హైదరాబాద్ : ఎస్‌డిఆర్‌ఎఫ్‌లో 75 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. 2014-15 నుంచి ఇప్పటి వరకు రూ. 2,196.60 కోట్లను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేసిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి. కిషన్‌రెడ్డి శనివారం ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కోత కొచ్చిన పంటలు పాడై రైతులు నష్టపోవడం విచారకరమని, నష్టపోయిన రైతులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలదే అని పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకంలో మొదట్లో చేరిన తెలంగాణ ప్రభుత్వం, ఆ తర్వాత కారణాలేమీ చెప్పకుండానే ఈ పథకం నుంచి వైదొలిగిందన్నారు.
ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో.. పంట నష్టపోయిన లక్షలాదిమంది రైతులు పరిహారాన్ని పొందుతున్నారని వెల్లడించారు. అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన ప్రాంతాలలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, రైతులకు నష్టపరిహాన్ని ప్రకటించే క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయడం లేదంటూనే.. రాష్ట్ర ఖజానా నుంచి కాకుండా, ఎస్‌డిఆర్‌ఎఫ్ (రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి) నుండి రైతులకు పంట నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పారు. ఈ నిధులను 75 శాతం కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. 2014- నుంచి ఇప్పటి వరకు ఎస్‌డిఆర్‌ఎఫ్‌కు రూ. 2,196.60, ఎన్‌డిఆర్‌ఎఫ్ కింద రూ. 873.27 కోట్లు విడుదల చేసిందన్నారు. మొత్తం రూ. 3,069.87 కోట్లు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అందించిందన్నారు.
2022 -23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో రూ.188.80 కోట్లను ఎస్‌డిఆర్‌ఎఫ్‌కు కేంద్ర ప్రభుత్వం జమ చేయనుందన్నారు. ఏప్రిల్ 2022 నాటికి రాష్ట్ర ఎస్‌డిఆర్‌ఎఫ్ అకౌంట్ నందు రూ. 608.06 కోట్ల నిధులు ఉన్నాయి. అంటే ప్రస్తుతం పంట నష్టపోయిన రైతులకు అవసరమైన సహాయాన్ని అందించటానికి సరిపడినన్ని నిధులు ఎస్‌డిఆర్‌ఎఫ్‌లో ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే రైతుల మీద ప్రేమ ఉంటే.. నష్టపోయిన రైతులకు ఎస్‌డిఆర్‌ఎఫ్ కింద ఇస్తున్న పరిహారంతో పాటుగా.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పరిహారం అందించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.