Thursday, December 26, 2024

శరవేగంగా ‘ఫ్యూచర్ సిటీ’ పనులు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌కు దక్షిణంగా మొత్తం 10,124 ఎకరాల్లో ఇవి నిర్మితం కానున్నాయి. భవిష్యత్ నగరం(ఫ్యుచర్ సిటీ)లో ముచ్చెర్ల, మీర్‌ఖాన్‌పేట తదితర 10 గ్రామాలుంటాయి. ప్రతిపాదిత హైదరాబాద్ ఫార్మా సిటీ (హెచ్‌పీసీ) కూడా ఇక్కడే నిర్మితం కానుంది.

మొత్తం 8 జోన్లలో నిర్మాణం
ఫ్యూచర్ సిటీని మొత్తం ఎనిమిది జోన్లుగా విభజించారు. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, హెల్త్ సిటీ,  స్పోర్ట్స్ హబ్, ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్, రెసిడెన్షియల్ జోన్, మిక్స్‌డ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ ఉంటాయి.

అత్యధిక కేటాయింపులు ఈ రెండింటికే
ఈ సిటీలోని మొత్తం పదివేల ఎకరాల్లో అత్యధికంగా లైఫ్ సైన్సెస్ హబ్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్‌లకు ఏకంగా ఎనిమిది వేల ఎకరాలు కేటాయించారు. ఇందులో లైఫ్ సైన్సెస్ హబ్‌కు 4,207 ఎకరాలు, ఎలక్ట్రానిక్స్ తయారీ జోన్‌కు 3,642 ఎకరాలు కేటాయిస్తారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి, మరీ ముఖ్యంగా శంషాబాద్ విమానాశ్రయం, రీజినల్ రింగ్ రోడ్డు నుంచి ప్యూచర్‌ సిటీకి చేరుకునేందుకు రోడ్డు, మెట్రో రైలు కనెక్టివిటీని కల్పించడంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వివిధ విభాగాలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు.

రెసిడెన్షియల్ జోన్‌కు 1,170 ఎకరాలు
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సిటీకి 140 ఎకరాలు కేటాయించనున్నారు.  అందులో ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ హబ్, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, అప్లికేషన్ అండ్ కొలాబరేషన్ సెంటర్, ఎక్స్‌పీరియన్స్ సెంటర్ నిర్మిస్తారు. కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్‌పేటలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవలే శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్‌ను 225 ఎకరాల్లో నిర్మిస్తారు. స్పోర్ట్స్ క్లబ్‌ను 258 ఎకరాల్లో, హెల్త్ సిటీని 116 ఎకరాల్లో,  రెసిడెన్షియల్ జోన్‌ను 1,170 ఎకరాల్లో, ఎంటర్‌టైన్‌మెంట్  జోన్‌ను 336 ఎకరాల్లో నిర్మిస్తారు. ఇందులో భాగంగా ఇక్కడ మల్టీప్లెక్స్‌ లు, పార్కులు, హోటళ్లు నిర్మిస్తారు.

వరల్డ్ ట్రేడ్ సెంటర్
అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలో ఫ్యూచర్ సిటీలో వాణిజ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఇటీవల ప్రభుత్వంతో ఇందుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో దాని నిర్మాణానికి అనువైన స్థలం కోసం రెవెన్యూ, పరిశ్రమల శాఖ అధికారులు అన్వేషిస్తున్నారు. విమానాశ్రయం, మెట్రో రైల్ స్టేషన్లకు వేగంగా చేరుకునేలా తమకు 50 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే కనుక భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పార్కింగ్ కోసం అదనంగా మరో 20 ఎకరాలు కేటాయించాలని సంస్థ ప్రతినిధులు కోరారు.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News