Monday, December 23, 2024

జగడాలతో సాగే జగతికాదిది: జి20 ఢిల్లీ డిక్లరేషన్

- Advertisement -
- Advertisement -

జగడాలతో సాగే జగతికాదిది
ఉక్రెయిన్‌పై ఉపేక్షిస్తే గ్లోబల్ ఉపద్రవమే
ఐరాస కట్టుబాట్ల చట్రంలోనే ఏ దేశమైనా అంతర్జాతీయ చట్టాల గీతదాటరాదు
సభ్య సమ్మతితో జి20 ఢిల్లీ డిక్లరేషన్
సక్రమ సరఫరాల వ్యవస్థతోనే మనుగడ
న్యూఢిల్లీ: ఇది సంఘర్షణల కాలం కాదు, యుద్ధాల శకం కాదనే బలీయమైన పిలుపుతో జి20 ఢిల్లీ డిక్లరేషన్ శనివారం వెలువడింది. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు పిలుపుతో ఈ ప్రకటన సాగింది. పలు స్థాయిల కసరత్తుల తరువాత సభ్య దేశాల ఏకాభిప్రాయ సాధనతో ఈ ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం పొంది, సభ్య దేశాలకు, ప్రపంచానికి ప్రాధాన్యాతాంశాలతో సందేశాలు వెలువరించింది. ప్రత్యేకించి ప్రాదేశిక భౌగోళిక సమగ్రతలు, ఆయా ప్రాంతాల సర్వసత్తాకత విలువల పరిరక్షణ సిద్ధాంతాలను అన్ని దేశాలు తూచా తప్పకుండా పాటించాల్సి ఉందని భారతదేశ సారధ్యంలో సాగే జి20 సదస్సు ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణలు, యుద్ధం, దక్షిణ చైనా సముద్రంలో ఇతర చోట్ల చైనా ఆధిపత్య ధోరణుల నేపథ్యంలో వీటిని నేరుగా ప్రస్తావించకుండానే జి20 డిక్లరేషన్ వెలువడింది.

ప్రపంచం కలిసికట్టుగా సాగే దశ ఇది. ఘర్షణల కాలం కాదు. యుద్ధాలు పరస్పర దాడులతో ముందుకు వెళ్లలేం ..వెనుకకే పరిస్థితి దిగజారుతుందని ప్రకటించారు. ప్రపంచ దేశాలన్ని సమగ్రమైన, న్యాయయుత, సమంజసమైన శాశ్వత శాంతి ఉక్రెయిన్‌లో నెలకొనేలా చూడాల్సి ఉందని పిలుపు నిచ్చారు. అన్ని దేశాలు ఇందుకు తగు విధంగా చొరవ తీసుకోవల్సి ఉందని ఇండియా వేదికగా జి 20 సదస్సు ఎలుగెత్తి చాటింది. అన్ని దేశాలు తమకు తామే కాకుండా ఈ ప్రపంచాన్ని పరిరక్షించుకునేందుకు అంతర్జాతీయ చట్టాలకు, విశ్వజనీయ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని సూచించారు.

ఉక్రెయిన్‌లో ఘర్షణ పట్ల సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. ఇంతకు ముందు బాలి జి 20 సమ్మిట్‌లో జరిగిన సంప్రదింపులను, కుదిరిన ఏకాభిప్రాయాలను ఇప్పుడు ప్రస్తావించారు. అప్పటి విషయాలను పునరుద్ఘాటిస్తున్నామని పేర్కొన్నారు. పలు అంతర్జాతీయ సమస్యల పట్ల యుఎన్ ఛార్టర్ సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంది. ఐరాస ప్రాదేశిక సూత్రాలను పాటించాల్సి ఉందని తెలిపారు. అంతర్జాతీయ విషయాలు సార్వత్రికమైనవి, వీటిపై పలు దశలలో భద్రతా మండలి, ఐరాస సర్వప్రతినిధి సభల సమావేశాలలో అన్ని దేశాలు తమ తమ వైఖరిని తెలియచేశాయి. ఇందుకు అనుగుణంగా తీర్మానాలు వెలువడ్డాయి. వీటికి కట్టుబడి వ్యవహరిస్తే ఘర్షణలకు తావు ఉండే ప్రసక్తే లేదని డిక్లరేషన్‌లో తెలిపారు. ఐక్యరాజ్య సమితి నిర్ధేశిత నియమావళి (చార్టర్) మేరకు అన్ని దేశాలు స్పందించాల్సి ఉంది.

ఇతర దేశాల ప్రాదేశికతలకు సవాలు విసరడం కుదరదు. బల ప్రయోగంతో ఇతర దేశాల ప్రాంతాల ఆక్రమణలకు దిగరాదు. ఏ దేశం రాజకీయ స్వాతంత్య్రం ప్రాదేశిక సమగ్రతలకు భంగం కల్గించరాదని, ఇందుకు అనుగుణంగా యుఎన్ ఛార్టర్‌కు కట్టుబడ ఉండటం సరైన ప్రక్రియ అవుతుందని తెలిపారు. అంతర్జాయతీ చట్టాల పరిధిలో భౌగోళిక, సముద్ర జలాల వివావాలు తలెత్తకుండా చూసుకోవచ్చు. అంతర్జాతీయ చట్టాలలో కీలకంగా ఉండే అంతర్జాతీయ మానవీయ విలువల నిబంధనలు, సంబంధిత చట్టాలు కీలకం. ఏకపక్ష లేదా ద్విముఖ కాకుండా బహుళ స్థాయి వ్యవస్థల పరిరక్షణ వల్లనే ప్రపంచ స్థాయిలో శాంతి సమగ్రతలు, సుస్థిరతలు నెలకొనడం జరుగుతుంది. వివాదాలకు ఘర్షణలు పరిష్కారం కాదు. పలు విధాలుగా ఉండే సంప్రదింపులు, దౌత్య ప్రక్రియలను పాటించడం ద్వారా వ్యాజ్యాలను జటిలం చేసుకోకుండా చూసుకోవచ్చు.

గ్లోబల్ ఎకనామిపై దుష్ప్రభావం అనర్థదాయకం
ప్రపంచ ప్రజల భవిత ప్రపంచ స్థాయి ఆర్థికపరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితులే ప్రపంచంలో ఆహారకొరత, అనారోగ్య సమస్యలు, అనూహ్యంగత తలెత్తే పలు రకాల వైరస్ ఇతరత్రా అనారోగ్య క్లిష్టతల దశల్లో తట్టుకునే శక్తిని ఆపాదిస్తాయి. దీనిని పరిగణనలోకి తీసుకోవల్సి ఉంది. యుద్ధం ఇతరత్రా ఘర్షణలతో గ్లోబర్ ఎకానమీకి కలిగే చేటును అన్ని దేశాలూ అర్ధం చేసుకోవల్సి ఉంటుంది. యుద్ధ సంక్లిష్టతలను నిర్మూలించే ఎటువంటి ప్రతిపాదనలను అయినా, చొరవలను అయినా ఈ సదస్సు ఆహ్వానిస్తుంది. దీనిని ఈ డిక్లరేషన్‌లో స్పష్టం చేస్తోందని తెలిపారు. ఐరాస నిర్ధేశిత విధివిధానాల పరిధిలో ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం కుదుర్చుకోవల్సి ఉందని పేర్కొన్నారు.

37 పేజీల సుదీర్ఘ డిక్లరేషన్
ఢిల్లీ వేదికగా వెలువడ్డ జి 20 ఢిల్లీ డిక్లరేషన్‌లో అంశాల వారిగా పలు విషయాల ప్రస్తావన జరిగింది. వివిధ అంశాలతో 83 పేరాలతో మొత్తం 37 పేజీలతో డిక్లరేషన్‌ను వెలువరించారు. జి 20 అంతర్జాతీయ ఆర్థిక సహకారం దిశలో అత్యంత కీలకమైన వేదిక అని తెలిపారు. రాజకీయ భౌగోళిక, భద్రతా సమస్యల పరిష్కారానికి ఈ కూటమి అధీకృత వేదిక కాదని డిక్లరేషన్‌లో అంగీకరించారు. అయితే ఇప్పుడు తలెత్తుతున్న సంక్లిష్టతలు ప్రపంచ దేశాలకు తీవ్ర పరిణామాలను ఉత్పన్నం చేస్తాయని దీనిని గుర్తించే దిశలో డిక్లరేషన్ పిలుపు నిచ్చింది. ప్రకృతిపరమైన వైపరీత్యాలు, వైరస్ కారక ప్రపంచ స్థాయి అనారోగ్యాలు జటిలం అవుతున్న దశలో మానవ కల్పిత ఎంతకు సమసిపోని రీతిలో తలెత్తే ఘర్షణలతో ఏ పక్షానికి సరైన న్యాయం దక్కదని, ఇటువంటి పరిస్థితి మన ఉనికిని మనమే దెబ్బతీసుకున్నట్లు అవుతుందని ఈ సమగ్ర ప్రకటనలో తెలిపారు.

ఉక్రెయిన్ పరిస్థితితో మానవాళికి పలు రకాల ముప్పు
ప్రపంచంలో పలు స్థాయిల్లో ఉన్న మానవీయ దారుణ పరిస్థితులు, కష్టాలు కడగండ్లు, ప్రతికూలతలు మరింత ప్రజ్వరిల్లేందుకు దురదృష్టవశాత్తూ ఉక్రెయిన్ యుద్ధం దారితీసింది. ఆహార భద్రత, ఇంధన సమృద్ధికి గండిపడింది. ప్రత్యేకించి సరఫరాల వ్యవస్థలు గొలుసు కట్టు సరఫరాల క్రమం దెబ్బతింది. దీనితో సూక్ష్మస్థాయి ఆర్థిక వ్యవస్థలు కుదేలుకు దారితీసింది. ద్రవ్యోల్బణం, అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. దీనితో ఇప్పటివరకూ ఉన్న దేశాల వారి పరిస్థితిలో మార్పు తలెత్తింది. ఇప్పటికే పలు విధాలుగా వర్థమాన, నిరుపేద దేశాలు కోవిడ్ మహమ్మారితో దెబ్బతిని ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో, దిగజారిన ఆర్థిక వ్యవస్థలు తిరిగి నిలదొక్కుకునే పరిస్థితి లేకుండా చేసే స్థితిని, విషమింపచేసే వాతావరణాన్ని కల్పించడం జరిగింది.

స్వయం నిర్ణీత అభివృద్థి లక్షాలు (ఎస్‌డిజి)ల వైపు ప్రయాణం పట్టాలు తప్పిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధాన్యాల సరఫరాల క్రమంలో, అదే విధంగా ఎరువులు ఔషధాల సరఫరాల విషయంలో రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ ఏ విధంగా అయినా అడ్డంకులకు దారితీయరాదని పిలుపు నిచ్చారు. ప్రపంచ మార్కెట్‌కు సరఫరాల నిలిపివేతను అంతా ప్రతిఘటించాల్సి ఉందని సూచించారు.ఈ దశలో ఇటీవల ఐరాస సారథ్యంలో టర్కీ, రష్యాల మధ్య కుదిరిన ఇస్తాంబుల్ ఒప్పందం వల్ల సరఫరాలకు ఆటంకాలు తొలిగిపోయ్యే అవకాశం ఏర్పడిందని తెలిపారు. ఇది ఓ విధంగా సముచిత పరిణామం అని తెలిపారు. అయితే ముందుగా ఇటువంటి పరిస్థితి రాకుండా చూడటం కీలకం అని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News