Friday, November 22, 2024

మన కాలపు మహా వాగ్గేయకారుడు

- Advertisement -
- Advertisement -

కవి సంధ్య స్మారక సంచిక

సెప్టెంబర్ 10న కవిసంధ్య గద్దర్ స్మారక సంచిక ఆవిష్కరణ, సంస్మరణ సభ దళిత రచయితల వేదిక, ఆంధ్రప్రదేశ్, కవి సంధ్య, హైదరాబాద్ సంయుక్త నిర్వహణలో ప్రజా వాగ్గేయ కారుడు, యుద్ధ నౌక గద్దర్ సంస్మరణ సభ సెప్టెంబర్ 10 ఆదివారం, సాయంత్రం 5.30 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరుగుతుంది. ఈ సందర్భంగా కవి సంధ్య 44, గద్దర్ స్మారక సంచిక ఆవిష్కరణ ఉంటుంది. శిఖామణి అధ్యక్షతన జరిగే ఈ సభలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, గోరటి వెంకన్న, కె.శివారెడ్డి, బి. నరసింగ రావు, కె. శ్రీనివాస్, సుద్దాల అశోక్ తేజ, తాడి ప్రకాష్, జయరాజు, జి. లక్ష్మినరసయ్య, కె. సజయ, ఎన్. వేణుగోపాల్, జూపాక సుభద్ర, ఎన్. జె. విద్యాసాగర్, తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్, కోయి కోటేశ్వరరావు, జి.వి. రత్నాకర్, నూక తోటి రవికుమార్, పసునూరి రవీందర్ తదితరులు పాల్గొంటారు.

ఒకే చోటు. రెండు కాలాలు. రెండు సందర్భాలు. ఆ చోటు హైదరాబాద్ నడిబొడ్డున వున్న లాల్‌బహదూర్ స్టేడియం. కాలం 20 ఫిబ్రవరి 1990 సందర్భం అప్పటికి దశాబ్ద కాలం పైచిలుకు అజ్ఞాతంలో వున్న ఒక నిప్పుల కంఠం లక్షలాదిగా గుమిగూడిన ప్రజల మధ్యకు వచ్చింది. ఆ నిప్పు కంఠం పేరు గద్దర్. చోటు అదే లాల్ బహదూర్ స్టేడియం, కాలం 6 ఆగస్టు 2023 సందర్భం శీతల శవపేటిలో అదే నిప్పు కంఠం వేలాది అభిమానుల అశ్రు తర్పణంతో శాశ్వత నిద్రలో సేద దీరుతోంది.
నాసిక్‌లోని త్రయంబకం పర్వత సానువుల్లో చిన్నపాయగా పుట్టిన గోదావరి మహా ప్రవాహమై మైదానాలను ముంచెత్తినట్టు, మెదక్ జిల్లా తూప్రాన్‌లోని దళితవాడలో పుట్టిన పాటల సెలయేరు మహానదియై పాటల సస్యకేదారాలను పుట్లకెత్తింది. ఆ సెలయేరు పేరు గుమ్మడి విఠల్ బాబు. గొంగళి పురుగు రంగు రంగుల రెక్కల సీతాకోక చిలుకగా మారినట్లు గుమ్మడి విఠల్ బాబు గద్దర్‌గా గుణాత్మక పరిణామం చెందడం వెనుక కుటుంబ నేపథ్యంతో పాటు అనేక సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక కళారంగ శక్తులు చోదకంగా పని చేశాయి.

విఠల్ బాబులోని గద్దర్‌ను తొలిసారి డిస్కవర్ చేసిన ఘనత భారతీయ ఆర్ట్ సినిమా దిగ్గజం, తెలంగాణ ముద్దుబిడ్డ బి. నరసింగరావుకు దక్కుతుంది. నరసింగరావు నేతృత్వంలోని ఆర్ట్ లవర్స్ సంస్థ సాంగత్యం విఠల్‌బాబును గద్దర్‌గా ఒక అంతర్జాతీయ కళాకారుడిగా, ఐకాన్‌గా మార్చడంలో ఎంతో దోహదం చేసింది.
1972, నవంబర్ 16 నాటి ‘పిలుపు’ పక్షపత్రికలో గద్దర్ తొలి రచన ‘ఆపుర రిక్షోడ’ గేయం అచ్చయింది మొదలు ప్రజాగేయ ప్రస్థానంలో గద్దర్ వెనుతిరిగి చూసింది లేదు. గద్దర్ గేయాలు అధిక శాతం వరవరరావు సారథ్యంలో వెలువడిన సృజనలోను, ‘జననాట్యమండలి పాటలు’ పుస్తకాలలోను అనేక పునర్ముద్రణలు పొందాయి. జన నాట్యమండలి సంస్థ కార్యకలాపాలతో పాటు, విప్లవ సాంస్కృతికోద్యమానికి అలుపెరగని సేవలు అందించారు. అప్పటి వరకు చెదురుమదురుగా వున్న గద్దర్ పాటల్ని 1973 లో వరంగల్‌లో జరిగిన విరసం సాహిత్య పాఠశాలలో ‘వి.బి. గద్దర్ పాటలు’ పేరుతో కెవిఆర్ ముందుమాటతో వెలువడ్డాయి. సాంప్రదాయ జానపదంలోని బాణీలలో, ఆధునిక జీవన వేదనను పలికించడం గద్దర్ గేయాలు సాధించిన విజయం. మంత్రముగ్ధమైన గానం, అందుకు అనుగుణమైన చిట్టిపొట్టి అడుగుల అభినయం, అందుకు తగిన ఆహార్యం గద్దర్‌ను ప్రపంచ స్థాయి కళాకారునిగా నిలబెట్టాయి.

చేతిలోని ఎర్రరుమాలు చుట్టిన చేతి కర్రను ఎగరేయడమే కాదు ఆ కర్ర కంటె ఎత్తుగా ఎగిరిన సందర్భం 1 సెప్టెంబర్ 1985 లో చీరాలలో జరిగిన కారంచేడు దళిత మృతవీరుల సభలో పాడిన ‘దళిత పులులమ్మా! ’ పాట వర్ణ దృక్పథమూ సగభాగం అయింది అక్కడి నుండే “మార్క్ జ్ఞాన సిద్ధాంతంతో పాటు, ఫూలే, అంబేడ్కర్‌ల సిద్ధాంతాలను కలుపుకుపోతేనే భారత దేశంలో విప్లవం వస్తుందని” కుండబద్దలు కొట్టాడు అక్కడి నుండి లాల్ సలామ్ కాస్తా లాల్ నీల్ సలాం అయింది. అయితే ఇది కొందరికి కొరుకుడు పడలేదు. రుచించలేదు. అది వేరే విషయం విప్లవ సాంస్కృతికోద్యమంలో పని చేసిన గద్దర్, విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరుల శవాలను వారి కుటుంబాలకు అందజేసేందుకు, వరవరరావుతో కలిసి గొప్ప ఉద్యమం చేశారు. ఎందరో తల్లులకు అమరులైన తమ బిడ్డల మొహాలు కడసారి చూసుకునే అవకాశం కల్పించారు. ఇదే కాదు గద్దర్‌లోని అతిశయ మానవతా దృక్పథం, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా, తనకు తెలిసిన ప్రతి వారి అంత్యక్రియలకు హాజరయ్యేలా చేసింది. గద్దర్ సృజన రంగంలో చేసిన కృషి నల్ల జాతీయ ప్రజావాగ్గేయకారుడు పాల్ రాబ్సన్‌తో మాత్రమే పోల్చదగింది అని సీనియర్ పాత్రికేయుడు ఎ.బి.కె. ప్రసాద్ అన్న మాట నూటికి నూరుపాళ్ళు నిజం. ఇది గద్దర్ అంతర్జాతీయ కళాతత్వాన్ని పట్టి ఇచ్చే మాట.

6 ఏప్రిల్ 1997 గద్దర్‌పై హత్యా ప్రయత్నం జరిగింది అదృష్టవశాత్తు అయిదు బుల్లెట్లు తొలగించగా, ఒక బుల్లెట్ మాత్రం శరీరంలో వుండిపోయింది. ప్రాణాపాయం తప్పింది అపుడు యావదాంధ్ర కళా ప్రపంచంతో పాటు సామాన్య ప్రజానీకం కలవరపాటుకు గురయింది. ఎంతో సాహిత్యం వచ్చింది. అయితే తర్వాతి కాలంలో బుల్లెట్ నుండి బ్యాలెట్ వైపు సాగిన గద్దర్ ప్రయాణంలో అనేక వెలుగు చీకట్లు, ఎత్తుపల్లాలు వున్నాయి. గద్దర్ మరణ సందర్భంగా అవన్నీ మిత్రులు చర్చకు పెట్టారు. ఏదిఏమైనా రాజ్యం చేతిలో హత్యా ప్రయత్నానికి గురైన ఒక విప్లవ కళాకారునికి తన అంతిమ యాత్రలో అదే రాజ్యం పోలీసు వందనం చేయడం గొప్ప పారడాక్స్.
ఆశు సంప్రదాయానికి చెందిన గద్దర్ పాటలు ఎక్కువ భాగం ఆడియో, వీడియో రూపంలో వున్నాయి. గద్దర్ సమగ్ర సాహిత్యాన్ని ప్రింట్‌లోకి తెచ్చి డిజిటలైజ్ చేసి భవిష్యత్తు తరాలకు అందించవలసిన బాధ్యత గద్దర్ అభిమానులందరిపైనా వుంది. ఇటువంటి బృహత్తర కార్యాన్ని మనసు ఫౌండేషన్ స్వీకరించవలసిందిగా కవిసంధ్య సూచిస్తున్నది. చివరిగా ఒక మాట ఇటీవల అమెరికా శాస్త్రజ్ఞులు మరణానంతర జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అందులో నిజమెంతో తెలియదు. కాని వుంటే గద్దర్ మరణానంతరం కూడా ప్రజల పాటగానే జీవిస్తాడనడంలో సందేహం లేదు. మన కాలపు మహా వాగ్గేయకారుడు గద్దర్‌కు ‘కవిసంధ్య’ లాల్ నీల్ సలాములు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News