Saturday, November 16, 2024

ఫారెస్ట్ రేంజర్‌కు కన్నీటి వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం: గుత్తికోయల దాడి లో హత్యకు గురైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చల్లమల్ల శ్రీనివాసరావు అంత్యక్రియలు బుధవారం ఆయన స్వగ్రామమైన రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం లో అశ్రునయనాల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ని ర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపి వద్దిరాజు రవిచంద్రలు
ప్రత్యేక హెలీకాఫ్టర్‌లో ఈర్లపూడి గ్రామానికి చేరుకుని శ్రీనివాస్ మృతదేహానికి నివాళులర్పించారు.

అనంతరం అంతిమయాత్రలో రేంజర్ శ్రీనివాసరావు పాడెను మంత్రులు మోశారు. మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపిన అనంతరం శ్రీనివాసరావు చితికి ఆయన కుమారుడు నిప్పంటించారు. ఈ సందర్భంగా మంత్రులు రేంజర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వద్ది రాజు రవిచంద్ర మృతుని కుటుంబానికి రూ.2లక్షల నగదును అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. శ్రీనివాస్ అంత్యక్రియల్లో ఉమ్మడి జిల్లాలోని అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానికులు భారీగా తరలివచ్చారు.

మంత్రులకు మొరపెట్టుకున్న అటవీ సిబ్బంది

అంత్యక్రియల సందర్భంగా కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు రక్షణ కల్పించాలని ఫారెస్ట్ అధికారులు మంత్రుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. అడవులను రక్షించే తమకే రక్షణ లేకుండా పోయిందని, తమకు ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కఠిన చర్యలు లేకపోవడంతోనే దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు రైతులతో మాట్లాడుతుండగా తమపై దాడి చేశారని, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రామారావు వాపోయారు. కాళ్లు పట్టుకొని బతిమిలాడినా కనికరించలేదంటున్నారు. గతంలో చాలా సందర్భాల్లో అటవీ అధికారులపై దాడులు జరిగాయిని, అప్పట్లోనే తాము మొరపెట్టుకున్నామని వారు చెప్పారు.

ఈ విషయాలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకువెళతామని మంత్రులు హామీ ఇచ్చారు. మంత్రులు వెళ్లిన తరువాత కొంతమంది అటవీ సిబ్బంది అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంత్యక్రియల్లో ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, రాములు నాయక్, మెచ్చా నాగేశ్వర రావు, సిఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, సిఎం ఓఎస్డి (హరితహారం) ప్రియాంక వర్గీస్, అటవీ శాఖ స్పెషల్ సిఎస్ శాంతికుమారి, పిసిసిఎఫ్ దొబ్రియల్, పిసిసిఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్లు విపి గౌతమ్, అనుదీప్, ఎస్పీ వినీత్, ఐటిడిఎ పివో పోట్రు గౌతమ్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

హత్యచేసిన వారిని కఠినంగా శిక్షిస్తాం: మంత్రులు హామి

అటవీ అధికారులపై దాడులను సహించేదిలేదని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ఎర్రబోడులో శ్రీనివాసరావును దారుణంగా హత్యచేసిన వారిని వదిలిపెట్టమని, కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అంత్యక్రియల అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుందని, ఇప్పటికే ఈ సంఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సిఎం కెసిఅర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇతర బెనిఫిట్స్ కల్పిస్తూ జీవో జారీ చేసిందని తెలిపారు. ఇక్కడి గిరిజనులతో సమస్య లేదని ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ అక్రమంగా వలస వచ్చిన గుత్తికోయలు అడవులను విచక్షణ రహితంగా నరికి వేస్తున్నారన్నారు. అడవులను నరికినట్లు అటవీ అధికారులపై దాడి చేస్తే వదిలిపెట్టమన్నారు.

ఈర్లపుడిలో విషాదం

శ్రీనివాస్ మృతితో ఖమ్మం జిల్లా ఈర్లపూడిలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయన కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని అప్పుడే వాస్తవాలు బైటికి వస్తాయని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

నేటి నుంచి ఫారెస్ట్ సిబ్బంది విధుల బహిష్కరణ

తెలంగాణలో గురువారం నుంచి విధులు బహిష్కరిస్తామని ఫారెస్ట్ సిబ్బంది అల్టిమేటం ఇచ్చారు. నిన్న గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు మృతి చెందిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అటవీ ప్రాంత పరిసరాల్లోని ప్రజలు శత్రువులుగా భావిస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయని ఫారెస్ట్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తరహాలో తమకు కూడా ప్రభుత్వం ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అభిప్రాయపడ్డారు. స్పష్టమైన హామీ ఇస్తేనే విధులకు హాజరవుతామని ఫారెస్ట్ సిబ్బంది స్పష్టం చేశారు.

ఇద్దరు గొత్తికోయల అరెస్ట్: ఎస్సీ వినీత్

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావుని హత్య చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ బుధవారం వెల్లడించారు. మడకం తులా(45), పోడియం నంగా (37)అనే ఇద్దరు గొత్తకోయలు డిఎఫ్‌వోపై దాడిచేసి హత్య చేశారని తెలిపారు. హత్యానంతరం ఇద్దరు అడవిలో నిద్రబోయి ఛత్తీస్‌ఘడ్‌లోని సుకుమా జిల్లాలోని తమ స్వగ్రామానికి పారిపోవడానికి, డబ్బు కొరకు ఎర్రబొడులోని తమ గుంపును కలవడానికి వెళ్తుండగా వారిని అరెస్ట్ చేశామన్నారు. హత్య సమయంలో వారు ధరించిన దుస్తులను, దాడికి ఉపయోగించిన వేట కొడవళ్ళను స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్‌కు తరలించామని ఎస్పీ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News