Wednesday, December 25, 2024

సిసలైన ప్రొఫెషనలిజానికి నిదర్శనం జి.కృష్ణ

- Advertisement -
- Advertisement -

‘ఒకసారి నా టేబుల్ దగ్గరకు వచ్చి, ‘ఓ సిగరెట్టు ఇవ్వవయ్యా’, అన్నారు కృష్ణ. టేబుల్ మీద కూర్చుని, ఏ ముఖాన ఉన్నానో ఇవ్వనన్నాను, లేచి వెళ్లిపోయారు. కాసేపయ్యాక రెండు సిగరెట్ పెట్టెలు, అగ్గిపెట్టె నా పక్కన ఉంచి ‘కాల్చుకో’ అన్నారు.
ఆరు దశాబ్దాల క్రితం చిత్తూరు ‘ఆంధ్రప్రభ’ దినపత్రిక ఆఫీసులో జరిగిన సంగతిని గొల్లపూడి మారుతీరావు ఇలా రాసుకున్నారు. ఇంతకూ గొల్లపూడి ప్రస్తావించిన కృష్ణ ఎవరు? కళ్యాణ వేణుగోపాల కృష్ణమూర్తి అంటే ఎవరికి తెలీదు, కానీ జి కృష్ణ లేదా గండూరి కృష్ణ అంటే అందరికీ బోధపడుతుంది. ఈ సంఘటన, ఈ ఇరువురి ప్రముఖుల స్వభావాన్ని పట్టి చూపుతోంది. అదే వ్యాసంలో గొల్లపూడి ఇలా వివరిస్తారు, ‘నాకు మేడలు, బ్యాంకు అకౌంట్లు ఉన్నాయేమో కానీ ఆయన తన 70 ఏటా ఇంతమంది సత్కరించే స్నేహ సంపదను సంతరించుకున్నారు’ అని కూడా వివరించారు. ఈ పరిశీలన అదే ఇరువురి జీవన గమనాలను కూడా తేటతెల్లం చేస్తుంది!
కొన్ని పుస్తకాలు అంతే, చేతికి రాగానే ఉన్నపళంగా చదివేస్తాం. ప్రముఖ పాత్రికేయుడు జి కృష్ణ 70వ జన్మదిన సంచిక అంటూ 1/4 డెమీసైజ్‌లో 64 పేజీల ఇష్యూ ఓ మిత్రుడి ద్వారా అందింది. అందిన కొన్ని గంటలలో చదివేశాను. ఎందుకంటే అందులో విషయం గానీ, రాసిన వారి శైలీ వ్యవహారం గానీ అంత ఆకర్షించాయి కనుక. అయితే ఈ పుస్తకం చూస్తే తమాషా అనిపించింది. దీన్ని 1994లోనో, తర్వాతనో సమాచార పౌరసంబంధాల శాఖ ప్రచురించిందని భావించాలి. ఎవరు ప్రచురించారో, ఎప్పుడు ప్రచురించారో అని ఎక్కడా పేర్కొనకుండా ఇలా వెలువరించడం ఏమిటో? పత్రికల వ్యవహారం వేరు కానీ, సావనీర్ వంటి సంచికల గోల ఇంకో రకం. వాటికి సంబంధించిన పని ఎప్పుడు మొదలు పెడతారో, ఎప్పుడు పూర్తి అవుతుందో ముందుగా గానీ, వెలువడిన తర్వాత గానీ తెలిసే అవకాశం లేనే లేదు. గుంటూరులో స్వామి సీతారామ్ తెలుగు రాష్ట్రం కోసం చేసిన నిరాహార దీక్ష గురించి గోవాడ సత్యారావు చాలా విలువైన సమాచారంతో కూడిన వ్యాసం రాశారు. అయితే వ్యాసంలో కూడా తేదీలు లేవు.
పొత్తూరి వెంకటేశ్వరరావు, జి వెంకట రామారావు, గోపాల చక్రవర్తి, పిరాట్ల వెంకటేశ్వర్లు, యామిజాల పద్మనాభస్వామి, సదాశివ, సర్దేశాయి తిరుమలరావు, సురమౌళి, రాపోలు ఆనంద భాస్కర్, ఎన్ గోపి… మొదలైన 20 మంది రాసిన వ్యాసాలు, కొన్ని ఫోటోలతో కలిసి సుమారు 46 పేజీలు ఆక్రమించాయి. సగానికి పైగా అపురూపమైన సమాచారంతో వ్యాసాలలరారి పుస్తకానికి సంపూర్ణత్వాన్ని సిద్ధింపజేశాయి.
‘కృష్ణ ఉభయ భాషాప్రవీణులు టైపు మిషన్ ఉంటే ముందు కూర్చుని కాసేపట్లో ఇంగ్లీష్ వ్యాసం తయారు చేసే ఇవ్వగలరు లేకపోతే ఓపికగా కలం పట్టి రాసివనుగలరు తెలుగైనా, ఇంగ్లీష్ అయినా ఆయన రాస్తే వేగం ఒకటే’ అని పొత్తూరి వెంకటేశ్వరరావు అంటూ, ఇంకా ఇలా వివరిస్తారు. ‘నాకు తెలిసినంతలో ఆయన స్వయంగా టెన్షన్ అనుభవించునూ లేదు, ఇతరులకు టెన్షన్ కల్పించనూ లేదు. పత్రికా రంగంలో ఈ రెండింటిలో ఏదో ఒక లక్షణం లేని వారు అరుదు. కష్టాల్లోనూ కాస్తంత సుఖాన్ని చూసే ఒక ప్రత్యేకత ఏదో ఆయనలో ఉంది. ‘జి కృష్ణ శైలి గురించి మారుతీరావు ఇలా అభినందిస్తారు:
‘ఆయన తెలుగు రచన అతి సరళం. ఏదైనా వ్యాసాన్నో, వార్తనో వ్రాస్తే బస్టాండ్లో నిలబడి పేపర్ చదువుకునేవాడి మనస్సుకి అందే అంత సూటిగా, ముద్దుగా ఉండే బాణీ. అంతటి సారళ్యం -నా మటుకు- వచన రచనలో వేలూరి శివరామశాస్త్రి, శ్రీశ్రీలో కనిపించేది. ఇంగ్లీషూ అంత గొప్పగానూ రాసేవారు’.
జి కృష్ణగా ప్రఖ్యాతులు అయిన జర్నలిస్టు 1924 సం అక్టోబర్ 20వ తేదీన అప్పటి కృష్ణా జిల్లా మధురాపురం అగ్రహారంలో జన్మించారు. 1932లో చదువుల కోసం హైదరాబాదులోని తన మేనమామ ఇంటికి చేరారు. ఇంటర్మీడియట్లో గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు చదివిన జి. కృష్ణకు ఫార్మసీ సబ్జెక్టులో డిగ్రీ చదవాలని కోరిక ఉండి బనారస్ వెళ్లారు, కానీ ఆశ తీరలేదు. 1945లో నిజాం కళాశాలలో బిఎ చదువుకున్న కృష్ణ అదే సంవత్సరం హైదరాబాదులో గులాం మహమ్మద్ కలకత్తావాలా నడిపే ‘మీజాన్’ పత్రికలో కొన్ని వార్తలు రాసి సంచలనం కలిగించారు. అడవి బాపిరాజు పరిచయలేఖతో 1946 మొదట్లో ‘నేషనల్ హెరాల్డ్’ ఆంగ్ల దినపత్రికలో చేరాలని వెళ్లినా, ఎడిటర్ కోటంరాజు రామారావు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు. ఈ విఫలయత్నాలతో జి కృష్ణ హైదరాబాద్ ‘మీజాన్’లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.
సరోజినీ నాయుడు సోదరుడు జయసూర్య సాయంతో మద్రాసులో ఖాసా సుబ్బారావుని కలిసి, తద్వారా ‘ఫ్రీ ప్రెస్’ ఆంగ్ల దినపత్రికలో కృష్ణ చేరారు. తర్వాత 1947 జూన్‌లో ‘ఆంధ్రపత్రిక’ విలేకరిగా చేరి, దాదాపు 12 ఏళ్లు పనిచేసి న్యూస్ ఎడిటర్, అసిస్టెంట్ ఎడిటర్‌గా పదోన్నతి పొందారు. 1959 అక్టోబర్‌లో ‘ఆంధ్రప్రభ’ దినపత్రికలో చేరి 1960 నుంచి 64 దాకా చిత్తూరు నుంచి వెలువడిన ‘ఆంధ్రప్రభ’ ఎడిషన్ కు రెసిడెంట్‌గా పని చేశారు. తర్వాత నాలుగు సంవత్సరాలు హైదరాబాద్‌లో అదే దినపత్రిక న్యూస్ బ్యూరో చీఫ్‌గా కూడా పనిచేసి అస్వస్థత కారణంగా రాజీనామా చేశారు. పిమ్మట నాలుగున్నర సంవత్సరాలు అనారోగ్యం కారణంగా విజయవాడలో ఉండిపోయారు. తర్వాత ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధిగా రాజకీయ వార్తలు కాకుండా కళ, సాహిత్యం, సంస్కృతి గురించి తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో లెక్కలేనన్ని వ్యాసాలూ, వ్యక్తుల జీవిత విశేషాలు రాసి 1982లో ఉద్యోగ విరమణ చేశారు. అధికారం చెంత మరిగే అవకాశం ఉన్న పొలిటికల్ రిపోర్టింగ్‌ను పక్కన పడేసి, కల్చరల్ రిపోర్టింగ్‌లో ప్రవేశించడమనేది ఆయనలోని త్యజించే గుణానికి సాక్ష్యం! ‘నిజాం కుటుంబంలోని వ్యక్తులు, వారి వ్యక్తిత్వాలు, కుటుంబ సంబంధాలు మొదలైన ఎవరికీ తెలియని వివరాలు కృష్ణ ద్వారా వినవలసిందే’ అని పేర్కొనే డా ఎన్ గోపి గురజాడ రాసిన ‘కన్యాశుల్కం’ నాటకం యూనివర్శిటీలో బోధించే సమయంలో జి. కృష్ణ అందించిన అదనపు సమాచారం తనకు ఎంతో దోహదపడిందని కూడా పేర్కొంటారు.
సీనియర్ పాత్రికేయుడు జి వెంకట రామారావు చెప్పిన విషయాలు మరింత అమూల్యమైనవి: ‘ప్రకాశం పంతులు గురించి చెప్పినంతగా, బూర్గుల రామకృష్ణారావు గురించి కూడా చెప్పారు. ఆంధ్ర గవర్నర్ త్రివేది రాజకీయ తీర్మానాలు చేసేముందు హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో సమాలోచనలు జరిపేవారట. కృష్ణ చెప్పే వరకు ఈ సంగతి ఎవరికీ తెలియదు. బూర్గుల వారిని తెలుగు ప్రజానీకం ఉచిత రీతిన గౌరవించలేదు. అందుకు ఈ జాతి తగిన ప్రతిఫలం అనుభవించిందని నిర్భయంగా చెప్పినవారు ముగ్గురే. అందులో మొదటి వ్యక్తి కపిల కాశీపతి (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రథమ సమాచార శాఖ డైరెక్టర్) కాగా, రెండో వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రథమ డెవలప్‌మెంట్ కమిషనర్ సి నరసింహం, మూడో వ్యక్తి జి. కృష్ణ.
‘పివి నరసింహారావు ‘వేయి పడగలు’ నవలను అనువదించలేదు, మరెవరితోనో చేయించారనే ప్రచారం మొదలైనప్పుడు జి కృష్ణ పూనుకొని ‘ఎప్పుడెప్పుడు నరసింహారావు ఎలా అనువాదం చేశారో సవివరంగా రాశారు. అంతేకాదు, మరో నిజం కూడా బయటపెట్టారు. వాస్తవానికి ‘సహస్ర ఫణ్’ మూలంగానే విశ్వనాథ సత్యనారాయణ గారికి జ్ఞానపీఠం వచ్చిం’దంటూ కూడా జి. వెంకట రామారావు వివరించారు.
సంగీతం, నృత్యం, జ్యోతిష్యం వగైరా సంబంధించి కూడా మంచి అవగాహనే కాదు, జి కృష్ణకు వాటి గురించి ఆయనకున్న ప్రావీణ్యం ఎంతో మందికి తెలుసు. సదాశివ వారి ఉన్నత వ్యక్తిత్వం గురించి గొప్పగా ప్రస్తుతించారు. ఇక నిరంతర గతిశీలి, గవ్వరాబడి- ఘడియ విరామంలేని జీవితమని రాజవర్ధన అభివర్ణించినట్టు ఆయనది నిజమైన జీవితోత్సవమే! ఆయన రాసిన ఎన్నెన్నో వ్యాసాలు, పలు పుస్తకాలు ఇంకా అనువాదాలు ఉన్నాయి. అన్నీ పుస్తకాలుగా వచ్చినట్టు లేదు. స్వాతంత్య్ర పూర్వం తెలంగాణ జీవితం గురించి హైదరాబాద్ ఆకాశవాణికి ఎన్నో ప్రసంగాలు చేశారని జీ వెంకట రామారావు రాశారు. ఆ వ్యాసాలు సంకలనంగా వచ్చేయో లేదో తెలియదు. ఈ సమాచారం ఎవరి దగ్గర ఉందో అంతు పట్టడం లేదు. తన జీవితం వడ్డించిన విస్తరి కాదని అతనికీ తెలుసు, అయినా వడ్డించిన విస్తరి అన్నట్లే ప్రవర్తిస్తాడని సదాశివ పరిశీలనగా అంటారు. ఇదే అభిప్రాయాన్ని ఇతరులు మరికొంత విభిన్నంగా, కటువుగా అన్న సందర్భాలు లేకపోలేదు. ఈ మధ్య డాక్టర్ బి విజయ భారతి రాసిన స్వీయచరిత్ర వచ్చింది. తన సిద్ధాంత గ్రంథం పట్ల చాలామంది పెదవి విరిచినా జి. కృష్ణ అభినందించడం చాలా ఊరట అన్నట్టు విజయ భారతి రాసుకున్నారు. ఈ స్థాయి గుర్తింపు, గౌరవం రావడానికి కారణం ఆయనకున్న లోతైన మేధస్సు, విస్తృతమైన అధ్యయనం, అలవోకైన ఉభయ భాషల వ్యక్తీకరణా! ఎంతో ఫోకస్డ్‌గా ఉంటే తప్పా ఇవి సిద్ధించవని మనందరం గమనించాల్సి ఉంది. ఎడిటరుద్యోగం కోసమే కాదు, సొంత ఇంటి కోసం కూడా ఆయన ప్రాకులాడలేదు, ప్రయత్నించలేదు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నా, దానికి సంబంధించిన పెన్షన్ పొందడానికి ప్రయత్నం చేయలేదు! ఎవరో పిలకా గణపతి శాస్త్రిని యామిజాల పద్మనాభస్వామికి పరిచయం చేస్తే, ఈయన పిలకెక్కడని ప్రశ్నించారు. ‘మాదవకవళం’ గేయాన్ని విమర్శిస్తూ ఆయన గురువు చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి పీకేశారని జి. కృష్ణ ఇన్‌స్టంట్‌గా నవ్వుల బాంబు పేల్చారని పద్మనాభ స్వామే రాశారు. 2001 ఏప్రిల్ 6న కన్నుమూసిన జి కృష్ణ శత జయంతి సంవత్సరం ఇటీవల అక్టోబరు 20తో ముగిసింది. ఆ పసగల పాండిత్యం, మేలైన శైలిగల మహాపాత్రికేయుడు జి.కృష్ణను ఇప్పుడైనా గుర్తు చేసుకోవడం సబబని ఇలా చెప్పడానికి ప్రయత్నం చేశాను.

డా. నాగసూరి వేణుగోపాల్
9440732392

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News