తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం
ఉందని చెప్పింది కెసిఆరే బిఆర్‌ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి: తెలంగాణకు అస్తిత్వం, ఆత్మగౌరవం ఉందని ఎలుగెత్తి చెప్పింది కేసీఆర్ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నీ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల ఏర్పాట్ల పై పార్టీ నేతలు, కార్యకర్తలతో సన్నాహాక సమావేశం నిర్వహించారు. అంతకు ముందు మాజీ మంత్రి,
సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించి బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వయస్సు 45 సంవత్సరాలని, రాజకీయ పార్టీ పెట్టడం ఒక సాహసం అన్నారు.
ఆనాడు 100 సంవత్సరాల వయస్సు కలిగిన కాంగ్రెస్ ఒకవైపు, మరో వైపు బిజేపి, మరోవైపు చంద్రబాబు అలాంటి వాళ్ల మధ్య కేసీఆర్ సాహసం చేసి పార్టీ పెట్టారన్నారు. పార్టీ పెట్టి సునామీ సృష్టించి తెలంగాణను తెచ్చారని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలు చూసిందని ఉద్యమం చేసిందని, సుభిక్ష పాలన అందించిందని, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై రేవంత్ రెడ్డిని చీల్చి చెండాడుతున్నామని, ప్రతి తెలంగాణ బిడ్డ గుండె ధైర్యం గులాబీ జెండా అన్నారు. పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 ఏళ్లు ప్రస్థానంలోకి అడుగుపెట్టబోతుందన్నారు. ఇవాళ తిరిగి అధికారంలోకి రావడం చారిత్రక అనివార్యంగా మారిందన్నారు. తెలంగాణ బాగు కొరకు అధికారం కావాలని కోరుకుంటున్నామని,
కాంగ్రెస్ రాకాసులను తరిమికొట్టాలంటే అధికారం మనం సాధించాలని తెలిపారు. కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ సూర్యాపేటకు ఇచ్చారని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు మెడికల్ కళాశాలలు, అద్భుతమైన అభివృద్ధి చేశారన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను మరిచారని, రుణమాఫీ అయిపోయిందని అబద్ధాలు ఆడుతున్నారని, రుణమాఫీ కోసం మొదట 49,500 కోట్లు, మళ్లీ రెండోసారి 40వేల కోట్లు, మూడోసారి 31వేల కోట్లు, చివరికి 20వేల కోట్లు అని అసెంబ్లీలో ప్రకటించారని అన్నారు. నిన్నా మొన్నా వచ్చిన రేవంత్ రెడ్డి జాక్‌పాట్‌లో సీఎం అయ్యారని, ఢిల్లీకి మూటలు పంపి పదవి కాపాడుకోవడమే ఆయనకు పనిగా మారిందని అన్నారు.
ఎస్సారెస్పి కింద కాళేశ్వరం ద్వారా సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌ది అని, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న వేస్ట్ అని, నీళ్లు ఇవ్వలేని ఉత్త మంత్రి ఉత్తమ్ అన్నారు. కేసీఆర్ పై కోపంతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, సాగర్ కింద కూడా నీళ్లు ఇవ్వడం లేదని అన్నారు. జగదీష్ రెడ్డి ఏం అనకున్నా అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారని, కాంగ్రెస్ వాళ్లు స్పీకర్‌ను కూడా అవమానించారని అలాంటి వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. జగదీశ్‌రెడ్డి సూర్యాపేటలో దళిత మహిళను మున్సిపల్ ఛైర్ పర్సన్ చేశాడని, అసెంబ్లీని గాంధీ భవన్ అని పోల్చిన వ్యక్తి పై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని అన్నారు.
ఏప్రిల్ 27న వరంగల్‌లో నిర్వహించే సభను పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, కంచర్ల భూపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, భాస్కర్‌రావు, నోముల భగత్, మాజీ రాజ్యసభ సభ్యులు, జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్, హుజూర్‌నగర్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి, జిల్లా జడ్పి మాజీ వైస్ ఛైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, నాయకులు వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, గండూరి ప్రకాష్, మారిపెద్ది శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.