2025

బస్వాపూర్ రిజర్వాయర్ భూనిర్వాసితులకు నిధులు మంజూరు చేయాలి: కుంభం అనిల్

- Advertisement -
- Advertisement -

మూసీ ప్రక్షాళనకు నిధులు కేటాయించడం అభినందనీయం

రైతులకు, అన్ని వర్గాలకు అండగా నిలిచిన ప్రభుత్వం కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం

భువనగిరి నియోజకవర్గ సమస్యల్ని శాసనసభ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

మనతెలంగాణ/ యాదాద్రి భువనగిరి: బస్వాపూర్ ప్రాజెక్టు (నృసింహస్వామి రిజర్వాయర్) నిర్మాణంలో తమ భూములు, ఇండ్లు, కోల్పోయిన భువనగిరి మండలం బిఎన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన భూ నిర్వాసితులకు, బాధితులకు అలాగే చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భూ నిర్వాసితులైన గిరిజన కుటుంబాలకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించేందుకు నిధులు మంజూరు చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శాసనసభ దృష్టికి తీసుకువెళ్లారు. మంగళవారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో భువనగిరి నియోజకవర్గం గురించి ప్రస్తావించారు. నియోజకవర్గ పరిధిలోని రైతు రుణమాఫీ పై మూసి ప్రక్షాళన పై సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం తమ ధనిక రాష్ట్ర పాలనలో  ఏరైతుకు కూడా సరిగ్గా రుణమాఫీ చేయలేదని, అలాగే మూసి ప్రక్షాళనకు కూడా డబ్బులు కేటాయించకపోగా, యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడమే కాకుండా మూసి ప్రక్షాళన కోసం మొదటి విడతగా 1500 కోట్ల రూపాయలు కేటాయించిందని అనిల్ ప్రశంసించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నుంచి ప్రవహిస్తున్న మూసి నదీ వికారాబాద్ జిల్లాలో పుట్టి హైదరాబాద్, రంగారెడ్డి మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రవహించి నల్లగొండ మీదుగా వాడపల్లి వద్ద సముద్రంలో కలుస్తుందన్నారు.

ఇక్కడి ప్రజలు గతంలో 20, 30 సంవత్సరాల క్రితం మూసి నీటిని సాగునీటి అవసరాలే కాకుండా, త్రాగు నీటికి కూడా ఉపయోగించే వారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ జల కాలుష్యంతో పాటుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పోచంపల్లి మండల కేంద్రంలో చౌటుప్పల్ పరిశ్రమలు ట్యాంకర్ల ద్వారా కలుషిత నీటిని మూసీ నదిలో కలపడం వల్ల మూసి విషతుల్యమవుతుందని ఆయన ఆరోపించారు. నేడు అనేక పార్టీలు, సంఘాలు మూసి నది కాలుష్యంపై మాట్లాడుతున్నాయని, సిపిఎం పార్టీ సుందరయ్య భవన్ లో మూసి ప్రక్షాళన పై సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. కాలుష్య కారక పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలను శుద్ధిచేసి నీటిలోకి విడుదల చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే సంబంధించిన రసాయనిక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసందర్భంగా శాసనసభ ద్వారా కోరారు.

నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న భూనాది గాని కాలువ, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, బొల్లెపల్లి కాల్వల వెడల్పు కోసం నిధులు కేటాయించాలని, దీని ద్వారా 60 వేల ఎకరాలు సాగుబాటిలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బస్వాపూర్ ప్రాజెక్టు ( నృసింహస్వామి రిజర్వాయర్) చాలా ముఖ్యమైందని, బస్వాపూరం ప్రాజెక్టు (రిజర్వాయర్) ను గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్న డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క సందర్శించారని, ఆయనతో కలిసి 40 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వారి సమస్యలు తెలుసుకున్నానని గుర్తు చేశారు. బస్వాపురం రిజర్వాయర్ భూ నిర్వాసితుల సమస్యలు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు తెలుసునని, బస్వాపూరం ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద 200 కోట్లు కేటాయించాలని, వారందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించి, నష్టపరిహారం అందని ప్రతి ఒక్కరికీ పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని, అందుకు నిధులు కేటాయించాలని అనిల్ శాసనసభ ద్వారా ప్రభుత్వానికి కోరారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News