Monday, December 23, 2024

నాడు ఖాళీ బిందెలు.. నేడు నిండు కుండలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఖాళీ బిందెలు, కుండలు, కాలిపోయిన మోటర్లతో ధర్నాలు జరిగేవని ఇప్పుడు ఒక్కసారి కూడా అలాంటి ఘటనలు జరగలేదని, ఇది తెలంగాణ సాధించిన విజయమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఆదివారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రవీంద్ర భారతిలో జరిగిన మంచినీళ్ల పండగ సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్ని ప్రసంగించారు. ఇంతకు ముందు హైదరాబాద్ లో తాగు నీటి విషయంలో ఘోరమైన పరిస్ధితి ఉందేదని, ప్రస్తుతం అది మారిందన్నారు. ఈ పరిస్థితి మారడంలో జలమండలి పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. హైదరాబాద్ నగర ప్రజలకు ఎలాంటి కొరత లేకుండా తాగునీరు సరఫరా చేయడంలో ఎంతో కృషి చేస్తున్నందుకు జలమండలి ఎండీ దానకిశోర్, అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.

గత ప్రభుత్వాలు తాగు, సాగు నీరు, విద్యుత్తు ఈ మూడు విషయాల్లో విఫలమయ్యాయన్నారు. కానీ ఈ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల వీటిని నిరంతరాయంగా అందడం మాత్రమే కాకుండా భూగర్భ జలాలు సైతం పెరిగాయని తెలిపారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మిషన్ భగీరథ ఒక గొప్ప పథకం అన్నారు. ఈ పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని పునరుద్ఘాటించారు. అన్ని ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేస్తున్న, ఫ్లోరైడ్ రహితంగా రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్రం పారర్లమెంటులో ప్రకటించిన విషయం గుర్తు చేశారు. కేసీఆర్ ఒక దూరదృష్టి కలిగిన నాయకుడని, ఇదంతా ఆయన విజన్ వల్లే సాధ్యమైందని వివరించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నీటి కొరత లేకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని కొనియాడారు. ఒకప్పుడు గోదావరి నీళ్లు అంటే ఎక్కడో ఉండేవని ప్రస్తుతం అవి మన ఇళ్లల్లోకే వస్తున్నాయని పేర్కొన్నారు. అటు ఓఆర్‌ఆర్ రెండు ఫేజుల ప్రాజెక్ట్, పైప్ లైన్ నెట్ వరక్స్ తో తమ నియోజక వర్గంలో అన్ని ప్రాంతాలకు నీరు సరఫరా చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

మంచినీళ్ల పండగ చేసుకునే నైతిక హక్కు తెలంగాణ ప్రజానీకానికి ఉందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నీటి విషయంలో అప్పుడున్న ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. గతంలో 60 ఏళ్లలో ఎన్ని రిజర్వాయర్లు కట్టారో స్వరాష్ట్రంలో 3 ఏళ్లలో అంతే సంఖ్యలో కట్టారని వివరించారు. తెలంగాణ సాధించిన అద్భుత విజయాల్లో ఇదొకటని కొనియాడారు. మిషన్ భగీరథ లాంటివి గొప్ప పథకాలని అవి శతాబ్ద కాలం పాటు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపారని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ఈసందర్భంగా జలమండలి, మిషన్ భగీరథ అధికారుల్ని మంత్రలు సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ సెక్రటరీ స్మితా సబర్వాల్, జలమండలి డైరెక్టర్లు, ఉన్నతాధికారులు, వాటర్ వర్క్‌ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంబాబు యాదవ్, కనీస వేతన సలహా బోర్డు ఛైర్మన్ నారాయణ, ఇతర ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

అంతకుముందు ఖైరతాబాద్ లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ లో ఆదివారం జరిగిన మంచినీళ్ల పండగ సంబరాల్లో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ మహానగరానికి మంచినీళ్ల సమస్య రాకుడదని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు దీర్ఘకాల ప్రణాళికలు రచించారని పేర్కొన్నారు. 1.19 లక్షల బీపీఎల్ కుటుంబాలకు రూపాయికే నల్లా కనెక్షన్ మంజూరు చేశారని గుర్తు చేశారు. నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీరు నగరవాసులకు వరమన్నారు. ఈ పథకాన్ని చిన్నా పెద్ద కాలనీలు అని తేడా లేకుండా అందరూ వినియోగించుకుంటున్నారని వివరించారు.

అదే విధంగా ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ ఒకప్పుడు వారం రోజులకోసారి నీళ్లిచ్చే స్థాయి నుంచి.. ప్రస్తుతం రెండు రోజులకోసారి ఇచ్చే స్థాయికి చేరుకున్నామన్నారు. అది కూడా రెండు రోజులకు సరిపడా నీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తాగునీటి కోసం రూ.6 వేల కోట్లు వెచ్చిస్తే… ఏర్పాటు అనంతరం రూ.18 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం సుమారు రూ.2214 కోట్లతో సుంకిశాల ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత తాగు నీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో కొత్తగా నిర్మిస్తున్న 31 ఎస్టీపీలు త్వరలో అందుబాటులోకి వస్తాయని.. ఫలితంగా రోజూ ఉత్పన్నమయ్యే మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేసే తొలి నగరంగా దక్షిణాసియాలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో నిలుస్తుందని వివరించా రు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు జలమండలి పరిధిలోని అన్ని సర్కిల్, డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో మంచినీళ్ల పండగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎం ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News