Monday, December 23, 2024

గద్దర్ వాగ్గేయ గురువు లచ్చుమమ్మ

- Advertisement -
- Advertisement -

గద్దర్ అనే మారుపేరుతో ప్రాచుర్యం పొందిన ‘గుమ్మడి విఠల్ రావు’ అనే ఒక సామాన్యమైన మానవుడు మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలోని అంటరాని దళిత కుటుంబంలో గుమ్మడి లచ్చుమమ్మ, గుమ్మడి శేషయ్య దంపతులకు ఐదవ సంతానంగా 1948, జనవరి 30 నాడు జన్మించారు. ఆయన కుటుంబ సభ్యులలో అందరికన్నా చిన్నవారు. తల్లి లచ్చుమమ్మ తూప్రాన్ తాలూకా మూసాయిపేట గ్రామానికి చెందినవారు. గుమ్మడి విఠల్ చిన్ననాటి నుండి తండ్రి కన్నా ఎక్కువగా తల్లిని అనుసరించేవారు. గుమ్మడి విఠల్ తల్లి లచ్చుమమ్మ సగటు పల్లెటూరి మహిళ. ఆమె పేద దళిత మహిళగా జీవితాన్ని గడిపారు. ఆమె ఊరిలోనే ఉంటూ వ్యవసాయ కూలీగా జీవనాన్ని సాగించారు. ఆమెకు చిన్న కొడుకు విఠల్ మీద అమితమైన ప్రేమ కలదు. ఒక రకంగా తల్లి ప్రేమలో చిగురించారు విఠల్. ఈ రకంగా అందరి కన్నా చిన్నవాడైన విఠల్ తన తల్లి దగ్గరే ఎక్కువగా గడిపారు. అందువలన ఆయన పాటలు, సాహిత్యం, ఆలోచనా విధానం అంతా తల్లి నేపథ్యంతోనే ముడిపడి ఉంటుంది.

ఒక రకంగా చెప్పాలంటే విఠల్ ఆరోయేట వచ్చే వరకు ‘తల్లి లోకం’గా ఆడుతూ పాడుతూ అలసటే లేకుండా ఆహ్లాదంగా జీవించారు. గుమ్మడి విఠల్ తొలి గురువు తల్లి లచ్చుమమ్మ. ఆయన తల్లి లచ్చుమమ్మతో అత్యధిక ప్రేమానురాగాలు కలిగి ఉండేవారు. లచ్చుమమ్మ కంఠస్వరం చాలా శ్రావ్యంగా ఉండేది. ఆమె మట్టి వాసనలు గుబాలించే పల్లె పాటలు, జానపద పాటలు చాలా బాగా రాగయుక్తంగా పాడేవారు. ఆ పాటలను విఠల్ శ్రద్ధగా వింటూ తల్లిని అనుకరించేవారు. ఆ తల్లి విఠల్ కి ప్రేమను, పాటలను రంగరించి పోశారు.ఆ రకంగా తల్లి ప్రభావంతో విఠల్‌కి బాల్యంలోనే జానపద పాటలు, వాటి బాణీలు బాగా వంటబట్టాయి. విఠల్ తల్లి దగ్గరే జానపద పాటలు నేర్చుకొని పాడేవారు.

పాఠశాలకు సెలవులు ఉన్న రోజుల్లో విఠల్ తల్లితో పాటు కూలీ పనులకు వెళ్తూ శ్రమలోని బాధను, ఆనందాన్ని చిన్నతనంలోనే అనుభవించారు. ఆయన ఆయా పనుల్లో ఉండే పని – పాటలను విని గొంతెత్తి రాగయుక్తంగా పాడేవారు. గుమ్మడి విఠల్ సూక్ష్మగ్రాహి. ప్రతి విషయాన్ని చాలా తేలికగాను గ్రహించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండేవారు. ఆయన చిన్నప్పుడు చదువుకుంటూనే తల్లితో పాటు కూలీ పనులకు వెళ్లేవారు. అక్కడ కూలీలు పాడే పాటలు వినేవారు. ఆయన ఆ పాటలను బడిలోనూ, ఊరిలోనూ పాడేవారు. అలా పాటలు పాడడం ద్వారా విఠల్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా పరిచయమయ్యారు. విఠల్ తల్లి నుండి పాటలను మాత్రమే కాదు మానవత్వాన్ని కూడా పుణికిపుచ్చుకున్నారు. విఠల్ చిన్ననాటి జీవితాన్ని పరిశీలిస్తే తల్లితో పాటు పొలంలో పిడకలు ఏరేవారు, పేడ తట్టలు మోసేవారు. విఠల్ పేడ తట్టలు మోస్తున్నప్పుడు తన చుట్టూ ఉండే కష్టజీవులని చూసి వారు ఆలపించిన పాటలను ఆయన తన ‘బుడ్డర్ ఖాన్ వేషం’ లో అత్యద్భుతంగా ప్రదర్శించారు.

విఠల్ తల్లితో పాటు కూలీ పనులకు వెళ్తూ ఒకపక్క శ్రమలోని ఆనందాన్ని, మరోపక్క బాధలను చిన్నతనంలోనే అనుభవించారు. ఆయా పనులలో వ్యక్తమయ్యే పాటలను శ్రద్ధగా ఆలకించి క్రమంగా గొంతెత్తి పాడేవారు. ఆయన పాటలను ప్రజలు చాలా ఇష్టంగా ఆదరించేవారు. ఆయన భజన పాటలు, తత్వ పాటలు, చిరుతల రామాయణం పాటలు పాడారు. అంతిమంగా విఠల్ తల్లి నుండి కష్టించే తత్వం, మానవత్వాలను అందిపుచ్చుకొని సమాజ దార్శనికతలను అలవరచుకుని తన బతుకును సమున్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఆయన నిత్యకృషీవలుడిలా గొప్ప త్యాగపూరిత జీవితాన్ని గడిపి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

తల్లి లచ్చుమమ్మ ‘గద్దర్ పాటలకు పల్లవి’గా నిలిచారు. దాదాపుగా ఆయన రాసిన పాటలన్నింటికీ ఆమె బాణీలు, భావాలు అందించారు. ముఖ్యంగా గద్దర్ పాటలు నక్సల్బరీ తరం నుండి పుట్టుకు వచ్చాయి. ఆయన ముఖ్యంగా ‘రాయడం కన్నా తన నోటి నుండి వచ్చే ప్రతి మాటని పాట’గా మలచుకున్నారు. ‘సిరిమల్లె చెట్టుకింద లచ్చుమామ్మో లచ్చుమమ్మ / సినబోయి కూర్చున్నా వెందుకమ్మా ఎందుకమ్మా’ అనే పాటలో గద్దర్ తన తల్లి లచ్చుమమ్మని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఈ పాటలో ‘తల్లి లచ్చిమమ్మని విప్లవోద్యమం వైపు సార్వజనీనం చేస్తూ పీడిత ప్రజానీకం ఎర్రదండులో చేరి సకల సమస్యలను పరిష్కరించుకోవాలి’ అని నిర్దేశించారు. ‘ఏడిస్తే ఏమి సాధించలేవు అని ఎర్రదండులో చేరి మీ సాటి చెల్లెళ్లతో కలిసి మీ కొడుకును కలిసి పీడిత ప్రజల విముక్తికి పోరాటం’ చేయాలి అని ఆయన ముందుగానే చెప్పారు. నిజానికి గద్దర్ ఈ పాటని రాసిన కాలానికి అసలు ఎర్రదండు లేదు. కాని ఆయన ఊహా చిత్రాన్ని ఆ విధంగా అత్యద్భుతంగా అవిష్కరించడంలో ఆయనకు మరెవ్వరూ సాటిరారు. ఈ రకంగా ఆయన తల్లి లచ్చుమమ్మ ‘వాగ్గేయ గురువు’ గాను విశిష్ట పాత్రను పోషించి అంతిమంగా గద్దర్ ని ‘ప్రజా గాయకుడు’ గాను తీర్చిదిద్దారు అని ఘంటాపథంగా చెప్పవచ్చు.

జె.జె.సి.పి. బాబూరావు
94933 19690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News