హైదరాబాద్: తనపై ఉన్న కేసును ఉపసంహరించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ‘గద్దర్’గా పేరుగాంచిన విప్లవ గాయకుడు గుమ్మడి విఠల్ రావు వినతి చేశారు. కర్నాటకలోని తుముకూరు జిల్లాలోని తిరుమని పోలీస్ స్టేషన్‌లో 2005లో తనపై కేసు మొదలయిందని తెలిపారు. తనపై ఉన్న అన్ని క్రిమినల్ కేసులను, ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించాలని కూడా ఆయన రాష్ట్రపతి ముర్ముకు విన్నవించుకున్నారు. తెలంగాణలో పర్యటించడానికి వచ్చిన ద్రౌపది ముర్ముకు ఆయన ఈ మేరకు ఆయన ఓ మెమొరాండంను పంపారు. 2005 నుంచి 2006 వరకు తనపై మూడు క్రిమినల్ కేసులున్నాయని, వాటిని ఉపసంహరింపజేయాలని ఆయన కోరారు. కర్నాటకలో ఇప్పటికీ పెండింగ్ కేసు ఉందన్నారు.
“నాపై ఆంధ్ర, కర్నాటకలో ఉన్న కేసులన్నీ బనాయించినవే. కుట్రపూరితంగా పెట్టినవే. 2005లో సిపిఐ(మావోయిస్టు) నక్సలైట్లకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు విఫలం కావడం కారణంగానే నాపై కేసులు మోపారు. నాడు నేను రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా వ్యవహరించాను. తుముకూరు జిల్లాలోని తిరుమని పిఎస్‌లో నాపై క్రైమ్ నం. 07/05 తేది 10/02/2005 కింద కేసు పెట్టారు. నేటి వరకు ఆ ఒక్క కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాపై కేసులు ఉపసంహరించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా మరికొన్ని కేసులు ఎత్తేసింది” అని ఆయన తన మెమోరాండంలో రాష్ట్రపతి ముర్ముకు విన్నవించుకున్నారు.
తనను తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిగా పేర్కొంటున్నారని వివరించారు. తనకు ఎలాంటి సమ్మన్లు ఇవ్వకుండా, అరెస్టు వారెంట్ జారీ చేయకుండా 16 ఏళ్లుగా కేసు ముద్దాయిగానే పరిగణిస్తున్నారని గద్దర్ పేర్కొన్నారు. ఆ కేసుల్లో తనను అపరాధిగా శిక్షించలేరని, భవిష్యత్తులో కూడా నేరస్తుడిగా శిక్షించబోరని, కనుక తనను అన్ని కేసుల నుంచి విముక్తున్ని చేయాలని ఆయన విన్నవించుకున్నారు. బడుగువర్గాల వారిలో చైతన్యం తేడానికి, మార్పు కోసమే తాను జానపద గీతాలు పాడనని పేర్కొన్నారు.