Friday, February 21, 2025

భారత్‌లో మరెవర్నో గెలిపించేందుకే ఆ నిధులు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచడానికి అమెరికా ప్రభుత్వం అందజేసే 21 మిలియన్ డాలర్లను ఇక నుంచి నిలిపివేస్తున్నట్టు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశం ప్రస్తుతం వివిధ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నిధులు నిలిపివేతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి స్పందించారు. ఈ మేరకు గత బైడెన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఉద్దేశించిన 21 మిలియన్ డాలర్ల నిధులతో అక్కడున్న ‘మరెవరి’ గెలుపు కోసమో బైడెన్ పనిచేశారని ఆయన ఆరోపించారు.

బుధవారం రాత్రి మియామీలో నిర్వహించిన ఎఫ్‌ఐఐ ప్రైయారిటీ సదస్సులో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ , నిధుల అంశాన్ని ప్రస్తావించారు. భారత్‌లో ఓటింగ్ శాతం కోసం మనం ఎందుకు 21 మిలియన్ డాలర్లను ఖర్చు చేయాలి ? అని ప్రశ్నించారు. భారత్‌లో మరెవర్నో గెలిపించేందుకు బైడెన్ ప్రభుత్వం ప్రయత్నించినట్టు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. అదే కీలకమైన ముందడుగు అవుతుందని వ్యాఖ్యానించారు.

తాను అధ్యక్షునిగా కాకముందు అమెరికా నిధులు ఎక్కడికి వెళ్తుండేవో ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పారు.“ రష్యా దాదాపు 2 మిలియన్ డాలర్లను మనదేశంలో ఖర్చు చేసిందంటే అది పెద్ద ఒప్పందం. 21 మిలియన్ డాలర్లు భారత్ ఎన్నికలకు, బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితిని బలోపేతం చేయడానికి 29 మిలియన్ డాలర్లు, … ఆసియా బాగానే ఉంది. మనం వారికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ” అని ట్రంప్ పేర్కొన్నారు. ఇవి కేవలం కొన్ని నిధులకు సంబంధించిన సమాచారమే. ఈ జాబితా చాలా పొడవు ఉంది.

ఓడిపోయుంటే నా జీవితం దారుణంగా ఉండేది …ట్రంప్
2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోయి ఉంటే తన జీవితం దారుణంగా ఉండేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం తనతో అత్యంత దారుణంగా వ్యవహరించిందని ఆరోపించారు. మియామీలో నిర్వహించిన ఓ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ జీవితం గడిపే పరిస్థితి వచ్చి ఉండేదన్నారు. తాజా ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే తర్వాత పోటీ చేసేందుకు చాలా ధైర్యం కావాలని, మరో ప్రశ్నకు బదులిచ్చారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు ముందు ట్రంప్ పోర్న్ స్టార్‌కు హష్ మనీ కేసుతో సహా పలు క్రిమినల్ , సివిల్ కేసులు ఎదుర్కొన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆయనపై ఉన్న రెండు ఫెడరల్ కేసుల నుంచి ఊరట లభించింది. ఇటీవల హష్ మనీ కేసులో న్యూయార్క్ న్యాయమూర్తి షరతులు లేని డిశ్చార్జిని వర్తింప చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News