Tuesday, November 5, 2024

స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ ఎన్నిక ఏకగ్రీవం

- Advertisement -
- Advertisement -

ఒకే నామినేషన్ దాఖలు…
తమ అభ్యర్థులను నిలపని మిగతా పార్టీలు
నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న
సిఎం రేవంత్ రెడ్డి, కెటిఆర్
గడ్డం ప్రసాద్ కుమార్‌కు కాంగ్రెస్‌తో
పాటు బిఆర్‌ఎస్, ఎంఐఎం మద్దతు
నేడు అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించనున్న
ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవమైంది. అసెంబ్లీ స్పీకర్ పదవికి బుధవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. మిగతా పార్టీలేవీ తమ అభ్యర్థులను నిలపలేదు. గడ్డం ప్రసాద్ కుమార్‌కు కాంగ్రెస్‌తో పాటు బిఆర్‌ఎస్ కూడా మద్దతు తెలిపింది. ఎంఐఎం సైతం తమ మద్దతును ప్రకటించింది. దాంతో శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవం కాగా, ఈ విషయాన్ని గురువారం శాసనసభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధికారికంగా ప్రకటించనున్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభంలో స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
నామినేషన్ కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి, కెటిఆర్

కాంగ్రెస్ తరఫున మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో వికారాబాద్ ఎంఎల్‌ఎ గడ్డం ప్రసాద్ కుమార్ సభాపతి పదవికి నామినేషన్ దాఖలు చేశారు. అధికార పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రతిపక్షం నుంచి కెటిఆర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ప్రతిపాదిస్తూ నామినేషన్‌పై సంతకం చేశారు. నామినేషన్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. నామినేషన్ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, మాజీ మంత్రి కెటిఆర్, కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని ఇప్పటికే రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, పార్టీ శాసన సభానేత కెసిఆర్‌ను కోరగా, ఆయన అంగీకరించడం, మరోవైపు ఎంఐఎం నేత పార్టీ సైతం మద్దతు ఇస్తున్న నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. సిఎల్‌పి సమాచారంతో కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎలందరూ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఎన్నికకు బిజెపి ఎంఎల్‌ఎలు మాత్రం దూరంగా ఉన్నారు.

తెలంగాణ తొలి దళిత స్పీకర్‌గా గడ్డం ప్రసాద్

సభాపతిగా ప్రసాద్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి తొలి దళిత స్పీకర్ ఆయనే కానుండడం విశేషం. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గురువారం గడ్డం ప్రసాద్ పేరును అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించి శాసనసభ సమావేశాలను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈనెల 9వ తేదీన మూడో శాసనసభ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు శాసనసభలో సీనియర్ నేత ఎంఐఎం అధ్యక్షుడు, ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. ముందుగా ఆయన రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం శాసనసభలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 101 మంది ఎంఎల్‌ఎలతో ప్రమాణస్వీకారం చేయించారు.

మంత్రులలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపిలుగా రాజీనామా చేయకపోవడం వల్ల ఎంఎల్‌ఎలుగా ప్రమాణస్వీకారం చేయలేదు. మొత్తం 119 మంది ఎంఎల్‌ఎలలో 101 మంది మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. బిజెపికి చెందిన 8 మంది ఎంఎల్‌ఎలు ఎంఐఎం ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ గైర్హాజరయ్యారు. మరోవైపు బిఆర్‌ఎస్‌లో కొంతమంది కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 ఎన్నికల్లో 119 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షం సిపిఐతో కలిసి 65 స్థానాల్లో గెలుపొందగా, బిఆర్‌ఎస్ 39 స్థానాల్లోనూ, బిజెపి 8 స్థానాలు, ఎంఐఎం పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News