ఎందరోయోధులకు స్ఫూర్తిప్రదాత
ఆయనను అవమానిస్తే సహించేది
లేదు గద్దరన్నను గేట్ బయట
కూర్చోబెట్టిన ఆయన గేట్లు
బద్దలయ్యాయి గద్దర్ జయంతి
సభలో సిఎం రేవంత్‌రెడ్డి
ఆయన కుటుంబం సర్వం కోల్పోయింది
నెక్లెస్‌రోడ్‌లో గద్దర్ మెమోరియల్ ఏర్పాటు
గద్దర్ జయంతి సభలో సిఎం రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజా యుద్ధ నౌక గద్దర్ కుటుంబం సర్వం కోల్పోయింది. వారు ఏనాడు కంటినిండా నిద్ర పోలేదు. నిరంతరం గద్దర్ ప్రజల్లో ఉన్నారు. గద్దర్ తన గళంతో సమాజానికి స్పూర్తినిచ్చారని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రవీంద్రభారతిలో జరిగిన గద్దర్ జయంతి సభలో సిఎం రేవంత్ రెడ్డి మా ట్లాడుతూ గద్దరన్నతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. గత పదేళ్లలో రాజకీయ పరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు, ఒంటరిగా అనిపించినప్పుడు గద్దరన్నతో మాట్లాడేవాడినని తెలిపారు. పోరాటానికి ప్రజల గుర్తి ంపు ఉంటుందని తనలో స్పూర్తిని నింపేవారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గద్దర్ అవార్డు కమిటీని ఏర్పాటు చేసేలా భట్టి విక్రమార్కకు బాధ్యతలు అప్పగించామని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
గద్దర్ మరణం సమాజానికి చేరకుండా ఆనాటి ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. గద్దర్ ఒంటరి కాదు అందరం ఉన్నామని చెప్పి ఎల్బీ స్టేడియానికి ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శన కోసం తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వం ఎల్బీ స్టేడియం గేట్లకు తాళాలు వేస్తే అధికారులను హెచ్చరించి తెరిపించానని ఆయన తెలిపారు. లక్షలాది మంది యోధులను, పోరాట స్పూర్తిని ఇచ్చిన సిద్ధాంతకర్తగా గద్దర్‌ను చూడాలన్నారు. గద్దర్ సైద్దాంతిక కట్టుబాటుతో చివరిశ్వాస వరకు కొనసాగా రన్నారు. చుక్క రామయ్య, అందెశ్రీ, జయధీర్ తిరుమల్ రావు, గోరెటి వెంకన్న, గద్దర్‌కు పద్మ అవార్డులు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదించా మన్నారు. వారెవ్వరు కాంగ్రెస్ నాయకులు కాదనీ, కేంద్ర ప్రభుత్వం అనేది మిథ్య అని, రాష్ట్రాల కలయికనే దేశమని ఆయన అన్నారు.
ఆ ఐదుగురు ఎందులో తక్కువ?
తనతో విభేదించినా నాలుగు కోట్ల సమాజం కోసం మమేకం అయినా వారిని గుర్తించాలన్నదే తమ అభిమతమని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పక్క రాష్ట్రంలో ఐదుగురికి పద్మ అవార్డులు ఇచ్చారు. తెలంగాణ ప్రతిపాదించిన ఐదుగురు ఎందులో తక్కువ..? ప్రధానమంత్రికి తమ నిరసన తెలియజేస్తూ లేఖ రాశామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్‌లోనైనా తమ తప్పును సరిదిద్దుకుంటారని భావిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి ఒకరు ఇష్టానుసారంగా మాట్లాడారని, గద్దరన్నను మరోసారి కించపరిస్తే ఆ పార్టీ ఆఫీస్ అడ్రస్ మార్చుకోవాల్సి వస్తుందన్నారు. నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది గుర్తు పెట్టుకో, నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా, ఏం చేస్తారు, గద్దర్‌ను గేటు బయట కూర్చొపెట్టిన ఆయన గేట్లు బద్దలయ్యాయి, గేటు బయట కూర్చొపెట్టిన ఆయనకు పట్టిన గతే బిజెపి నాయకులకు పడుతుందన్నారు. కేంద్రాన్ని ఇక అడగం, మేమే సంతకం పెడతాం, సైద్దాంతిక విభేదాలపైన చర్చ చేసే వాళ్లు, గౌరవించే వాళ్లు లేరా..? తనను విమర్శించే వారి మాటల్లోని మంచిని తీసుకుంటామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
నెక్లెస్‌రోడ్డులో గద్దర్ మెమోరియల్ ఏర్పాటు
ఈ ప్రభుత్వం ప్రజలదని, ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధానాలను కొనసాగిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వందేళ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఏనాడు దళితుడిని వైఎస్ ఛాన్స్‌లర్‌గా నియమించ లేదని, తాము నియమించామని, సామాజిక న్యాయాన్ని గుర్తు పెట్టుకొని యూనివర్సిటీ విసిలను నియమించామన్నారు. గద్దర్‌ను వ్యక్తులు గుర్తించనంత మాత్రాన విలువ తగ్గదన్నారు. కోహినూర్ వజ్రం విలువ ఏనాడు తగ్గదని, గద్దర్ స్పూర్తి మన దగ్గరుందన్నారు. మహాత్మా గాంధీనే గుర్తించని వారు గద్దర్ గుర్తిస్తారని ఎలా అనుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్ప వ్యక్తుల గౌరవం తగ్గకుండా చూస్తుందని సిఎం రేవంత్ తెలిపారు. జీఓ ఇచ్చేంత వరకు గద్దర్ కూతురు వెన్నెలకు పదవి ఇస్తున్నట్లు తెలియదన్నారు. గద్దర్ స్పూర్తిని కొనసాగించడానికి ప్రభుత్వాన్ని ఆశ్వీరదించాలన్నారు. కంచె అయిలయ్య సూచన మేరకు మహిళా యూనివర్సిటీకి చాకలి అయిలయ్య పేరు పెట్టామన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవని, సలహాలు, సూచనలను పాటిస్తుందన్నారు. నెక్లెస్‌రోడ్డులో గద్దర్ మెమోరియల్ ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకుంటామన్నారు.
కులమతాలకు గద్దర్ అతీతం : భట్టి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గద్దర్ భావజాలాన్ని యావత్తు క్యాబినెట్ నమ్ముతుందన్నారు. గద్దర్ కు పద్మ పురస్కారం ఇవ్వడమంటే భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమేనని అన్నారు. అందరూ చదువుకోవాలన్న గద్దర్ ఆలోచన ప్రకారమే ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసిందన్నారు.గద్దర్ ఆలోచనలు భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తు తరాలకు అందించడానికి గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు అయిందన్నారు. కుల, మత ప్రాంతాలకు అతీతుడైన విశ్వ మానవుడు గద్దర్ అన్నారు. తత్వానికి సరి హద్దులు లేకుండా అనేక తత్వాలను దాటి ఆలోచన చేసిన గొప్ప మేధావి గద్దర్ అని భట్టి కొనియాడారు. గత దశాబ్ద కాలంగా అవార్డులు మరిచిన సినిమా కళాకారులకు వచ్చే ఉగాది సందర్భంగా గద్దర్ పేరిట అవార్డులు ప్రధానం చేస్తామని, అది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా’ అనే పాటతో యావత్తు తెలంగాణను కదిలించి, ఉద్యమంలో నడిపించి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాదులు వేసిన గొప్ప పోరాట యోధుడు గద్దర్ అని భట్టి పేర్కొన్నారు.
చైతన్యాన్ని నింపిన యోధుడు గద్దర్ : జూపల్లి
50 ఏళ్ల పాటు ఆట, పాట, మాటలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన యోధుడు గద్దర్ అని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. ప్రజా వాగ్గేయకారుడు, తెలంగాణ గర్వించే బిడ్డ అని ఆయన తెలిపారు. జీవితాంతం పీడితవర్గ పక్షపాతిగానే జీవనం సాగించారన్నారు. త్యాగానికి, పోరాటానికి నిలువెత్తు ప్రతిరూపం గద్దర్ అని ఆయన అన్నారు. తెలంగాణ సాంస్కృతిక సమాజానికి ఆయన విశేషమైన సేవలందించారన్నారు. తెలంగాణ కోసం తన ఆట పాటలతో స్వరాష్ట్ర చైతన్యాన్ని రగిలించారన్నారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు గద్దర్ ఊపిరి అయ్యారన్నారు. గద్దర్ మన మధ్య లేకపోవడం తెలంగాణకు తీరనిలోటు అన్నారు.