న్యూఢిల్లీ : జీ20 సదస్సు సందర్భంగా ఢిల్లీ నగరంలో ఏర్పాటైన అలంకరణలు, ఆస్తుల నిర్వహణకు యాజమాన్య సంస్థను నియమించడమౌతుందని, నగరం లోని మిగతా ప్రాంతాలను కూడా సుందరీకరణ చేయడమౌతుందని ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు, అతిషి, సౌరభ్ భరద్వాజ్ సోమవారం వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జి20 సదస్సును విజయవంతం చేశారని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
పిటిఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఢిల్లీ నగర సుందరీకరణ గురించి సోమవారం వివిధ విభాగాలతో సమీక్ష నిర్వహించినట్టు చెప్పారు. ఈమేరకు మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో పిడబ్లుడి అధికారులు, సిబ్బంది సుందరీకరణ పనులు చేపడతారని పేర్కొన్నారు. జీ20 సదస్సులో ఏర్పాటైన ప్రతిమలు, ఫౌంటెన్లు తదితర సుందర ఆకృతుల సంరక్షణకు నిర్వహణ సంస్థను నియమిస్తామని తెలిపారు. భవిష్యత్తులో కూడా నగరాన్ని సుందరీకరణతో తీర్చిదిద్దేందుకు పబ్లిక్‌వర్క్ , అర్బన్‌డెవలప్‌మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ తదితర సంస్థలన్నీ కలిసి పనిచేస్తాయని చెప్పారు.
జి20 సదస్సు సందర్భంగా యంత్రాల సాయంతో రోడ్లను ఊడ్చడం, శుభ్రం చేయడం ఒక పద్ధతి ప్రకారం జరిగిందని, ఇప్పుడు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఈ పనులన్నీ కొనసాగిస్తుందని, అవసరమైతే మరికొన్ని యంత్రాలను కొనుగోలు చేయడమౌతుందని పిడబ్లుడి మంత్రి అతిషి వివరించారు. పిడబ్లుడి పరిధిలో 1400 కిమీ పొడవున రోడ్లు ఉన్నాయని ఈ రోడ్లన్నీ సుందరీకరణ అవుతాయని తెలిపారు. ఇటీవల కాలంలో ఢిల్లీలో డెంగ్యూ కేసుల వివరాలు వెల్లడి కావడం లేదన్న ప్రశ్నకు ఆ కేసుల వివరాలు అందించాలని ఎంసిడికి చెప్పామని, డెంగ్యూపై అవగాహన పెంపొందించే కార్యక్రమం చేపట్టాలని ఆరోగ్య విభాగానికి సూచించామని భరద్వాజ్ పేర్కొన్నారు.