Wednesday, January 22, 2025

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్.. ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మూడో అసెంబ్లీకి స్పీకర్‌గా వికారాబాద్ ఎంఎల్‌ఎ గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. సిఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సహా మంత్రులు, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కలిసి ప్రసాద్ కుమార్‌ని సభాపతి స్థానానికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆయనకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం పలువురు ఎంఎల్‌ఎలు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సంప్రదాయం కొనసాగిద్దాం..అసెంబ్లీలో సిఎంగా రేవంత్‌రెడ్డి తొలి స్పీచ్
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీలో తొలి ప్రసంగం చేశారు. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌ను అభినందిస్తూ మాట్లాడారు. తొలి స్పీచ్‌లో ఆయన ఏమన్నారంటే… ‘మూడో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకారం అందించిన బిఆర్‌ఎస్, బిజెపి, ఎంఐఎం, సిపిఐ, కాంగ్రెస్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి సంప్రదా యాన్ని ముందుకు తీసుకొచ్చాం. ఇదే సంప్రదాయం భవిష్యత్‌లో కొనసాగాలని కోరుకుంటున్నాను. అందరి సహకారం అందరి సమన్వయంతో సమావేశాలు నిర్వహించుకుంటే తెలంగాణ ఆకాంక్షను సభ ద్వారా పరిష్కరించవచ్చు. గడ్డం ప్రసాద్ నా సొంత జిల్లా నేను ప్రాతినిధ్యం వహి స్తున్న అసెంబ్లీకి చెందిన వ్యక్తి. వికారాబాద్‌కు చరిత్రలోనే గొప్ప పేరు ఉంది. నిజాం టైంలో రోగులకు వికారాబాద్ గుట్టపై వైద్యం చేసే వాళ్లు. ఇప్పటికీ అక్కడ గాలి నీరు నేల వైద్యానికి ఉపయోగపడే ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వచ్చిన మూడో శాసనసభకు స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆయన ఆధ్వర్యంలో సమాజంలోని ఎన్నో రుగ్మతలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నాను. అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి కుటుంబ బాధ్యత తీసుకొని పైకి వచ్చిన వ్యక్తి. 8 మంది ఆడపడుచులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూ ఈరోజుకి కూడా చూసుకుంటున్నారని గుర్తు చేశారు. శాసనసభను కూడా కుటుంబంలా భావించి అందరి సభ్యులను సమాన దృష్టితో చూస్తారని అనుకుంటున్నాను. ఉమ్మడి కుటుంబాన్ని సమన్వయం చేసిన వ్యక్తి సభకు సభాధ్యక్షుడైతే అందరి సభ్యుల హక్కులు కాపాడతారు. ఎంపిటిసిగా రాజకీయ ప్రస్తానం మొదలైంది. 2008 ఉపఎన్నికల్లో ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. 2009లో కూడా ఎంఎల్‌ఎగా విజయం సాధించారు. మంత్రిగా సేవలు అందించారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కరించడంలో చొరవ చూపారు. జైపాల్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సహకారంతో వికారాబాద్‌ను శాటిలైట్ టౌన్‌గా తీర్చిదిద్దారు. మెడికల్ కాలేజీ కోసం కూడా చాలా శ్రమపడ్డారు. ఏ పదవిలో ఉన్నా ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా ఎప్పుడూ ప్రజలకు దూరంగా లేరు. ప్రసాద్ కుమార్ లాంటి వ్యక్తులు సునిశిత దృష్టితో శాసనసభ్యుల సహకారం సమన్వయంతో సభను నడిపించడానికి మార్గదర్శనం చేస్తార’ని పేర్కొన్నారు.

డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క ఏమన్నారంటే…
డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క ఏమన్నారంటే ‘స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు అభినందనలు. ప్రసాద్ కుమార్ ఎన్నికను ఏకగ్రీవం చేసిన తీరు చాలా ప్రశంసనీయం. పేదల సమస్యలు తెలిసిన వ్యక్తిగా మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తి అనుభవం ఈ సభలో ప్రజాసమస్యలపై చర్చించేందుకు ఉపయోగపడుతుంది. రాష్ట్ర సర్వతోముఖా అభివృద్ధి కోసం అందరం కలిసి పని చేద్దాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే చర్చలు అర్ధవంతంగా ప్రజాసమస్యల పరిష్కారం దిశగా జరగడానికి మీ సలహాలు సూచనలు ఇస్తారని ఆశిస్తున్నాం. ప్రజల ఇబ్బందులు, సమస్యలపై లోతుగా చర్చించడానికి సభలో సభ్యులకు అత్యంత సమయం ఇస్తారని భావిస్తున్నాను. గౌరవ సభ్యులు కూడా వారి గౌరవాన్ని కాపాడుకుంటూ సభ మర్యాదలను పాటిస్తూ వారి హక్కులను సద్వినియోగం చేసుకోవాలి. ప్రజాసమస్యలపై సభలో లోతుగా చర్చించడానికి మూడు సార్లు ఎంఎల్‌ఎగా స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహించిన మీ పరిపాలన అనుభవం దోహదపడుతుంది. షెడ్యూల్ కులలా ఛైర్మన్ పదవి బాధ్యతలు నిర్వహించినప్పుడు ఆ శాఖ పట్ల చొరవ చూపి ఎస్‌సిల అభ్యున్నతి కోసం శ్రమించారు. హ్యాండ్లూమ్ మంత్రిగా చేనేత రుణాలు మాఫీ చేయించి పేదల సమస్యల పరిష్కరించిన తీరు మంచితనాని’కి నిదర్శనమని పేర్కొన్నారు.

మంత్రుల అభినందనలు
పేదల సమస్యలు తెలిసిన వ్యక్తి ప్రసాద్ కుమార్ రాష్ట్రంలోని సమస్యలను పెద్దఎత్తున చర్చించేందుకు సభ్యులకు అధిక సమయం ఇస్తారని ఆశిస్తున్నామని శాసననసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. శాసనసభలో చర్చలు అర్థవంతంగా నడుపుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి సీతక్క స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు అభినందనలు తెలిపారు. ఆయన జీవితం అణగారిన వర్గాలకు ఆదర్శమని కొనియాడారు. ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్ శాసనసభకు తండ్రిలాంటివారని కొనియాడారు. స్పీకర్ పదవికే గడ్డం ప్రసాద్ వన్నె తెస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్‌కు కూనంనేని సాంబశివరావు అభినందనలు తెలిపారు. శాసనసభ దేవాలయం లాంటిదని ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభ పనిచేయాలని తెలిపారు.

ఎంపిటిసి నుంచి స్పీకర్‌గా ఎదిగిన మీ జీవితం స్ఫూర్తిదాయకం..: కెటిఆర్
ఎంపిటిసి నుంచి శాసనసభాధిపతి వరకు ఎదిగిన స్పీకర్ ప్రసాద్ కుమార్ రాజకీయ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారని వెల్లడించారు. 2012 నుంచి 14 వరకు చేనేత జౌళి శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో సిరిసిల్లకు వచ్చారని, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేశారని చెప్పారు. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. మాజీ స్పీకర్లు మధుసూదనా చారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి నెలకొల్పిన సాంప్రదాయాలను, కాపాడిన విలువలను పరిరక్షిస్తారని ఆకాంక్షిస్తున్నాని చెప్పారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు. దురదృష్ట వశాత్తు గాయపడటంతో ఆయన సభకు రాలేకపోయారని చెప్పారు. ఈ సభ అందరిదని, ప్రతి సభ్యుడి హక్కులను కాపాడేలా, ప్రజల తరఫున మాట్లాడేవారి గొంతును వినిపించేలా బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తు న్నట్లు చెప్పారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులతో కలిసి స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన పుష్పగుచ్చం అందించి, శాలువాతో సన్మానించారు. అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కల్వకుంట్ల తారకరామారావుతో పాటు అన్ని పార్టీలకు చెందిన సభ్యులు స్పీకర్‌గా నియామకమైన గడ్డం ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఎంఎల్‌ఎగా కోమటిరెడ్డి, ఉత్తమ్, కెటిఆర్ తదితరుల ప్రమాణ స్వీకారం
తొలిరోజు 101 మంది ఎంఎల్‌ఎలు ప్రమాణం చేయగా మిగిలిన వారితో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయించారు. వారిలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎంఎల్‌ఎలు పద్మారావు గౌడ్, పాడి కౌశిక్‌రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.

పంతం నెగ్గించుకున్న బిజెపి ఎంఎల్‌ఎలు
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు పంతం నెగ్గించుకున్నారు. అక్బరుద్దీన్ ఒవైసీతో ప్రమాణం చేయించుకోబోమని మొండికేసిన బిజెపి ఎంఎల్‌ఎలు గురువారం పూర్తిస్థాయి స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. అయితే, శాసన సభలో బిజెపికి ఇంకా ఎల్పీ నేత లేకపోవడం గమనార్హం. ఇంకా వారు శాసన సభాపక్ష నేతను ఎన్నుకోలేదు. శాసనసభలో ఎంఎల్‌ఎల ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం నేత, చాంద్రాయణ గుట్ట ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్‌ను నియమించారు. శాసనసభలోని ఎంఎల్‌ఎలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని ఎంపిక చేయడాన్ని బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనతో తాము ప్రమాణ స్వీకారం తీసుకోబోమని స్పష్టం చేశారు. ఎంఎల్‌ఎలంతా ప్రమాణం తీసుకున్నప్పుడు వారు అసెం బ్లీని బహిష్కరించారు. తాజాగా గురువారం ప్రమాణం తీసుకున్నారు. తెలంగాణ మూడో అసెంబ్లీకి వికారాబాద్ ఎంఎల్‌ఎ, దళిత నేత గడ్డం ప్రసాద్ కుమార్‌ను స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ ఎంచుకున్న నిర్ణయానికి బిఆర్‌ఎస్‌కూడా మద్దతు తెలుపడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత బిజెపి ఎంఎల్‌ఎలు ప్రమాణం తీసుకున్నారు. నిర్మల్ ఎంఎల్‌ఎ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎంఎల్‌ఎ ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, కామారెడ్డి ఎంఎల్‌ఎ కాటిపల్లి వెంకట రమణా రెడ్డి, సిర్పూర్ ఎంఎల్‌ఎ పాల్వాయి హరీశ్ బాబు, ఆదిలాబాద్ ఎంఎల్‌ఎ పాయల్ శంకర్, ముధోల్ ఎంఎల్‌ఎ రామారావు పటేల్, ఆర్మూర్ ఎంఎల్‌ఎ పైడి రాకేశ్ రెడ్డి, గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్‌లు గురువారం ప్రమాణం తీసుకున్నారు.

ఎంపిటిసి టూ స్పీకర్ చైర్…
గడ్డం ప్రసాద్ కుమార్.. 1964లో మర్పల్లిలో జన్మించారు. ఈయన 21 ఏళ్ల ప్రాయంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. 1984లో ఇంటర్ పూర్తి చేసి, కాంగ్రెస్ అభ్యర్థిగా 2008 ఉప ఎన్నికల్లో బరిలో నిలిచారు. వికారాబాద్ లో అఖండ విజయాన్ని సాధించారు. 2009లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఓటమి చవిచూశారు. అనంతరం 2022లో పిసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఆయన్ను స్పీకర్ పదవికి కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ అభ్యర్థిత్వానికి బిజెపి మినహా మిగతా అన్ని పార్టీల మద్దతు లభించింది. ఆయనకు 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 39 మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఐఎం 7, సిపిఐకు చెందిన ఓ ఎంఎల్‌ఎ మద్దతు తెలిపారు. దీంతో స్పీకర్‌గా ఆయన ఎన్నిక ఏకగ్రీవమే అయ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News