న్యూఢిల్లీ : జర్మనీ లోని స్లాస్ ఎల్మాయులో ఈనెల 26,27 తేదీల్లో జరగనున్న జి 7 సదస్సులో పాల్గొనే దేశాధినేతలతో ప్రస్తుత ప్రపంచ సంక్షోభ సమస్యలపై పరస్పర అభిప్రాయాల మార్పిడికి ప్రయత్నిస్తానని ప్రధాని నరేంద్రమోడీ శనివారం వివరించారు. జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కాల్జ్ ఆహ్వానంపై జి 7 సదస్సులో పాల్గొనడానికి ప్రదాని నరేంద్ర మోడీ శనివారం బయలుదేరి వెళ్తున్నారు. ప్రపంచ ఆహార భద్రత, ఇంధన సంక్షోభంతోపాటు భౌగోళిక రాజకీయ గందరగోళానికి దారి తీసిన ఉక్రెయిన్ సంక్షోభం పై కూడా ఈ సదస్సులో ఆయా దేశాలు చర్చించాలని అనుకొంటున్నాయి. అయితే మానవతపై విపరీత ప్రభావం చూపిస్తున్న ముఖ్యమైన ప్రపంచ స్థాయి సమస్యలపై కలిసికట్టుగా చర్యలు తీసుకోడానికి అంతర్జాతీయ సమన్వయాన్ని మరింత పటిష్టం చేసుకోడానికి జి 7 సభ్య దేశాలతోపాటు అర్జెంటైనా, ఇండోనేసియా, సెనెగల్, దక్షిణాఫ్రికా, వంటి ఇతర ప్రజాస్వామ్య దేశాలను, అంతర్జాతీయ సంస్థలను కూడా జర్మనీ ఈ సదస్సుకు ఆహ్వానించింది. జర్మనీ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుంది.
ఈ సదస్సులో పర్యావరణం, ఇంధనం, వాతావరణం, ఆహార భద్రత, ఆరోగ్యం, ఉగ్రవాద నిర్మూలన, లింగసమానత్వం, ప్రజాస్వామ్యంపై పరస్పరం అభిప్రాయాలు మార్చుకునేలా జి7 సభ్య దేశాలతోను, జి 7 భాగస్వామ్య దేశాలతోను , ఆతిత్య అంతర్జాతీయ సంస్థల తోను చర్చిస్తానని మోడీ వివరించారు. సదస్సులో పాల్గొనే కొంతమంది నేతలను తాను కలుసుకోవాలనుకుంటున్నానని చెప్పారు. అలాగే గత నెల భారత్ జర్మనీ చర్చలు ఫలప్రదమైనందున మళ్లీ ఇప్పుడు ఛాన్సలర్ స్కాల్జ్‌ను కలుసుకోవాలనుకుంటున్నానని తెలిపారు. ఐరోపాలో ఉంటున్న ప్రవాస భారతీయ ప్రతినిధులతో జర్మనీలో కలుసుకుంటానని చెప్పారు. జర్మనీ నుంచి జూన్ 28న మోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లి ఇటీవలనే మృతి చెందిన గల్ఫ్ మాజీ అధ్యక్షుడు దివంగత షేక్ ఖల్ఫియా బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌కు నివాళులు అర్పిస్తారు. జాయేద్ గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ఆస్వస్థులై మే 13న మరణించారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇటీవలనే యూఎఈ వెళ్లి జాయేద్‌కు సంతాపం ప్రకటించారు.