Monday, January 20, 2025

అమరనాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర!

- Advertisement -
- Advertisement -

Furious conspiracy over Amarnath Yatra

జమ్ము సరిహద్దుల్లో సొరంగాన్ని కనుగొన్న బిఎస్‌ఎఫ్

జమ్ము: త్వరలో ప్రారంభమయ్యే వార్షిక అమరనాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని పాకిస్థానీ ఉగ్రవాదులు చేసిన కుట్రను సరిహద్దు భద్రతాదళం(బిఎస్‌ఎఫ్)సిబ్బంది భగ్నం చేశారు. జమ్మూ, కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఓ రహస్య సొరంగాన్ని గుర్తించారు. సాంబా జిల్లాలోని చాక్ ఫఖీరా బోర్డర్ సట్‌పోస్టుకు సమీపంలో 150 మీటర్ల సొరంగం ఉన్నట్లు గుర్తించామని బిఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. ఈ సొరంగాన్ని ఇటీవలే తవ్వారని, పాక్ భూభాగంనుంచే ఈ సొరంగం ఉన్నట్లు బిఎస్‌ఎఫ్ డిప్యూటీ ఐజి ఎస్‌పిఎస్ సంధు చెప్పారు. ఔట్‌పోస్టుకు కేవలం 300 మీటర్ల దూరంలోనే ఈ సొరంగం ఉన్నట్లు చెప్పారు. ఈ సొరంగంనుంచి భారత్‌లోని చివరి గ్రామానికి దూరం 700 మీటర్లేనని ఆయన చెప్పారు. అమరనాథ్ యాత్రకు భంగం కలిగించేందుకు ముష్కరులు భారత భూభాగంలోకి ఈ సొరంగం గుండా చొరబడేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలస్తోంది.

250 అడుగుల పొడవుండే పైప్‌ల ద్వారా ఈ సొరంగంలోకి ఆక్సిజన్ సరఫరా చేసే వారని తెలిసింది. గత నెల జమ్మూలోని సుంజ్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు సిఐఎస్‌ఎఫ్ బస్సుపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం బిఎస్‌ఎఫ్ సిబ్బంది అంతర్జాతీయ సరిహద్దు వెంబడి తనిఖీలను మ్మ్రుం చేశారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం ఈ సొరంగాన్ని గుర్తించారు. వెలుతురు లేకపోవడంతో సోదాలు నిలిపివేసిన బిఎస్‌ఎఫ్ జవాన్లు గురువారం ఉదయం తిరిగి తనిఖీ కొనసాగించారు. కశ్మీర్‌లోని హిమాలయాల్లో ఉండే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఏటా లక్షల మంది అమరనాథ్ యాత్ర చేపడతారు. అయితే ఈ యాత్రకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్నట్లు నిఘావర్గాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాయి. 2017లో అమరనాథ్ యాత్రికుల బస్సుపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 30నుంచి అమరనాథ్ యాత్ర ప్రారంభం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News