ఏప్రిల్ నెల చెల్లింపుల కోసం
రూ.32 కోట్ల నిధుల విడుదలకు అనుమతులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి ఆర్థిక సాయం అందించేందుకు విద్యాశాఖ నిధులు విడుదల చేసింది. ఏప్రిల్ నెల చెల్లింపుల కోసం రూ.32 కోట్ల నిధుల మంజూరుకు పరిపాలన అనుమతులు ఇస్తూ విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్ కారణంగా కొలువులు పోయి రోడ్డున పడ్డ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి ఆర్థిక సాయం అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. గతేడాది మార్చి వరకు పనిచేస్తూ ఉన్నవారిని ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుని సాయం అందించనున్నారు. కరోనా కారణంగా గతేడాది మార్చిలో లాక్‌డౌన్ విధించడంతో పాఠశాలలు మూతపడ్డాయి. ఈ విద్యా సంవత్సరం ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడంతో కేవలం 25 -50 శాతంలోపు సిబ్బందినే విధుల్లోకి తీసుకున్నాయి. తొలగించిన సిబ్బందికి అన్యాయం జరగకుండా 2020 మార్చి లాక్‌డౌన్ నాటికి పనిచేస్తున్న వారందరినీ పరిగణనలోకి తీసుకొని తిరిగి పాఠశాలల ప్రారంభమయ్యేంతవరకు నెలకు రూ.2 వేల నగదు, 25 కిలోల సన్నబియ్యం ప్రభుత్వం అందించనుంది.