Thursday, January 23, 2025

వైరుధ్యాల పుట్ట!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న జి20 (20 దేశాల గ్రూపు) శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ హాజరు కావడం లేదని బీజింగ్ నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. ఆయనకి బదులుగా చైనా ప్రధాని లీ కియాంగ్ వస్తున్నట్టు నిర్ధారణ అయింది. అరుణాచల్‌ప్రదేశ్‌ను, ఆక్సాయ్‌చిన్‌ను తన భూభాగాలుగా చూపుతూ చైనా ఇటీవల మ్యాపును విడుదల చేసింది. దీనిపై ఇండియా తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ ప్రామాణిక మ్యాపు విడుదల తాను మామూలుగా నిర్వహించే సార్వభౌమాధికార వ్యక్తీకరణ విన్యాసాల్లో భాగమేనని చైనా వివరణ ఇచ్చింది. జీ గైర్హాజరుకు ఈ ఒక్కటే కారణమా? 2020లో లడఖ్ సరిహద్దుల్లో రెండు దేశాల సేనల మధ్య సంభవించిన హింసాత్మక ఘర్షణల సమయంలో వాస్తవాధీన రేఖకు కలిగిన అతిక్రమణల నుంచి వైదొలగే విషయంలో సైనికాధికారుల స్థాయిలో ఇప్పటికి 19 సార్లు చర్చలు జరిగినా అంతిమ పరిష్కారానికి చైనా సహకరించడం లేదు. దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్నస్ బర్గ్‌లో ఇటీవల బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు జరిగినప్పుడు ప్రధాని మోడీ, జీ జిన్‌పింగ్ కలుసుకొన్నారు.

లడఖ్ సరిహద్దుల్లో రెండు దేశాల సేనలు తమ తమ స్వస్థలాలకు ఉపసంహరించుకొనేలా సైన్యాధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ వారిద్దరి మధ్య అంగీకారం కుదిరినట్టు వార్తలు వచ్చాయి. అయితే చైనా ఇందుకు భిన్నంగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అనుకొన్నట్టు తన ప్రకటనలో పేర్కొన్నది. సరిహద్దు సమస్యను ఎప్పటికీ ఒక కొలిక్కి రానీయకుండా వివాదాస్పదంగా కొనసాగించాలనేది దాని ఉద్దేశంగా బోధపడుతున్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఢిల్లీ జి 20 భేటీకి హాజరు కావడం లేదు. దీనితో రెండు ముఖ్య దేశాల అధినేతలు ఈ సమావేశాలకు ముఖం చాటు చేస్తున్నారు. అర్జెంటైనా నుంచి అమెరికా వరకు గల 20 దేశాల గ్రూపు ప్రపంచ ఆర్థిక ఉత్పత్తిలో 80 శాతానికి, ప్రపంచ ఎగుమతుల్లో 75 శాతానికి, జనాభాలో 60 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. అందుచేత ఇవి సంఘటితంగా తీసుకొనే నిర్ణయాలకు విశేష ప్రభావం వుంటుంది. కాని విరుద్ధ ధ్రువాలకు చెందిన ఈ దేశాల మధ్య ఏకాభిప్రాయమనేది సులభంగా సాధ్యమయ్యేటట్లు లేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై ప్రకటన రూపకల్పన విషయంలో న్యూఢిల్లీలో విడుదల చేయవలసిన ప్రకటన రూపకల్పనపై అందులో వాక్య నిర్మాణంపై సభ్యదేశాల మధ్య అంగీకారం కుదరడం లేదని వార్తలు చెబుతున్నాయి.

యుద్ధానికి తనను బాధ్యురాలిని చేయడాన్ని రష్యా వ్యతిరేకిస్తున్నది. చైనా దానికి వంత పాడుతున్నది. అమెరికా, ఫ్రాన్స్, కెనడా తదితర పాశ్చాత్య దేశాలు రష్యా వైఖరిని తీవ్రంగా ఖండించాలని కోరుకొంటున్నాయి. యుద్ధానికి బాధ్యతను పూర్తిగా దాని మీదనే వుంచాలని అవి పట్టుబడుతున్నాయి. భారత దేశ ఆతిథ్యంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ సమావేశాల్లో ‘వసుధైక కుటుంబం’ ఆశయం సందేశంగా వుండాలని ఇండియా ఆశిస్తున్నది. దీని విషయంలో కూడా చైనాకు అభ్యంతరాలున్నాయని తెలిసింది. సభ్య దేశాల మధ్య తీవ్ర వైరుధ్యాలున్నంత వరకు ఇటువంటి గొప్ప ఆశయాలు ఆచరణకు నోచుకోవనేది కాదనలేని కఠోర వాస్తవం. ఢిల్లీ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్, టర్కీ అధినేత ఎర్డోగన్, బంగ్లాదేశ ప్రధాని షేక్ హసీనా వంటి ఉద్దండులు హాజరు కానున్నారు. రష్యా, చైనా అధినేతల గైర్హాజరుతో అమెరికా కూటమి ప్రాబల్యం స్పష్టంగా రుజువు కానున్నది. హరిత ఇంధనం, పర్యావరణ పరిరక్షణ వంటి సమస్యలతోపాటు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వంటి వాటి నుంచి రుణ సదుపాయం ఉదారంగా కొనసాగించడం మున్నగు అంశాలు చర్చకు రానున్నాయని తెలుస్తున్నది.

అయితే ప్రపంచ ప్రజలను ముఖ్యంగా పేదలను పీడిస్తున్న అధిక ఆహార ధరలు, ఆహార కొరత వంటి సమస్యల పరిష్కారంపై జి 20 దేశాలు దృష్టి పెట్టే అవకాశాలు ఏ మేరకు వున్నాయో వేచి చూడాలి. ఉక్రెయిన్ నుంచి నల్లసముద్రం మీదుగా ఆహార సరఫరాలను రష్యా అడ్డుకోడం ప్రారంభించిన తర్వాత ఆఫ్రికా దేశాల్లో ఆహార సంక్షోభం తీవ్రమైంది. దీని గురించి ఫలవంతమైన చర్చలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దేశంలో కీలకమైన ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ శిఖరాగ్ర సమావేశాలను బిజెపి తన గొప్పతనంగా చాటుకోడానికి అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ వెలిగిపోతున్నదంటూ ప్రధాని మోడీ ఘనంగా చెప్పుకొంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ఠ ఇనుమడించిందని ప్రచార బాకాలు ఊదరగొడుతున్నాయి. ఇండియాకు బదులు భారత్‌గా ప్రపంచానికి తెలియజేసే పని ఈ సమావేశాల వేదిక మీది నుంచే మొదలు కానున్నట్టు వార్తలు చెబుతున్నాయి. అందుచేత ఈ భేటీ నుంచి ప్రపంచ ప్రజలకు జరిగే మేలు కంటే బిజెపికి వొనగూడే ప్రయోజనాలే ఎక్కువనిపిస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News