మానవుడి భవిష్యత్తు యుద్ధంలో లేదని .. బుద్ధుడిలో ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అశోకుడు ఖడ్గంతో సామ్రాజ్య విస్తరణకు అవకాశం ఉన్నా బౌద్ధం స్వీకరించారని గుర్తు చేశారు. గురువారం ఒడిశా లోని భువనేశ్వర్‌లో జరుగుతున్న 18 వ ప్రవాస భారతీయ దినోత్సవ కార్యక్రమంలో రష్యా, ఇజ్రాయెల్ పేర్లు ప్రస్తావించకుండా ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలో అడుగడుగునా వారసత్వం కనిపిస్తుందని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి వ్యాపారులు సుమత్రా, బాలి, జావా వంటి ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు చేసేవారని గుర్తు చేశారు. “ భారత్ ప్రజాస్వామ్యానికి కేవలం తల్లి లాంటిది మాత్రమే కాదు.. అది మన జీవితాల్లో భాగం..విదేశాల్లో జీవించేవారు భారత్‌కు రాయబారులుగా నేను చూస్తాను.
భారత్ నుంచి యువత పూర్తి నైపుణ్యాలతో విదేశాలకు వెళ్లేలా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జీ 20 సందర్భంగా దేశ వ్యాప్తంగా సదస్సులు నిర్వహించి భారత్ వైవిధ్యాన్ని ప్రపంచానికి తెలియజేశాం. మనవారసత్వ , విభిన్న సంస్కృతులను ప్రపంచం గమనిస్తోంది. భారత్ స్వాతంత్య్రం సాధించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసులుకూడా తోడ్పడ్డారు. ప్రవాస భారతీయులు వచ్చే ఏడాది ఈ ఉత్సవానికి వచ్చే సమయంలో కనీసం ఐదుగురు విదేశీ మిత్రులను తమతోపాటు తీసుకురండి. భారత్ కేవలం యువ దేశమే కాదు.. నిపుణులైన యువకుల దేశం. భారత్‌కు విశ్వబంధువుగా గుర్తింపు ఉంది. దానిని మరింత బలోపేతం చేయాలి. ” అని మోడీ ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. మహాకుంభ్, సంక్రాంతి, లోహిర్, మాగ్ బిహు వంటి పండగల సీజన్‌లో ప్రవాస భారతీయ వేడుకలు జరగడం విశేషమన్నారు. ఈ సందర్భంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షుడు క్రిస్టీనే కార్ల వీడియో సందేశం పంపించారు. ఆమె భారత్ పురోగతిని కొనియాడారు.
ప్రవాసి భారతీయ టూరిస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రవాసి భారతీయ ఎక్స్‌ప్రెస్‌రైలును భువనేశ్వర్‌లో గురువారం ఉదయం 10.45 గంటలకు జెండా ఊపి మోడీ రిమోట్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ ఇలా అన్నారు. “ మిత్రులారా.. మేం మీ సౌలభ్యం , సౌకర్యానికి చాలా ప్రాముఖ్యత ఇస్తాం. మీ భద్రత,శ్రేయస్సు, మా మొదటి ప్రాధాన్యత. మన విదేశీ భారతీయులు ఎక్కడ ఉన్నా , సంక్షోభ సమయాల్లో వారికి సహాయం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నాం. నేటి భారత విదేశాంగ విధానానికి మార్గదర్శక సూత్రాలలో ఇదీ కూడా ఒకటని పేర్కొన్నారు. రాబోయే అనేక దశాబ్దాల వరకు భారత దేశం ప్రపంచం లోనే అత్యంత యువ, అత్యంత నైపుణ్యం కలిగిన జనాభా కలిగిన దేశంగా ఉంటుంది. నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కోసం ప్రపంచ డిమాండ్‌ను తీర్చగల సామర్థం భారత దేశానికి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ తదితరులు పాల్గొన్నారు.