పోలీసు అమరవీరులను అగౌరవపరచడమే : ఎటిఎఫ్
హైదరాబాద్ : ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించడాన్ని యాంటీ టెర్రరిజం ఫోరం (ఎటిఎఫ్) తప్పుపడుతోంది. గద్దర్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించడం ముమ్మాటికీ పోలీసు అమరవీరులను అగౌరవపరచడమేనని ఎటిఎఫ్ కన్వీనర్ రావినూతల శశిధర్ మండిపడ్డారు. నక్సలైట్ వ్యతిరేక పోరాటంలో ఎంతో మంది పోలీసులు, పౌరులు ప్రాణాలను కోల్పోయారని, ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్‌కు అంత్యక్రియలను నిర్వహిస్తే వీరి త్యాగాలను అవమానించడమే అవుతుందన్నారు. తన విప్లవ పాటలతో వేలాది మంది యువతను నక్సలైట్ ఉద్యమం వైపు మళ్లించిన వ్యక్తి గద్దర్ అని ఆయన చెప్పారు. వేలాది మంది పోలీసులను నక్సలైట్ ఉద్యమం బలి తీసుకుందని అన్నారు. తన సాహిత్యం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా యువత సాయుధ పోరాటం చేసేలా చేశారని, వారిని దేశ ద్రోహులుగా మలిచారని విమర్శించారు.