Saturday, December 28, 2024

బిజెపి నిర్వహించిన జి-20!

- Advertisement -
- Advertisement -

భారతదేశంలో జి 20 దేశాల సదస్సు శని, ఆదివారం జరిగింది. ప్రపంచ నాయకుడిగా తనను తాను ప్రదర్శించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ వేదికను ఉపయోగించుంటున్నారు. ఈ సదస్సు కోసం ఢిల్లీ నగరాన్ని అందంగా తీర్చిదిద్దడం కోసం మురికివాడలను బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. అక్కడి పేదలను వేరే ప్రాంతాలకు తరలించేశారు. బిజెపి ఎన్నికల గుర్తు కమలం కుడ్య చిత్రాలు నగరమంతా దర్శనమిచ్చాయి. రోడ్ల పక్కన మోడీ ముఖంతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. ‘జి20 సదస్సును భారత ప్రభుత్వం కాకుండా, బిజెపి నిర్వహిస్తున్నట్టుగా ఉంది” అని ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్ అవార్డు గ్రహీత అరుంధతీ రాయ్ ‘అల్‌జజీరా’తో అన్నారు. జి20 గురించి, భారత దేశం లో మైనారిటీల గురించి ఢిల్లీలోని తన ఇంటి నుంచి ఆమె అల్‌జజీరాతో మాట్లాడారు.

అల్‌జజీరా: జి20 దేశాల సదస్సుకు ఆతిథ్యమిస్తున్న సందర్భం గా భారతదేశంలో మైనారిటీల గురించి మీ అభిప్రాయం ఏమిటి?
అరుంధతీరాయ్: మైనారిటీలను ఎవరైనా పట్టించుకుంటారని నేనైతే అనుకోవడం లేదు. ఇక్కడ జి 20 దేశాల సదస్సు జరుగుతోంది. ఇక్కడి కొచ్చేవారంతా ఒక అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. వాణిజ్యం ఒప్పందం, ఆయుధ ఒప్పందం, భూభౌతిక రాజకీయ ఎత్తుగడను ఎలా అర్థంచేసుకోవాలో ఆలోచిస్తారు. భారతదేశంలో నిజంగా ఏం జరుగుతోందన్న విషయం ఈ సదస్సుకు వచ్చే ఏ దేశాధినేతకు కానీ, ఏ ఒక్కరికి కానీ అవసరం లేదు. భారత దేశంలో ఏం జరుగుతోందనే దానిపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లోని ప్రధాన పత్రికారంగం నిశితంగా పరిశీలిస్తోంది. మొత్తంపైన ప్రభుత్వానికి భిన్నమైన ఎజెండా ఉంది. ఇక్కడికొచ్చే వారందరూ అమాయకంగా ఈ సమస్య గురించి ఆలోచిస్తారని నేనైతే అనుకోవడం లేదు.
అల్‌జజీరా: మైనారిటీలతో వ్యవహరించే తీరుపై భారత ప్రభుత్వంతో మాట్లాడడానికి జి20 సదస్సు ఒక అవకాశమని ఈ దేశాధినేతలు భావిస్తున్నారన్న విషయం మీరు గమనించారా?

అరుంధతీరాయ్: వారిలో ఏ ఒక్కరూ దాని గురించి మాట్లాడతారని నేననుకోవడం లేదు. అలాంటి అంచనా నాకైతే లేదు. మీరిప్పుడు ఢిల్లీలో ఉన్నట్టయితే నాలాగానే ఆశ్చర్యపోతారు. ఈ ప్రచారార్భాటాన్ని చూసి, ఈ బ్యానర్లను చూసి, జి 20 సదస్సు కోసం చేస్తున్న ఏర్పాట్లను చూసి ఇది ప్రభుత్వం నిర్వహిస్తోందని మర్చిపోయి, బిజెపి నిర్వహిస్తోందనుకుంటారు. ప్రతి చిన్న బ్యానర్‌పైన పెద్ద కమలం గుర్తు. అది మోడీ నాయకత్వంలోని బిజెపి ఎన్నికల గుర్తు. భారత దేశంలో జరుగుతున్నది చాలా ప్రమాదకరమైన పరిణామం.

ఈ దేశం, ఈ ప్రభుత్వం, ఇక్కడుండే సంస్థలన్నీ ఇక్కడుండే పాలక రాజకీయ పార్టీతో కలిసిపోయాయి. పాలక పార్టీ మోడీతోనే ఉంది. వాస్తవానికి జి 20 సదస్సును మోడీ నిర్వహించినట్టు ఏ పాలక పార్టీ నిర్వహించినా ఇలాగే ఉంటుంది. మేమంతా అందులో బందీలమే. దాన్ని దాటి బైటికి వెళ్ళలేం. పేదలు లేకుండా నగరాన్ని ప్రక్షాళన చేశారు. మురికివాడలు లేకుండా చేశారు. రోడ్లలో బ్యారికేడ్లు కట్టి, ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఇది మృత్యువు లాగా ఉంది. అసలు ఢిల్లీ నగరం ఎలా ఉంటుందో విదేశీ నాయకులు చూస్తే మన పాలకులకు అవమానకరంగా ఉంటుందని అలా చేశారు. ఈ సదస్సు కోసం మొత్తం ప్రక్షాళన చేశారు.
అల్‌జజీరా: మీరు చెప్పిందాన్ని బట్టి చూస్తుంటే ఈ సదస్సు మోడీకి గర్వకాణమనుకుంటా?
అరుంధతీరాయ్: బహుశా వారికిది గర్వించ దగ్గదే అయి ఉండవచ్చు. ఎన్నికల ముందు ఆయనొక సుడిగాలి. తన ప్రచారానికి ఇది దోహదం చేస్తుందనుకుంటా. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ఈ పశ్చిమ దేశాల నాయకులు (ట్రంప్ లాంటి వారి గురించి వదిలేయండి. ఎందుకంటే వారికి ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదు) బైడెన్, మ్యాక్రోన్ లాంటి వారికి ఇక్కడ ఏం జరుగుతోందో బాగా తెలుసు.

ముస్లింలను ఇక్కడ ఊచకోత కోశారని తెలుసు, వారి ఇళ్ళను బుల్డోజర్లతో ధ్వంసం చేశారని తెలుసు. న్యాయస్థానాలు, పత్రికల వంటివన్నీ దీనితో కుమ్మక్కయ్యాయి. కొన్ని నగరాల్లో ముస్లింలు ఇళ్ళువదిలి వెళ్ళిపోవాలనే హెచ్చరికగా వారి ఇళ్ళపై ఞ గుర్తులు వేసిన విషయం కూడా వారికి తెలుసు. ముస్లింలు ఒంటరివారైపోయారన్న విషయం కూడా వారికి తెలుసు. ఈ పేదల ఇళ్ళ వద్ద మత ప్రదర్శలు చేసిన వారే, ముస్లింలపై దాడులు చేసి, వారిని చంపారన్న విషయం వారికి తెలుసు. ముస్లింలను చంపేయాలని, వారి మహిళలను మానభంగం చేయాలని కత్తులు పుచ్చుకుని ఈ మూక పిలుపు నిచ్చిందనీ తెలుసు. ఇవ్వన్నీ వారికి తెలుసు. కొన్ని పశ్చిమ దేశాలతో పాటు అది ‘మన కోసం ఉన్న ప్రజాస్వామ్యం’. ఇక్కడున్నది నియంతృత్వం కావచ్చు, మరేమైనా కావచ్చు, తెల్లవాళ్ళు కాని మన స్నేహితులందరికీ ఇది ఏమాత్రం పట్టదు.
అల్‌జజీరా: ఇది ఊహాజనితమైనదే కావచ్చు కానీ, జి 20 సదస్సులో మాట్లాడడానికి మిమ్మల్ని ఆహ్వానించారే అనుకుందాం, ఈ సదస్సును మీరు ప్రారంభించారే అనుకుందాం, మీరేం చెపుతారు?
అరుంధతీరాయ్: అలా ఆలోచించడం మూర్ఖత్వం. నూట నలభై కోట్ల మంది ప్రజలున్న ఈ బూటక ప్రజాస్వామ్యంలో ఫాసిజంలోకి జారిపోతున్నాం. ఇది మిగతా ప్రపంచాన్ని ప్రభావితం చేయదని అనుకోవడం సరికాదు. సహాయం చేయమని అరవడం కాదు.“మీరేమిటో చుట్టూ పరికించండి, దేన్ని సృష్టించడానికి మీరు సాయపడుతున్నారో చూడండి” గుజరాత్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా 2002లో జరిగిన మారణ హోమానికి మోడీదే బాధ్యత అని బ్రిటన్ వంటి దేశాలు తెప్పించుకున్న ఇంటెలిజెన్స్ నివేదికలు చెపుతున్నాయి.

మోడీ అమెరికాలో పర్యటించకుండా నిషేధం విధించారు. ఇప్పుడు ఈ సదస్సును నిర్వహించేది కూడా ఆ మనిషే. అతను మాత్రమే ప్రజలను భారతీయులుగా నిలబెడతాడని ప్రతి సారీ ప్రాణ వాయువును, ఈ రకమైన అవకాశాన్ని ఆయనకు ఇస్తున్నారు. ఆ సందేశం కొత్త చానెళ్ళకు అందుతోంది. అదొక ఆత్మన్యూనతా భావాన్ని, తప్పుడు గర్వాన్ని, సామూహిక అభద్రతను కల్పిస్తోంది. ఇదొక ప్రమాదకరంగా పరిణమించడమే కాదు, ఇది కేవలం భారత ప్రజలకు మాత్రమే ప్రమాదం కాదని అర్థం చేసుకోవాలి.
అల్‌జజీరా: భారత దేశం ఒక కొత్త దశలోకి అడుగిడుతోందని ఇటీవల మీరున్నారు. కాస్త వివరిస్తారా?
అరుంధతీరాయ్: గత కొన్నేళ్ళుగా మనం బిజెపి గురించి, మోడీ జీవితకాల సభ్యుడైన హిందూ ఆధిపత్యానికి మాతృక వంటి ఆర్‌ఎస్‌ఎస్ గురించి మాట్లాడుకున్నాం. దాని నిర్మాణం గురించి, రాజకీయంగా మనలో కొందరు మాట్లాడారు. ఇప్పుడు భిన్నమైనపరిస్థితిలో ఉన్నాం. మనకు ఎన్నికలు ఉన్నప్పటికీ, మనకున్నది ప్రజాస్వామ్యం అని ఇక చెప్పలేను. ఎందుకంటే మనకు ఎన్నికలున్నాయి. హిందూ ఆధిపత్యం అనేది 140 కోట్ల మంది ప్రజలతో ఒక విశ్వసనీయమైన నియోజకవర్గాన్ని సృష్టించాలి. ఎన్నికల కాలం అనేది మైనారిటీలకు చాలా ప్రమాకరమైంది. ఒక భిన్నమైన దశకుచేరాం. నాయకత్వం గురించి కాదు భయపడాల్సింది.

ఈ రకమైన వారితో మైనారిటీలను ప్రమాదంలో పడేసే వీధులు తయారయ్యాయి. హింస కేవలం ప్రభుత్వ ప్రోద్బలంతో వచ్చే మారణకాండ కాదు. ఒకదాని తరువాత ఒకటిగా వచ్చే చెడును చూడడం కాదు, హన్నాఅరెండెట్ (జర్మనీలో పుట్టిన అమెరికా చరిత్రకారిణి, రాజనీతి తత్వవేత్త) ను తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఉత్తర భారతదేశంలోని ఒక పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఏడేళ్ళ ముస్లిం పిల్లవాడిని నిలుచోబెట్టి, హిందూ పిల్లలందరిచేత అతని చెంపల మీద కొట్టించారు. మణిపూర్‌లో రాష్ర్ట ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరించడం వల్ల అంతర్యుద్ధం మొదలైంది. కేంద్రం సంక్లిష్టంగా ఉంది. భద్రతా దళాలు అదుపు చేయలేకపోతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోడీ మహిళల స్వేచ్ఛ గురించి మాట్లాడారు.

అదే సమయంలో బిల్కిస్‌బానోపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె కుటుంబ సభ్యులు 14మందిని దారుణంగా చంపేసిన 11 మంది నేరస్థులకు క్షమాభిక్షపెట్టి జైలు నుంచి విడుదల చేశారు. ఇప్పుడా నేరస్థులు సమాజంలో గౌరవప్రదమైనవారుగా చెలామణి అవుతున్నారు. ఉన్నత న్యాయస్థానం వీరికి గతంలో జీవితఖైదు విధించింది. రాజ్యాంగాన్ని ఏదో ఒక మేరకు పక్కనపెట్టేశారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో వారు మళ్ళీ గెలిస్తే, 2026లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. దీనివల్ల హిందీ మాట్లాడే రాష్ట్రాలలో బిజెపి ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుంది. ఫలితంగా అధికార సమతౌల్యత దెబ్బ తింటుంది. దక్షిణాది అంతా చిన్న చిన్న భాగాలుగా విభజితమైపోతుంది.

ఒకే జాతి, ఒకే భాష, ఒకేసారి ఎన్నికల గురించి మాట్లాడే స్థితిలో ఉన్నాం. ఒక కార్పొరేట్ వ్యవస్థలో ఒక నియంత పాలించే స్థితిలో ఉన్నాం. గుజరాత్ మారణకాండ జరిగిన కాలం నుంచి మోడీకి స్నేహితుడుగా ఒక కార్పొరేట్ శక్తి ఉన్నాడు. అతనిపైన ఆరోపణ చేసింది చిన్న కంపెనీ కాదు, హిండెన్‌బర్గ్ అనే పరిశోధన సంస్థ. చరిత్రలో అతిపెద్ద కుంభకోణంగా చెపుతున్న మోసాన్ని ఈ సంస్థ బైటపెట్టిందని పాత్రికేయ లోకం భావిస్తోంది. కానీ జరిగిందేమీ లేదు. నిబంధనలు కొందరికి వర్తిసాయి, కొందరికి వర్తించవు. నిబంధనలన్నీ ఉన్నాయి. చట్టబద్ధత ఉందన్న విషయం మీకు తెలుసు. మనకు అత్యాధునికమైన న్యాయవ్యవస్థ కూడా ఉంది.
అల్‌జజీరా: దీన్ని మీరు సంక్షిప్తీకరిస్తే, భారతదేశం ఇవాళ ఏ రకమైన రాజ్యం?
అరుంధతీరాయ్: ఇవాళ భారతదేశం చాలా పోటీగా, ప్రమాదకరంగా తయారైంది.రాజ్యాంగాన్ని సమర్థవంతంగా పక్కన పెట్టేసే పరిస్థితి ఏర్పడింది. ప్రపంచంలోనే ధనిక పార్టీగా బిజెపి అవతరించింది. కాస్త ఎక్కువ తక్కువలుగా ఎన్నికల యంత్రాంగమంతా రాజీపడిపోయింది.మైనారిటీలకు వ్యతిరేకంగా హింస చెలరేగుతోందనో, ఎన్నికల్లో అధిక సంఖ్యాక వాదంతో వారు ఓడిపోతున్నందుకో కాదు. ప్రపంచంలో అత్యంత అసమతౌల్య సమాజంలో ఉంటున్నందుకు ఈ పరిస్థితి ఏర్పడింది.ఒక ప్రతిపక్షంగా ఏర్పడుతున్నాం.

తనకు వ్యతిరేక పక్షమే ఉండకూడదని ప్రభుత్వం వ్యతిరేక పక్షాన్ని అణచివేస్తోంది. మనం ఎప్పుడూ ఊహించని స్థితిలో ఉన్నాం.ఎవరూ ఈ పరిస్థితిని ఊహించి ఉండరు. భారతదేశానికి ఆవల ఉన్నవారెవరైనా దీనిపైన నిలబడతారని కూడా అనుకోలేం. ఎందుకంటే వారి కళ్ళపైన డాలర్ల సంతకాలుంటాయి. కోట్లాది మంది ప్రజలున్న మార్కెట్ పైనే వారు చూస్తుంటారు. ఇప్పటికే మణిపూర్‌లో ఉన్నట్టు దేశమంతా గందరగోళం, యుద్ధవాతారణం ఉంటే ఇక్కడ మార్కెట్ కూడా ఉండదు. ఈ మహా దేశం గందరగోళంలో పడిపోతే మార్కెట్ కూడా ఉండదన్న విషయం వాళ్ళకు అర్థం కావడం లేదు. భారత దేశ గొప్పదనం, దాని అందాన్నంతా తగ్గించేసి, మొరుగుతున్న హింసగా కుదించేస్తున్నారు. ఎప్పుడైనా అది విస్పోటనమైతే, అంత దారుణంగా ఏదీ ఉండదు.

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News