Monday, December 23, 2024

అమెరికాకు మరింత చేరువ!

- Advertisement -
- Advertisement -

జి20 శిఖరాగ్ర సమావేశాలు మొదలు కాకముందే ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య కరచాలన ఆలింగనాలు, ముఖాముఖీ చర్చలు అట్టహాసంగా జరిగిపోయాయి. శని ఆదివారాల్లో జరుగుతున్న సమావేశాల కోసం జో బైడెన్ శుక్రవారం సాయంత్రమే న్యూఢిల్లీ చేరుకొన్నారు. వెనువెంటనే ప్రధాని మోడీ అధికారిక నివాస భవనానికి వెళ్ళి అవ్యవధిగా ఆయనతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గమనిస్తే భారత అమెరికాల మధ్య రక్షణ బంధాన్ని మరింత బలపరిచే పేరుతో వాషింగ్టన్ ఆయుధాల వ్యాపారం జరుపుకొంటున్నదని అనుకోడానికి ఆస్కారం కలుగుతున్నది.

ప్రపంచ జనాభాలో 60%, ఆర్థిక ఉత్పత్తిలో 80% కలిగి వున్న జి20 దేశాల సమావేశం వాస్తవానికి ప్రపంచ ప్రజల సమస్యల మీద చర్చించి వాటి పరిష్కారానికి తీసుకోదగిన నిర్ణయాల మీద ఒక అంగీకారానికి రావడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆయుధ క్రయవిక్రయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. జి20 సమావేశాలను అవకాశంగా తీసుకొని ఆ ఒప్పందాలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు సభ్యదేశాల చిత్తశుద్ధిని శంకించవలసి వస్తుంది.జో బైడెన్ మోడీ మధ్య ఇటీవల కొంత కాలంగా అసాధారణ స్నేహ సంబంధాలు వర్ధిల్లుతున్నాయి. వాటి లక్షం ఇండియాను చైనా వ్యతిరేక కూటమిలోకి మరింతగా లాగడమేనని బోధపడుతున్నది. జిఇఎఫ్ 414 జెట్ యుద్ధ విమాన ఇంజిన్లను మన దేశంలో తయారు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి అయినట్టు నాయకులిద్దరూ ప్రకటించారు.

ఈ మేరకు వాణిజ్య ఒప్పందం కుదరడానికి అవసరమైన నోటిఫికేషన్ ప్రక్రియ అమెరికన్ పార్లమెంటులో పూర్తి అయినందుకు నేతలిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. గగన, సాగర తలాలను శత్రువు నుంచి కాపాడడంలో భారత నిఘా సామర్థాన్ని సునిశితం చేయగల 31 జనరల్ ఆటమిక్స్ ఎంక్యూ 9బి 06 యుద్ధ విమానాలను, వాటి విడి భాగాలను అమెరికా నుంచి కొనుగోలు చేయడానికి అనుమతించాల్సిందిగా ఇండియా పెట్టుకొన్న అర్జీని ప్రెసిడెంట్ బైడెన్ స్వాగతించినట్టు వీరిద్దరి చర్చల అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటన తెలియజేసింది. ఆయుధ మార్కెట్ కూడా ఇతర సరకుల మార్కెట్ వంటిదే. అమ్మేవాడిని బ్రతిమలాడుకొని కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. అలా బ్రతిమలాడుకొంటున్నామంటే అమెరికాను ఒక ఫ్యూడల్ పెత్తందారీ శక్తిగా చూస్తున్నామని అనుకోవలసి వస్తుంది. చైనా నుంచి ఎటువంటి ముప్పునైనా ఎదుర్కోడానికి ప్రధాని మోడీ ప్రభుత్వం ఇండియా ఆయుధ శక్తిని విశేషంగా పెంచుతున్నదని అర్థమవుతున్నది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇప్పించేందుకు సహకరిస్తానని బైడెన్ మరొకసారి హామీ ఇచ్చారు. కాని ఇందులోని సాధ్యాసాధ్యాలేమిటో బయటకు చెప్పడం లేదు.

ఇప్పటికి చాలా కాలంగా మనకు అమెరికా ఈ తాయిలాన్ని చూపిస్తోంది. 202829లో భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం ఇండియాకు లభించబోడం పట్ల జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. 2020 అక్టోబర్ వరకు ఇండియా ఎనిమిది సార్లు భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వాన్ని పొందింది. మండలికి కొత్త సభ్యులను తీసుకొనే ప్రక్రియ మొదలైతే ఇండియాకు అవకాశం కలుగుతుందని చెబుతున్నారు. అయితే ఇప్పట్లో కొత్త శాశ్వత సభ్యులను నియమించే అవకాశం లేదని కూడా అంటున్నారు. ఆ ఘట్టం ప్రారంభమైతే శాశ్వత సభ్యత్వాన్ని పొందే అవకాశాలు జపాన్, బ్రెజిల్ కంటే ఇండియాకే అధికంగా వున్నాయని తెలుస్తున్నది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగానూ, అతిపెద్ద ప్రజాస్వామ్యంగానూ ఇండియా ఈ సభ్యత్వం పొందడానికి ఎంతైనా అర్హురాలు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వుండగా వీటో అధికారంతో ప్రత్యేకించి భద్రతా మండలి సభ్యులుండడమే అసమ న్యాయాన్ని చాటుతున్నది.

ఆ భద్రతా మండలిలో ఇండియా వంటి దేశాలకు చోటు లేకపోడం ఇంకా అన్యాయమైన అంశం. మండలి సభ్యుల సంఖ్యను పెంచాలని ఇండియా, జర్మనీ, జపాన్, బ్రెజిల్ దేశాలు చిరకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. జో బైడెన్ వచ్చే జనవరిలో క్వాడ్ సమావేశాల సందర్భంగా మళ్ళీ మన దేశానికి వస్తున్నారని సమాచారం. క్వాడ్‌లో సభ్యత్వం కలిగిన భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాల్లో మిగతా మూడు దేశాలు మన రిపబ్లిక్ దినోత్సవాల అతిథులుగా హాజరు కానున్నట్టు కూడా తెలుస్తున్నది. చైనా ఎప్పుడూ లేనంతగా మన మీద కక్ష పెంచుకొని సరిహద్దుల్లో అతిగా ప్రవర్తిస్తూ వుండడానికి మనం అమెరికాకు అపూర్వమైన రీతిలో సన్నిహితం కావడం ఒక కారణమని స్పష్టపడుతున్నది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో చాకచక్యంగా తటస్థ వైఖరి తీసుకొని దేశ ప్రయోజనాలను కాపాడుతున్నందుకు ప్రశంసలు పొందుతున్న మోడీ ప్రభుత్వం అమెరికా విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయడం అవసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News