Monday, December 23, 2024

ముగిసిన జీ 20 సదస్సు… అధ్యక్ష బాధ్యతలు బ్రెజిల్‌కు అప్పగింత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. గ్రూపు తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సల్వాకు భారత ప్రధాని నరేంద్రమోడీ అప్పగించారు. ఈ మేరకు అధికారికంగా చిన్న సుత్తి వంటి గవెల్‌ను ఆయన చేతికి అందించారు. అనంతరం సదస్సు తీర్మానాలను ప్రధాని మోడీ ప్రకటించారు. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ కు సంబంధించి విజన్‌పై చేస్తోన్న కృషికి జీ 20 ఓ వేదికగా మారడంతో నాకెంతో సంతృప్తి లభించింది. ’ అని సదస్సు ముగింపు సందర్భంగా ప్రధాని మోడీ పేర్కొన్నారు. పలు కీలక అంశాలపైకూడా జీ20 బృందం చర్చించిందన్నారు. దీంతోపాటు ఐరాసలో చేపట్టాల్సిన సంస్కరణల పైనా మోడీ మాట్లాడారు.

ఐరాసను సంస్కరించాల్సిందే : మోడీ ఉద్ఘాటన

ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని భారత ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. సభ్య దేశాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ , ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య మారడం లేదన్నారు. 51 దేశాలతో ఐక్యరాజ్యసమితి ఏర్పడిన సమయంలో పరిస్థితులు వేరన్న ఆయన ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య 200 కు చేరువైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాలానికి అనుగుణంగా ఎవరైతే మార్పు చెందరో , వారు ప్రాముఖ్యాన్ని కోల్పోతారని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. ఇక సామాజిక భద్రత , ద్రవ్య, ఆర్థిక స్థిరత్వం వంటి వాటికి తోడు ఈసారి క్రిప్టో కరెన్సీ కొత్త అంశంగా తోడైందని మోడీ అన్నారు. క్రిప్టోను నియంత్రించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

నవంబరులో జీ20 వర్చువల్ సమావేశం: మోడీ సూచన

జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసిన నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక సూచన చేశారు. ప్రస్తుత సదస్సులో చేసిన సిఫార్సులు, తీర్మానాలను అంచనా వేయడానికి నవంబరు చివర్లో వర్చువల్ సమావేశం నిర్వహించాలని ఆయన సదస్సులో పాల్గొన్న దేశాధినేతలకు సూచించారు. నవంబరు 30 వరకు జీ20కి భారత నాయకత్వమే కొనసాగుతుందనే విషయాన్ని ప్రస్తావించారు. బృంద అధ్యక్షహోదాలో మరో రెండు నెలలు ఉండడం వల్ల మరిన్ని కార్యకలాపాలు పూర్తి చేయొచ్చని ఆయన అభిలషించారు. “గత రెండు రోజుల్లో మీరు మీ అభిప్రాయాలను వెల్లడించారు. సూచనలు, అనేక ప్రతిపాదనలు అందించారు. వాటిని నిశితంగా పరిశీలించడం , వేగవంతం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నామని ” మోడీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News