టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబె భౌతిక కాయం తన స్వస్థలం టోక్కో నగరానికి శనివారం చేరుకుంది. పశ్చిమ జపాన్ పట్టణం నరలో ఎన్నికల ప్రచారంలో షింజో మాట్లాడుతుండగా శుక్రవారం తుపాకీ కాల్పులకు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి భౌతిక కాయాన్ని టోక్యోకు తరలించారు. భార్య అకీ అబే శోకతప్తయై భర్త భౌతిక కాయానికి తోడుగా అనుసరించారు.మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో టోక్యో లోని షిబుయా జిల్లాకు వాహనంపై భౌతిక కాయం చేరుకుంది. షింజో గృహానికి జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా విచ్చేశారు. సోమవారం భద్రతా ఏర్పాట్ల మధ్య రాత్రంతా గస్తీ కాస్తారని, మంగళవారం అంత్యక్రియలు జరుగుతాయని స్థానిక మీడియా వెల్లడించింది. అబె కుటుంబానికి అంతర్జాతీయ నేతలంతా తమ సంతాపాన్ని వెలిబుచ్చారు. తీరని శోకంతో నివాళులు అర్పించారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ఘోర సంఘటన క్షమించరానిదని, అధికార వర్గాలు దీనిపై సరైన చర్య తీసుకుంటాయని చెబుతూ , అబేపై కాల్పులు జరపడం వెనుక ఉద్దేశమేమిటో తెలియడం లేదని అన్నారు. ఈ సమయంలో ఏ రాజకీయ ఊహాగానాలు చేయవద్దని ప్రజలను అభ్యర్థించారు.