మనతెలంగాణ/హైదరాబాద్: మత్స్య పరిశ్రమరంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంలో భాగంగా మత్స్య దర్శిని కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్టు ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ‘ఫిషరీస్ ఫెడరేషన్‘ నెలకొల్పిన మత్స్యదర్శిని కేంద్రాన్ని ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ శనివారం నాడు సందర్శించారు. మత్స్యదర్శిని నిర్వహణకు సంబంధించిన వివరాలను ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ గట్టుపల్లి సుజాత, చైర్మన్ కు తెలియజేశారు.
సెల్లార్ తో పాటు రెండు అంతస్తులలో నిర్మించిన మత్స్యదర్శిని భవన సముదాయాన్ని చైర్మన్ కలియతిరిగారు. మత్స్య దర్శిని భవనంలో నిరుపయోగంగా పడి ఉన్న మొదటి అంతస్తు భవనాన్ని వినియోగించుకొని అధునాతనమైన ‘ఫిస్టారెంట్‘ను నిర్వహించేందుకు గల అవకాశాలను ఆయన పరిశీలించారు. రాజధాని నగరంలో అత్యంత ఖరీదైన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఫిషరీస్ ఫెడరేషన్ ఆధీనంలో ఉన్న సొంత భవన సముదాయాన్ని అవసరమైన మార్పులు చేర్పులు నిర్వహించి పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు అవసరమైన ఆచరణాత్మక కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను చైర్మన్ రవీందర్ ఆదేశించారు.