Monday, December 23, 2024

ఒక శతాబ్దం సాంస్కృతిక ఉద్యమాన్ని శాసించిన గద్దర్!

- Advertisement -
- Advertisement -

ఒక శతాబ్దం సాంస్కృతిక ఉద్యమాన్ని శాసించిన సాంస్కృతిక యోధుడు గద్దర్. తుప్రాన్‌లో గుమ్మడి విఠల్ రావుగా జన్మించిన గద్దర్ తెలుగు సాంస్కృతిక ఉద్యమాన్నిఊపించి, శాసించిన నిత్య కళా తపస్వి! నిరంతర సాంస్కృతిక యోధుడు! ఒకరకంగా చెప్పాలంటే తన సాంస్కృతిక దండానికి ఎర్రజెండా ఉన్నా, నీలిజెండా ఉన్నా ఆయన చనిపోయే వరకు తెలుగు భాషా సాంస్కృతిక పీఠాధిపతియే అనక తప్పదు! 1969 తెలంగాణ ఉద్యమం నాటికే పాటపాడిన గద్దర్, 1970 విరసం ఆవిర్భావం నుండి ప్రజా విప్లవోద్యమానికి యోధుడుగా ఎదిగారు. అటుతర్వాత ఆయన నక్సల్‌బరీ ఉద్యమం ప్రభావంతో 1985లో బ్యాంకు ఉద్యోగం మాని గద్దర్‌గా ప్రజా కవి, ప్రజా కళాకారుడుగా మారిపోయి గద్దర్‌గా తెలుగునాట ప్రసిద్ధి చెందారు. పీపుల్స్‌వార్ పార్టీ నాయకుడిగా జననాట్యమండలి స్థాపనలో కీలక భూమిక నిర్వర్తించారు. కొంత కాలం ఆయన అజ్ఞాతవాసం, అరణ్యవాసం సైతం గడిపారు.

విప్లవోద్యమ నేపథ్యం నుండి వచ్చిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నర్సింగరావు మాభూమి సినిమాగా తీశారు. అందు లో ‘బండెనక బండిగట్టి’ పాట ద్వారా తనదైన శైలిని కనబరిచి తెలుగునాట ప్రసిద్ధి చెందారు. అటు తర్వాత నారాయణ మూర్తి సినిమాలకు, జై తెలంగాణ చిత్రానికి పాటలు పాడారు. 1980 ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి కాల్పులలో 100 మంది గిరిజనులు పోలీసు కాల్పుల్లో మృతి చెందడంతో ‘రగల్ జెండా’ అనే బ్యాలేను రూపొందించి జననాట్య మండలి ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చి, ఓ దృశ్యరూపకం ప్రజాశైలిలో సాంకేతికంగా ఎలా ఉండాలో తనదైన శైలిలో నిరూపించారు. ఎఐయల్‌ఆర్సీ ద్వారా ఆయన దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు తిరిగి వివిధ భాషల్లో ప్రదర్శనలు ఇవ్వగలిగారు. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రజాకళాకారులు పాట రాయటమే కాదు, పాడడమే కాదు, తెలంగాణ జన ఆహార్యం అయిన కాళ్ళకు గజ్జెలు, భుజాన గొంగడి, చేతిలో కర్ర, బిళ్ళగోచి, కుర్మా గొల్ల పంచెను ఆయన దైనందిన కళాకారుల ఆవేశంగా, విశేషంగా మార్చి భుజాన గొంగడి ఆహార్యంతో ఆయనకు పేటెంట్‌గా నిలిచారు.

Variation in Gaddar songs

ఈ దశాబ్దం కళాకారుడు అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే గద్దర్ ఆహార్యం, ఆయన నృత్యం శైలిని, పాట, మాట బాణీని నేటికీ ప్రజా కళాకారులు మోడల్‌గా ఆయనను అనుసరిస్తున్నారు. అనుకరిస్తున్నారు. కనుకనే ఈ దశాబ్దపు సాంస్కృతిక యోధుడు, ప్రజా యుద్ధనౌకగా గద్దర్ నిలబడగలిగారు. ఒక దశాబ్దం సాంస్కృతిక సామ్రాజ్యం గద్దర్‌ను అనుసరించింది, అనుకరించి ఉంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా గద్దర్ జనంలో పాపులర్ కావడానికి ప్రధాన కారణం విప్లవోద్యమంలో పాత్రధారి కావడమేననే విషయంలో సందేహం లేదు! జజ్జనకరి జనారే, లాల్ సలాం పాటు ఎత్తుకున్నా గద్దర్ నృత్యం, మాట, పాట అన్నింటి కంటే ఆయన అందుకనుగుణంగా సృష్టించిన ముఖకవళికలు లేక అభినయం ఆయన్ను తిరుగులేని సాంస్కృతిక యోధుడుగా మార్చింది. తెలంగాణ వేషం, భాష, బాణీ ప్రజల నుండి ప్రజలకు అనేసూత్రం విజయవంతంగా ఆపోషనపట్టిన కళాకారుడు.

ప్రజలు దైనందిన జీవితం నుండి వచ్చిన నిట్టూర్పు మాట ఆయన పాటకు పల్లవిగా మార్చుకొనడంలో సిద్ధహస్తుడు. పల్లె పదాలను ఇట్టే పట్టి వల్లె వేయడంలో సిద్ధహస్తుడు. సునిశితమైన హాస్యం మేళవించి సూటి విమర్శను శత్రువు పై మాటను తూటాలా ఎక్కుపెట్టిన సాంస్కృతిక సేనాని గద్దర్. గద్దర్ ఎన్‌కౌంటర్‌లకు వ్యతిరేకంగా వీరులారా! అన్న పాటను ఎర్రజెండా చేతబట్టి నేలను ముద్దాడే దృశ్యా లు, అమరత్వాన్ని అత్యున్నతంగా చేసి కీర్తించే దృశ్యాలు, ఆయన శ్రామికవర్గంలో విప్లవ చైతన్యం నాటడంతో పాటు, వర్గం కసిని పెంచాయి! గద్దర్ పాటకు కళ్ళనీళ్ళు పెట్టని శ్రామికజనం లేరంటే ఆశ్చర్యం లేదు! ఆయన తెలుగు సాంస్కృతిక ఉద్యమాన్ని మలుపు తిప్పిన యోధుడే కాదు! పేద ప్రజల తరపున ఎగరేసిన స్వేచ్ఛ హక్కుల బావుటా కూడానూ? ముఖ్యంగా గిరిజనులు, హరిజనులు, పీడితజనం గొంతుకను విలక్షణ సాంస్కృతిక చరిత్రను తానే అయి సృష్టించుకున్న ధీశాలి గద్దర్. దళితులపై చుండూరు, కారంచేడు దాడులు జరిగిన సందర్భంలో ఆయన ప్రదర్శించిన కుల చైతన్యం సైతం ప్రజలలో ఆలోచనలు నింపింది. మావోయిస్టు పార్టీకి దూరంగా జరిగినప్పటికీ గద్దర్ తనదైన శైలిని, కళారూపాన్ని వదలలేదు! ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో, ధూంధాంలలో గద్దర్ శైలినే ఉద్యమబావుటనై చైతన్యం నింపింది. తెలంగాణ ఉద్యమంలో ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న చరిత్ర, జై తెలంగాణ జైజై తెలంగాణ లాంటి పాటలు మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చాయనడంలో సందేహం లేదు.

మహాకవి శ్రీశ్రీ సాహిత్యరంగంలో యుగకవిగా యువతను ప్రేరేపిస్తే, గద్దర్ తనదైన శ్రామిక సాంస్కృతిక శైలికి రూపకర్తగా, ఈ యుగపు సాంస్కృతిక కృతి కర్తగా చిరస్మరణీయుడు! ఆయన మాట, ఆయన పాట, ఆయన ఆట, ఆయన ఆహార్యం అంతా జనజీవన సమ్మోహనం! అందుకే గద్దర్ ప్రజాచైతన్యం దట్టించిన యుద్ధనౌకగా చారిత్రక సాంస్కృతిక పోరాట సూత్రం, స్ఫూర్తి ప్రదాత! ఎవరేమను కున్నా తెలుగునాట జనపదాల్ని విప్లవ బాణీలుగా మార్చిన విప్లవోద్యమం సాంస్కృతిక రూపశిల్పి! గద్దర్ గుమ్మడి విఠల్ రావు కానేకాదు! యావత్తు తెలుగు జాతి సృష్టించుకున్న జనచైతన్య స్రవంతి, ప్రజా గొంతుక! ఒక శతాబ్దం పాటను, ఆటను, మాటను సుసంపన్నం చేసిన సాంస్కృతిక మహాప్రయోగ శీలి! మహర్షి! మాటల్లో చెప్పుకోలేని ప్రజల ధిక్కార స్వరం. జనం గొంతుక, శ్వాస ఆగిపోయిన ఓ ఆధునిక ప్రజా సాంస్క్రతిక చరిత్ర. గద్దర్ ఓ వ్యక్తి కాదు. శక్తి, కళాయుక్తి, పేద ప్రజల హృదయం. నెత్తురోడుతున్న సాంస్కృతిక గాయమై, నిరంతరాయంగా ప్రజల గుండెల్లో నిలిచే జనగేయం! ఆయన మరో ఉద్యమంలో కనిపించే సాంస్కృతిక పొద్దు పొడుపు! ఆయన సాంస్కృతిక సూర్యుడు! ప్రజా సాంస్కృతిక యుద్ధనౌక గద్దర్ అమర్ రహే! గద్దర్‌కు జోహార్లు!—

యన్. తిర్మల్ , 9441864514

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News