Sunday, January 19, 2025

ఓ మాయా ప్రపంచం “ మెటావర్స్‌”

- Advertisement -
- Advertisement -

ప్రపంచం సాంకేతికంగా రోజుకో కొత్త రంగు ధరిస్తోంది. ఈరోజు ఉన్న టెక్నాలజీ రేపటికి పాతదై పోతోంది. ఎప్పటికప్పుడు మనుషులు కొత్త సాంకేతికతలను అలవాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ వంటి సాధనాలు విప్లవాత్మక మార్పులకు కారణమయ్యాయి. ఇప్పుడు తర్వాతి తరం ఇంటర్నెట్ అందుబాటు లోకి వస్తోంది. కొద్ది సంవత్సరాల్లో మనుషులు పూర్తిగా వర్చువల్ ప్రపంచం లోనే గడిపేలా సాంకేతికత రూపు దిద్దుకొంటోంది. ఇదే మెటావర్స్. వాస్తవికతను తలదన్నేలా ఆగ్మెంటెడ్ రియాల్టీ (ఎఆర్), వర్చువల్ రియాలిటీ (విఆర్), బ్లాక్ చెయిన్ వంటి సాంకేతికతతో పాటు సోషల్ మీడియా కాన్సెప్ట్‌ల సాయంతో తయారు చేసిన ఇంటరాక్షన్ డిజిటల్ ప్రపంచమే మెటావర్స్. మెటావర్స్ అనే పదం చాలా మందికి కొత్తగా ఉండవచ్చు.

దాదాపు మూడు దశాబ్దాలకు ముందే దీని గురించి ప్రస్తావన వచ్చింది. అమెరికా సైన్స్‌ఫిక్షన్ రచయిత నీల్ స్టీఫెన్‌సన్ 1992 లో తన నవల స్నో క్రాష్‌లో మెటావర్స్ ను తొలిసారి పరిచయం చేశారు. ఆ నవలలో ఓ భయంకరమైన ప్రపంచం నుంచి మెటావర్స్ సాయంతో మనుషులు తప్పించుకుంటారు. గత 30 ఏళ్లుగా మెటావర్స్ పై చాలా మంది చర్చించుకుంటున్నారు. ఈ మెటావర్స్ సాయంతో భవిష్యత్తులో మనుషులు డిజిటల్ అవతార్లుగా మారినా మారవచ్చు. డిజిటల్ ఆస్తులు, డిజిటల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేయవచ్చు. డిజిటల్ పరికరాల తెరలను చూడడానికి పరిమితమైన మనలను , అవధుల్లేని అంతర్జాల లోకంలో విహరించే వీలు ఈ మెటావర్స్ కల్పిస్తుంది. దూరంగా ఉన్నవాళ్లు ఒకరినొకరు వర్చువల్‌గానే కలుసుకోవచ్చు. ఆడుకోవచ్చు. మాట్లాడుకోవచ్చు. పనిచేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని పనులూ వర్చువల్‌గా రియల్ టైమ్‌లో ఒకరినొకరు చూస్తూ చేసుకోవచ్చు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో మెటావర్స్ కీలక పాత్ర వహిస్తుందని భావిస్తున్నారు.

ఇప్పటివరకు టూ డైమెన్షనల్ స్పేస్‌లను మాత్రమే చూసిన యూజర్స్, ఇక అంతులేని వర్చువల్ రియాల్టీ భావనను అనుభవించే వీలవుతుంది. కంటెంట్ క్రియేటర్స్, డిజైనర్స్, (ముఖ్యంగా త్రీడి మోడలింగ్, వర్చువల్ రియాలిటీ నిపుణులు)కు భవిష్యత్తులో లెక్కలేనన్ని అవకాశాలు వస్తాయి. మెటావర్స్ కార్యరూపం దాల్చడానికి కొత్త టెక్నాలజీలు అవసరమవుతాయి. నిజానికి మెటావర్స్ గురించి ఆలోచించిన మొదటి సంస్థ ఫేస్‌బుక్ కాదు. 2017 మార్చి లోనే డిసెంట్రల్యాండ్ అనే ఓ అంకుర పరిశ్రమ (స్టార్టప్ కంపెనీ )ఇదే విధానాన్ని అవలంబించింది. తమ వినియోగదారులకు వర్చువల్ రియాలిటీ ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఇప్పుడు ఫేస్‌బుక్ సంస్థ తన సంస్థ పేరును మెటావర్స్ ఇంటర్నెట్‌గా మార్చేసింది. ఒక విశ్వం లోని ప్రపంచం ఇప్పుడు మెటావర్స్ కొత్త ప్రపంచం రూపంలో పుట్టింది. విశ్వంలో ప్రజలు భౌతికంగా ఉంటారు. కానీ మెటావర్స్ దీనికి భిన్నంగా ఉంటుంది. మెటావర్స్‌లో ఒక గ్రామంలో కూర్చున్న విద్యార్థి తరగతి గదిలో కూర్చున్న విధంగానే ఢిల్లీ లోని పాఠశాల లేదా కళాశాలలో క్లాస్ తీసుకోవచ్చు.

మెటావర్స్‌లో ఈ ప్రపంచం లో లేని వ్యక్తులతో మాట్లాడవచ్చు. ఇందులో ఆ వ్యక్తి ఫోటో నుండి హోలోగ్రామ్ తయారు చేయబడుతుంది. ఇంకా కృత్రిమ మేధస్సు సహాయంతో మీరు మాట్లాడవచ్చు. వాస్తవ ప్రపంచంలో మీరు చాలా సమస్యలు ఉన్న ప్రదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ మెటావర్స్‌లో మీరు అమెరికా లేదా ప్రపంచం లోని ఏ మూలకైనా ఇంట్లో కూర్చుని వెళ్లవచ్చు. ఈ మెటావర్స్ పూర్తిగా హైస్పీడ్ ఇంటర్నెట్‌పై ఆధారపడిన వర్చువల్ ప్రపంచం. మెటావర్స్ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు ఫేస్‌బుక్ ఐఎన్‌సి ఎంతో ప్రయత్నిస్తోంది. రానున్న రోజుల్లో కొన్ని లక్షల ఉద్యోగాలు రానున్నాయని ప్రకటించింది. సోషల్ మీడియా స్థాయి నుంచి జనాన్ని అనుసంధానించే వ్యవస్థ లోకి తాము అప్‌గ్రేడ్ కాబోతున్నామని ఆ కంపెనీ చెబుతోంది. మెటావర్స్‌ను రియాలిటీ లోకి తీసుకురాడానికి మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ ఐఎన్‌సి, ఎపిక్ గేమ్స్ వంటి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News