రిలయన్స్‌తో డీల్‌పై ఆమోదం కోసమే
స్టాక్ ఎక్సేంజీలకు సమాచారమిచ్చిన ఫ్యూచర్ గ్రూప్
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్)తో రూ.24,713 కోట్ల ఒప్పందం ఆమోదం కోసం కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ తన వాటాదారులతో ఏప్రిల్ నెలలో సమావేశం నిర్వహించనుంది. ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ కన్జూమర్, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్, ఫ్యూచర్ సప్లై చైన్ వంటి సంస్థలతో ఏప్రిల్ 20, 21 తేదీల్లో సమావేశం నిర్వహించనున్నామని స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్‌లో సంస్థ తెలిపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగబోయే షేర్‌హోల్డర్లు, క్రెడిటార్‌ల సమావేశాల తేదీలు, ఇతర విధానాల గురించి స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ సమాచారం ఇచ్చింది.
ఫిబ్రవరి 28న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) ముంబై బెంచ్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం, రుణదాతల ఆమోదం కోసం వాటాదారుల సమావేశం ఏప్రిల్ 20, 21న నిర్వహించనున్నారు. రిలయన్స్‌తో డీల్‌ను వ్యతిరేకిస్తూ ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ చేసుకున్న దరఖాస్తును కూడా ఎన్‌సిఎల్‌టి తిరస్కరించింది. ఈ డీల్‌పై అమెజాన్ చాలా కాలంగా న్యాయ పోరాటం చేస్తోంది. 2020 ఆగస్టులో రిలయన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, 19 ఫ్యూచర్ గ్రూప్ కంపెనీలు ఒక కంపెనీగా విలీనం చేసి, ఆ తర్వాత రిలయన్స్ రిటైల్‌కు బదిలీ చేస్తారు.